- Advertisement -
- కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందనలు
- నవతెలంగాణ – కామారెడ్డి
- కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ప్రపంచంలోనే తొలి స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో విశేష ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించడంతో జిల్లా గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విజేతలను బుధవారం ఆయన ఛాంబర్ అభినందించారు. క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ వినూత్న స్పోర్ట్స్ హ్యాకథాన్ కార్యక్రమం గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతరంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలను రూపొందించారు.
- యువతలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. క్రీడల్లో పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఈ ఆవిష్కరణలు కొత్త దారులు చూపిస్తాయని తెలిపారు. ఈ పోటీల్లో కామారెడ్డి జిల్లా నుండి షటిల్ బ్యాడ్మింటన్ అండర్ – 17 గర్ల్స్ డబుల్స్ విభాగంలో అవని రెడ్డి, ఆరాధ్య రెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు.
- 2కే రన్, కరాటే అండర్ – 14 విభాగంలో కుమ్మరి ధనుష్ కుమార్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. అండర్ – 9 బాలుర సింగిల్స్‌లో శ్రీ వెంకట్ సిల్వర్ మెడల్ సాధించగా, అండర్ – 13 బాలుర డబుల్స్‌లో జై ప్రీత్, జిశాన్ కాంస్య పతకం గెలుచుకున్నారు. అలాగే అండర్ – 15 బాలుర డబుల్స్‌లో విష్ణు, నియాన్ కాంస్య పతకం సాధించగా, అండర్-15 గర్ల్స్ సింగిల్స్‌లో చేతన కాంస్య పతకం, అండర్-15 గర్ల్స్ డబుల్స్‌లో అక్షర, చేతన కాంస్య పతకాలు గెలుచుకున్నారు. జిల్లా క్రీడాకారులను వెలికి తీసి స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో పాల్గొనేలా చేసిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ( టి ఐ టి ఏ ) ఉత్తర తెలంగాణ జోన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, కోచ్ సందీప్ గౌడ్, కుమ్మరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



