నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని పురగిరి క్షత్రియ (పెరిక) సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సంఘ సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎంబడి సత్యం, అధ్యక్షులుగా కానగంటి శివలింగు, ప్రధాన కార్యదర్శిగా గూడ అశోక్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ ఎన్నికల ప్రక్రియ మంచిర్యాల జిల్లా కమిటీ అధ్యక్షులు బొడ్డు శంకర్, ప్రధాన కార్యదర్శి చుంచు రాజకిరణ్, బొడ్డు తిరుపతి, సంగా మనయ్య, చెల్లా విశ్వం, పయ్యావుల ముని ఆధ్వర్యంలో సజావుగా సాగింది. సంఘ ఐక్యతను ప్రతిబింబించే విధంగా ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తి కావడం విశేషంగా నిలిచింది.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కానగంటి శివలింగు మాట్లాడుతూ సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, యువతలో చైతన్యం కల్పించడం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. సంఘం బలోపేతానికి అందరి సహకారం అవసరమని, పరస్పర ఐక్యతతో ముందుకు సాగితే మరింత పురోగతి సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
గౌరవ అధ్యక్షులు ఎంబడి సత్యం మాట్లాడుతూ ..సంఘ పరంపరలను కాపాడుతూ కొత్త కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి గూడ అశోక్ సంఘ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జన్నారం మండల పురగిరి క్షత్రియ (పెరిక) సంఘానికి చెందిన ప్రజాప్రతినిధులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు , పెద్దలు, యువకులు, మహిళా సభ్యులు విస్తృతంగా పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నికపై పురగిరి క్షత్రియ కులస్తులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన బాధ్యతలు చేపట్టిన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.



