ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై కేంద్రం తీరు సరికాదంటూ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం-2021పై కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధనతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ విభేదించారు. ఈ చట్ట నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం పదే పదే కోరుతుండడంపై జస్టిస్ గవారు అసహనం వ్యక్తం చేశారు. బెంచ్ ఏర్పాటును తప్పించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వ్యాఖ్యానించారు. గవాయ్ పదవీ విరమణకు కొద్ది రోజులు ముందుగానే ఈ పరిస్థితి తలెత్తింది. ”ఇప్పటికే రెండుసార్లు మీరు కోరినట్లుగా వాయిదా వేశాం. ఇంకా ఎన్నిసార్లు జరగాలి? నవంబరు 24 తర్వాత దీన్ని కావాలనుకుంటే అప్పుడు మాకు చెప్పండి.” అని సీజేఐ అన్నారు. 24వ తేదీనే జస్టిస్ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. ”అత్యున్నత రాజ్యాంగ కోర్టు పట్ల మాకు గౌరవం వుంది. రేపు మేం ఎలాంటి కేసులు చేపట్టడం లేదు. రేపు విచారణ జరిపి, వారాంతంలో తీర్పు ఇవ్వాలనుకుంటున్నాం.” అని ఆయన చెప్పారు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని జస్టిస్ గవాయ్ విమర్శించడం ఇది రెండవసారి. దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా, రాజ్యాంగ ధర్మాసనానికి ఈ అంశాన్ని నివేదించాలంటూ ప్రభుత్వం కోరడంపై ఈ నెల 3న సీజేఐ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ”అసలు ఇలాంటి వైఖరితో కేంద్రం ఎలా ముందుకు వస్తోందో తెలుసుకుంటే చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నాం. కేంద్రం నుండి ఇలాంటి ఎత్తుగడలను మేం ఊహిం చలేదు.” అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. గత విచారణ సందర్భంగా కూడా మీరు ఈ అభ్యంతరాలు లేవనెత్తలేదు. వ్యక్తిగత కారణాలతో వాయిదా కోరారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత మీరు ఇలాంటి అభ్యంతరాలు లేవనెత్తరాదని అన్నారు. విస్తృత బెంచ్‌కు ఈ అంశాన్ని నివేదించాలన్న పిటిషన్‌ను జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ తోసిపుచ్చింది. ఒకవేళ విస్తృత బెంచ్‌కు రిఫర్ చేయాల్సిన అంశమని తేలితే అప్పుడు చేస్తామంటూ తదుపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేశారు.



