– ఐటిఐ ప్రిన్సిపాల్ కోటిరెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ, ప్రభుత్వ ఐటిఐ కమ్మర్ పల్లి(బషీరాబాద్)లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను రెండవ విడత అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కమ్మర్ పల్లి ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ ఎం. కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, వెల్డర్, కోప, డ్రెస్ మేకింగ్ తోపాటు అధునాతన కోర్స్ అయినా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ట్రేడ్స్ లలో రెండవ విడత అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. పదవ తరగతి పాసైన, ఇంటర్ పాసైన/ఫెలైన, పై చదువులు చదువుతున్న విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశమని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశం అన్నారు.
నిజామాబాద్ జిల్లా ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడానికి ఈనెల 22 నుంచి 31 వరకు మీ దగ్గరలోని మీసేవ కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను స్కాన్ చేసి వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. అప్లై చేసేముందు పదవ తరగతి మెమో ప్రకారం పేరు, పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఉండేలా చూసుకోవాలన్నారు. అప్లై చేసేటప్పుడు నమోదు చేసుకునే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఐటిఐ కోర్స్ పూర్తయ్యేవరకు ఉండాలన్నారు. మొబైల్ నెంబర్ మారిస్తే అడ్మిషన్ రద్దు అవుతుందని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన సర్టిఫికెట్స్ ఉంటే లోకల్ గా పరిగణిస్తామని, ఇతర రాష్ట్రాలు జారీ చేసిన సర్టిఫికెట్స్ ఉంటే నాన్ లోకల్ గా పరిగణించడం జరుగుతుందని పేర్కొన్నారు. 16 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు అర్హులని, వయోపరిమితి లేదని వివరించారు. కోర్సుల వివరాలు, విద్యా అర్హతల కోసం www.iti.telangana.gov.in చూడాలని సూచించారు. ఇతర వివరాల కొరకు 8500466380, 8106794500 నంబర్లలో సంప్రదించాలని కోరారు.