– అభినందించిన ఏడీ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
దేశ రాజధాని ఢిల్లీ లో జనవరి 26 న జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ శ్రావణం కావ్య శ్రీ ఎంపికైంది. ఇటివల జరిగిన విశ్వవిద్యాలయం, రాష్ట్రస్థాయి లలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తన ప్రతిభను కనబరిచి “ప్రి రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ – 2026” గుజరాత్ లోని హేమ చంద్రాచార్య నార్త్ గుజరాత్ యూనివర్సిటీలో 31 అక్టోబర్ నుండి 9 నవంబర్ వరకు జరిగిన పోటీలో గెలుపొందింది. ఢిల్లీ లో జనవరి 26 న జరుగనున్న రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపు కు ఎంపిక కావడం ఎంతో గర్వకారణంగా ఉందని వ్యవసాయ కళాశాల అసోసియేషన్ డీన్ డాక్టర్ జే. హేమంత కుమార్ అన్నారు. ఈ క్యాంపు జనవరి 1 – 31 వరకు డిల్లీ లో జరుగనుంది. ఈ సందర్భంలో అసోసియేట్ డీన్ ఎంపికైన విద్యార్థిని ఎస్. కావ్య శ్రీ ని హృదయపూర్వకంగా అభినందించారు.
క్రమశిక్షణ,సేవాభావం,నాయకత్వ లక్షణాలు మరియు జాతీయ స్ఫూర్తితో ఆమె సాధించిన ఈ విజయం కళాశాల ప్రతిష్టను మరింత పెంచిందని పేర్కొన్నారు.అలాగే ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర విద్యార్థులు ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సమాజసేవ,దేశ సేవలో ముందుండాలని ఇలాంటి ప్రతిష్టాత్మకమైన క్యాంపులకు ఎంపిక కావడానికి కృషి చేయాలని వారు ప్రోత్సహించారు. ఈ విజయానికి కారణమైన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి,డాక్టర్ పి.ఝాన్సీ రాణి,అధ్యాపకులు,బోధనేతర సిబ్బందిని వారు అభినందించారు.



