Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరాజ్యసభకు కమల్‌హాసన్‌ నామినేషన్‌

రాజ్యసభకు కమల్‌హాసన్‌ నామినేషన్‌

- Advertisement -

– తమిళనాడు సీఎం స్టాలిన్‌ సమక్షంలో దాఖలు
– ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కూడా హాజరు
– డీఎంకేతో ఒప్పందంలో భాగంగానే కమల్‌కు ఎగువ సభ సీటు
చెన్నై:
కన్నడ భాషపై తన వివాదాస్పద వ్యాఖ్యలతో వాయిదా పడిన ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. శుక్ర వారం ఆయన తమిళనాడు సచివాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్య మంత్రి ఎం.కె స్టాలిన్‌, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ హాజరై… కమల్‌కు మద్దతు తెలిపారు. వాస్తవానికి, కమల్‌హాసన్‌ బుధవారమే నామినేషన్‌ వేయాల్సి ఉంది. అయితే, తన తాజా చిత్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో భాగంగా కన్నడ భాషపై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అవి తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో దాని ప్రభావం ఆయన రాజ్యసభ నామినేషన్‌ వాయిదాకు దారి తీసింది. కన్నడ భాషపై కమల్‌ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర కలకలమే సృష్టించాయి. కర్నాటకలో ఆయన సినిమా రిలీజ్‌పై ప్రభావం పడింది. అది కోర్టు వరకూ చేరింది. ఈ నేపథ్యంలో, సినిమా వ్యవహారాలు చక్కదిద్దిన తర్వాతే నామినేషన్‌ వేయాలని ఆయన భావించారు. ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం గురువారం విడుదల కావడంతో, ఆయన శుక్రవారం తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కమల్‌ హాసన్‌తో పాటు డీఎంకేకు చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్లు వేశారు. వీరిలో సిట్టింగ్‌ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది పి విల్సన్‌, రోకియా మాలిక్‌, మాజీ ఎమ్మెల్యే శివలింగంలు ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కమల్‌ హాసన్‌ రాక 2018లో జరిగింది. ఆ ఏడాది ఆయన ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ప్రస్తుతం విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి ఎంఎన్‌ఎం మద్దతు ప్రకటించింది. ఈ పొత్తులో భాగంగా కుదిరిన ఒప్పందం ప్రకారం తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం ప్రచారం నిర్వహించింది. దీనికి ప్రతిఫలంగా, 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి ఒక స్థానం కేటాయించేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారమే ఇప్పుడు కమల్‌ హాసన్‌కు రాజ్యసభ స్థానాన్ని కేటాయించారు. దీంతో ఆయన ఎగువ సభకు వెళ్లేందుకు దాదాపు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad