Wednesday, March 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా?

పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా?

- Advertisement -

నార్సింగి మూసీలో నిర్మిస్తున్న లగ్జరీ భవనాలనూ కూల్చాలి
మధు పార్క్‌ నివాసితులకు అండగా ఉంటాం
హైడ్రా కమిషనర్‌ నార్సింగికి రావాలి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
బాధితులతో కలిసి ఆందోళన
కవిత అరెస్టు, అనంతరం విడుదల

నవతెలంగాణ-గండిపేట్‌
మూసీ సుందరీకరణ పేరుతో పేదల భూములను గుంజుకుని, లగ్జరీ అపార్ట్‌మెంట్లకు అమ్మేందుకు హైడ్రా వ్యాపారం చేస్తోందని, పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయమా..? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్కిల్‌లోని మూసీ నది మధ్యలో ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌పై, అక్రమ లగ్జరీ ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. మధుపార్క్‌ నివాసితులతో కలిసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనలను విరమించాలని జాగృతి నేతలను కోరారు. దాంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఘటనా స్థలానికి హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ రావాలని కవిత డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆందోళన ఉధృతం కావడంతో కవితను పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత ఆమెను విడుదల చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. మూసీకి ఆనుకుని ఉన్న పేదల భూములను హైడ్రా స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్‌ వేసి లగ్జరీ వ్యాపారస్తులతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం దారుణమన్నారు. బండ్లగూడ సర్కిల్‌లోని గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు పేరుతో మధు పార్క్‌ అపార్ట్‌మెంట్‌వాసుల ఇండ్లను కూల్చడం బాధాకరమని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని, దాన్నే కాంగ్రెస్‌ కొనసాగిస్తోందని, పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. పేదల ఇండ్లను కూల్చే హైడ్రాకు మూసీ పక్కనే నిర్మిస్తున్న అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఘటనా స్థలానికి హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ బుల్డోజర్లతో రావాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం కోర్టులకు సెలవులు ఉన్న రోజున హైడ్రా కమిషనర్‌ ఆధ్వర్యంలో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపించడం దారుణమన్నారు. హైదరాబాద్‌ శివారుల్లో పేదల ఇండ్లను కూల్చేసినందుకు ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

గాంధీ విగ్రహం కోసం రూ.5వేల కోట్ల అప్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ పెట్టక ముందే చుట్టుపక్కల ఉన్న ఇండ్లను కూలగొట్టడం సమంజసం కాదన్నారు. ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం, కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్నా అనుమతులు ఇస్తున్నారంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో తేలిపోతున్నదని ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి నేతలు, బాధితులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -