అంబేద్కర్ స్నేహితుడు, ప్రఖ్యాత సంస్కృత పండితుడు గంగాధర నీల కంఠ సహస్ర బుద్ది – మనుస్మృతిని తగలబెట్టాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. దాన్నే డా.బి.ఆర్. అంబేద్కర్ ఆచరించి చూపాడు. ”మనువు చాతుర్వర్ణాన్ని సృష్టించడం వల్ల శ్రమ విభజన చేయలేదు. కుల విభజన చేశాడు” – అని అన్నాడు. అదే విషయం తన ‘ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం’లో రాశాడు. ‘అబాలిషన్ ఆఫ్ కాస్ట్’ ‘హూ వర్ ద శూద్రాస్?’ వంటి పుస్తకాలలో కూడా తను మనుస్మృతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడోనన్నది వివరించాడు. 1927 డిసెంబర్ 25న మహద్‌లో అంబేద్కర్ మనుస్మృతిని తగులబెట్టి ఈ దేశ ప్రజలకు ఒక గొప్ప సందేశమిచ్చాడు.
లోగడ రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు దేశంలో అక్కడక్కడా ఉండేవారు. రానురాను వారు బలం పెంచుకుని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. రిజర్వేషన్ విధానాన్ని నిరసిస్తూ ఒక సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో రాజ్యాంగ ప్రతిని 2018లో దహనం చేశారు. దానికి సంబంధించిన వార్తలు, వీడియోలు దేశంలో దావానలంగా వ్యాపించాయి. ఫలితంగా తీవ్రమైన ప్రతిస్పందనలు కనిపించాయి. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీటన్నిటి ప్రభావంతో ప్రతివీధిలో, ప్రతి ఇంట్లో ఆ విషయం చర్చకు వచ్చింది. రాజ్యాంగాన్ని రద్దు చేసి, మనుస్మృతిని ఆచరణలోకి తేవాలని ఉవ్విళ్లూరుతున్న పాలకుల కనుసన్నల్లోనే ఆ దురాగతం జరిగి ఉంటుంది.
రాజ్యాంగ ప్రతిని దహనం చేసిన విషయం దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక క్లాస్ వన్ ఆఫీసర్ ఇంట్లో ఆయన భార్య, పనిమనిషితో మాట్లాడుతూ- ”మీ రాజ్యాంగాన్ని తగులబెట్టారటమ్మా!’ అని అంది. ఆర్థిక పరిస్థితులు బాగులేక ఆ మహిళ ఇళ్లల్లో అంట్లు తోముతూ ఉంది కానీ, ఆ పనిమనిషికి ఆవిషయం ముందే తెలుసు. వెంటనే స్పందించింది కూడా! ”అదేంటి మేడమ్ అలా అంటారూ? మా రాజ్యాంగమేమిటీ? అది మన అందరి రాజ్యాంగం! ఈ దేశ రాజ్యాంగం!!” – అని బదులిచ్చింది. ఒక పనిమనిషి ఇంత చైతన్యవంతంగా జవాబివ్వడం ఇంటి యజమానురాలు ఊహించలేక బిత్తరపోయింది. ఇంతలో పనిమనిషి మరోమాట కూడా అంది ”మీవారు పెద్ద ఆఫీసర్ కదా మేడమ్.. మరి ఆ సారు రాజ్యాంగం ప్రకారమే డ్యూటీ చేస్తున్నారు కదా?” అని!
ఆ పనిమనిషి పేరు కాంతాబాయి అహీరే. మహారాష్ట్ర ఔరంగాబాద్ నివాసి. ఔరంగాబాద్ పేరు మార్చి ఇటీవల శంభాజీనగర్‌గా పిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. పెద్దగా చదువుకోకపోయినా, గొప్ప సామాజిక చైతన్యం ఉన్న మహిళ కాంతాబాయి. నిమ్న వర్గాల వారిని ముఖ్యంగా స్త్రీలను అతినీచంగా పరిగణించే మనుధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ దహనం చేశారని ఆమెకు తెలుసు. అలాగే, మనుధర్మ శాస్త్రానికి రూపమిచ్చినవాడు మనువు అనీ, అతని విగ్రహం జైపూర్‌లోని రాజస్థాన్ హైకోర్టు ప్రాంగణంలో మనువాదులు ప్రతిష్టించుకున్నారనీ ఆమె తెలుసుకుంది. అలాంటి వాడి విగ్రహం హైకోర్టు ఆవరణలో పెట్టుకోవడమేమిటీ? అని బాధ పడింది. తనేమైనా చేయగలనా? అని ఆలోచించింది. జైపూర్ వెళ్లి, ఏదో విధంగా ఆ మనువు విగ్రహం బద్దలు కొట్టి వస్తే ఎలా ఉంటుందీ? అని అనుకుంది. అలా బద్దలు కొట్టి రావాలన్న కాంక్ష కాంతా బాయిలో రోజురోజుకూ బలపడింది. అయితే ఆమె ఆస్తిపాస్తులు లేని నిరుపేద. జీవనం సాగించుకోవడానికి అగరుబత్తులు తయారు చేస్తుంది. ఒక్కోసారి ఆ వ్యాపారం మందగించినపుడు గత్యంతరం లేక ఇళ్లలో పనిమనిషిగా కుదురుకుంటుంది. ఒక్కోసారి పొలం పనులకు, తోట పనులకు కూడా కూలికి వెళుతుంది.
కాంతాబాయికి మనసు కలిసిన ఒక స్నేహితురాలు ఉంది. ఆమెపేరు షీలాబాయి. నిర్మాణరంగంలో పనిచేసే కార్మికురాలు. ఒక్కోసారి ఆమె సీజన్‌లో కర్నాటకు వెళ్లి, అక్కడ చెరకు పంట కోసి, డబ్బులు సంపాదించుకుంటుంది. కాంతాబాయి అహిరే మనువు విగ్రహం సంగతి షీలాబాయికి చెప్పి, తనతో పాటు జైపూర్‌కు ప్రయాణం చేయించింది. ఇలా షీలాబాయి కూడా అంబేద్కర్ వాది కావడం మూలాన, విషయం అర్థం చేసుకుని బయలు దేరింది. అయితే వీరు ప్రయాణపు ఖర్చులు, తిండి ఖర్చులు భరిస్తూ శంభాజీ నగర్ నుండి జైపూర్ వెళ్లి రావడం చాలా కష్టమైన పనే. అందుకే కాంతాబాయి తెలిసిన వారిదగ్గర ఇరవై వేల రూపాయలు వడ్డీకి తీసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లు కలిసి ఒక ప్యాసింజర్ రైలు పట్టుకున్నారు. రెండురోజులు రైల్లో గడిపి, మూడో రోజు జైపూర్ చేరుకున్నారు. అక్కడ అడుక్కుంటూ అడుక్కుంటూ హైకోర్టు ఎక్కడుందో తెలుసుకుంటూ, చివరికి అక్కడికి చేరుకున్నారు.
మనుస్మృతి మహిళలకు వ్యతిరేకం గనుక, అక్కడి హైకోర్టు ఆవరణలో ఉన్న మనువు విగ్రహాన్ని కూల్చేయాలని వచ్చారు. అయితే, అక్కడ మరో సమస్య ఎదురైంది. విగ్రహం పగల కొట్టే సాధనాలు వెంట లేవు. రాళ్లతో కొట్టి ప్రయత్నించారు. శక్తి చాలలేదు. పని జరగలేదు. ఆ పని ఇక తమతో కాదని ఓ చోట కుప్ప గూలిపోయారు. వచ్చినందుకు ఏదో ఒకటి చేసి పోవాలి కదా?- అని బాగా ఆలోచించారు. ధ్వంసం చేయలేకపోతేపోయింది. ఆ మనువు విగ్రహం ముఖాన ఇంత నల్ల రంగైనా పూసిపోదామని నిశ్చయించుకున్నారు. నగరానికి కొత్త. ఏది ఎక్కడ దొరుకుతుందో తెలియదు. మళ్లీ అడుక్కుంటూ వెళ్లి షాపులన్నీ వెతికి, నల్లరంగు డబ్బా కొనుక్కొచ్చారు. ఇద్దరూ కలిసి ఎలాగోలా మనువు విగ్రహానికి నల్లరంగు పూశారు. శతాబ్దాలుగా భారతీయ సమాజాన్ని వెనక్కి నడిపించిన వాడికి ఇద్దరు మహిళలు తగిన శాస్తి చేశారు. విద్యావంతులు ధైర్యంగా చేయలేని పనిని ఇద్దరు మహిళా కూలీలు చేశారు. వారి సంకల్ప బలం గొప్పది.
వారు చేసింది సింబాలిక్‌గా ఒక నిరసన మాత్రమే. అయితేనేం, మహామహా మేధావులనే ఆలోచనలో పడేసింది. నిశ్శబ్దంగా రంగు పూసి వెళితే గొడవ అయ్యేది కాదేమో-కానీ, వారు విగ్రహం దగ్గరే నిలబడి ”రాజ్యాంగం వర్ధిల్లాలి!”-అని నినాదాలివ్వడం ప్రారంభించారు. దాంతో కోర్టులోని లాయర్లు, మెయిన్ రోడ్డున నడిచే స్థానికులూ వచ్చి చుట్టుముట్టారు. ఆ గుంపులో నుంచి కొందరు మనువాదులు ముందుకొచ్చి, విషయం గ్రహించి వారి మీద దాడి చేశారు. ఇంతా జరుగుతూ ఉంటే పోలీసుల కంటబడకుండా ఎలా ఉంటుంది? వాళ్లు రంగ ప్రవేశం చేసి, మహిళలిద్దరినీ తీసుకెళ్లి కోర్టు ముందు హాజరు పరిచారు. తర్వాత ఆరురోజులు పోలీసు కస్టడీలో ఉంచారు. తర్వాత మరో పందొమ్మిది రోజులు జైల్లో పెట్టారు. పేద మహిళలన్నది చూడలేదు. అంబేద్కర్ వాదులమని చెప్పుకున్నా వినలేదు. చావబాదుతూ జైల్లో పనులన్నీ చేయించుకున్నారు. ఊడ్చేపని, గిన్నెలు తోమేపని వారికి ఇక్కడ కూడా తప్పలేదు. అయినా ఆ మహిళలు దెబ్బలకు భయపడలేదు.
పనులకు వెరవలేదు. అసలు తమ తమ ఇళ్ల గురించీ, కుటుంబాల గురించి కూడా ఆలోచించలేదు. దేశం రాజ్యాంగం మీద నడుస్తూ ఉంటే, ఆ పనికిమాలిన మనువు విగ్రహం న్యాయస్థానం ఆవరణలో ఎందుకూ? దాన్ని వెంటనే అక్కణ్ణించి తొలగించాలని డిమాండ్ చేశారు. రోజురోజుకూ వారి డిమాండ్ బలం పుంజుకుంది. కాంతాబాయి, షీలాబాయి జైలులో ఉన్నప్పుడు కొంత మంది లాయర్లు వచ్చి సంప్రదించారు. అనుమతిస్తే తాము వారి తరఫున వాదిస్తామన్నారు. కాంతాబాయికి ఎవరిమీదా నమ్మకం కుదరలేదు. చివరకు బాబురావు బైర్వా అనే స్థానిక జైపూర్ న్యాయవాది వచ్చి సంప్రదించారు. తను అంబేద్కర్ వాదినని, జై భీమ్ మద్దతుదారునని పరిచయం చేసుకున్నాడు. ఆయన మాటతీరులో అంకిత భావం, నిబద్దత కాంతాబాయి అహిరే పసిగట్టింది. ఆయనను అనుమతించింది. బాబురావు తన శక్తి మేరకు వాదించి, బెయిల్ ఇప్పించాడు.
జైలు నుంచి బయటపడ్డారే గాని, తిరిగి వారి ఇళ్లకు మహారాష్ట్ర – శంభాజీనగర్ వెళ్లడానికి వారి దగ్గర డబ్బు లేదు. తిండి తినడానికి, ప్రయాణపు ఖర్చులకు డబ్బు కావాలి. గత్యంతరం లేక ఎవరి సలహా ప్రకారమో అజ్మీర్ వెళ్లారు. ఎందుకంటే, అది దగ్గర – రెండున్నర గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. పైగా అక్కడి తోటల్లో పనులు దొరుకుతాయని తెలిసింది.ఆ రకంగా ఆ స్నేహితురాళ్లిద్దరూ అజ్మీర్ వెళ్లి ఎనిమిది రోజులు గడిపారు. తోటపని చేస్తూ, హాటళ్లలో గిన్నెలు శుభ్రం చేస్తూ కొన్ని డబ్బులు సంపాయించుకున్నారు. చివరికి ఎలాగో ఇంటికి చేరారు. కాంతాబాయి జీవన పోరాటం మరో మలుపు తీసుకుంది. ఎందుకంటే, ఆమె ఇల్లూ, కుటుంబమూ ఉండాల్సిన చోట ఉండాల్సిన విధంగా లేవు. ఇల్లు లేదు. కుటుంబం వీధిన పడింది. మనువాదానికి వ్యతిరేకంగా కాంతాబాయి పోరాటానికి సంబంధించిన వార్తలు, ఫొటోలు పత్రికల్లో అచ్చుకావడం, వీడియోలు ప్రచారం కావడం వల్ల, వారి ఇంటి యజమాని కాంతాబాయి కుటుంబాన్ని ఖాళీ చేయించి వీధిన పడేశాడు.
”ఎందుకు అలా చేశావని?” కాంతాబాయి ఇంటి యజమానిని నిలదీస్తే ”నువ్వు ఒక ప్రమాదకరమైన మహిళవని అందరికీ తెలిసిపోయింది. మిమల్ని నేనెలా ఇంట్లో పెట్టుకోగలను? నా ఇల్లు. నా ఇష్టం- వెళ్లు, వెళ్లు” అని ఈసడించుకున్నాడు. ముందు కొన్నిరోజులు తెలిసిన వారి ఆశ్రయం పొంది, తర్వాత బంధువుల ఇళ్లలో గడిపి, కాస్త కుదురుకుని, మరో ఇల్లు అద్దెకు తీసుకుని, కాంతాబాయి కుటుంబం మళ్లీ స్థిరపడింది. ఇన్ని కష్టాలూ మనువుతో చేసిన పోరాట ఫలితమే! ఈ సంఘటన జరిగి ఎళ్లకేళ్లు గడిచిపోతున్నా మనువు విగ్రహం కాంతాబాయిని వెంటాడుతూనే ఉంది. జైపూర్ హైకోర్టు ప్రాంగణంలో మనువు విగ్రహాన్ని 1989లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న లాయర్లలో ఎక్కువ మంది ఉన్నత వర్గం వారు. సుందరీకరణ పేరుతో అనుమతులు సాధించుకున్నారు.”మొట్టమొదట, చట్టానికి రూపకల్పన చేసిన వాడు మనువు”- అని వారు భావించారు.
అయితే, అప్పుడే 1989 లో జోద్‌పూర్ కోర్టు సమావేశమైంది. నలభై ఎనమిది గంటల్లో గా మనువువిగ్రహాన్ని తొలగించాలని ఆదేశించారు కూడా! కానీ, ఫలితం శూన్యం. ఏమీ కాలేదు.
ఆ విగ్రహం ఇప్పటికీ అక్కడ అలాగే ఉంది.అందువల్లనే కాంతాబాయి 2018లో పూనుకోవాల్సి వచ్చింది. చదువులేదు, డబ్బులేదు, మురికివాడలో బతికే ఒక కాంతాబాయి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అంతటి పోరాటం చేస్తే, అన్నీ ఉండి, ఏమీ చేయలేకుండా ఉన్న వారంతా ఆలోచించుకోవాలి కదా? రాజ్యాంగంతో ప్రయోజనం పొందడం కాదు. దాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ఎదుర్కొని పోరాడాలి కదా? అది అందరి బాధ్యత !! ఏమీ చేయకుండా ఊరికే సిద్ధాంతాలు మాట్లాడే వారికన్నా, చేతలకు పూనుకునే ఇలాంటి ఉద్యమకారుల అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. నేటి సమాజం ఇలాంటి వారి సంఖ్యను గణనీయంగా పెంచుకోవాల్సి ఉంది!
-సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు



