పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మంత్రులు పొంగులేటి, జూపల్లి, సురేఖ, సీతక్క
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న కాకతీయ నృత్య నాటకోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దనసరి సీతక్కతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ముందుగా ప్రముఖ నాట్య గురు, అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం, ఓరుగల్లు చరిత్ర కాకతీయ వైభవం గుర్తు చేస్తూ రాణిరుద్రమ చారిత్రక నాటకం, ప్రజా సాహిత్య కళారూపాలు ప్రదర్శనలు నిర్వహించారు. డాక్టర్ అలేఖ్య పుంజాల నృత్య దర్శకత్వంలో 30 మంది కళాకారులు చిట్యాల ఐలమ్మ జీవిత చరిత్రను కూచిపూడి నృత్య రూపకంలో ప్రజలను హత్తుకునేలా ప్రదర్శించారు.
ఈ నృత్య రూపకాన్ని డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించగా, సంగీత దర్శకులు వీబీఎస్ మురళి సంగీతం సమకూర్చారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కళాకారులను ఘనంగా సత్కరించారు. అంతకుముందు హనుమకొండ జిల్లా పర్యటనకు విచ్చేసిన వారికి హోటల్ హరిత కాకతీయలో వారిని ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మెన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ నగర సీపీ సన్‌ప్రీత్ సింగ్, సీఎండీ వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ వాజ్‌పేయి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా ‘కాకతీయ నృత్య నాటకోత్సవాలు’ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES