Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో కీచక బాబా

ఢిల్లీలో కీచక బాబా

- Advertisement -

విద్యార్థినులపై లైంగిక వేధింపులు
అసభ్య సందేశాలు.. బ్లాక్‌మెయిల్‌లు.. బెదిరింపులు
పోలీసులకు 17 మంది బాధితుల ఫిర్యాదు
పలు అభియోగాల కింద కేసు నమోదు
పరారీలో నిందితుడు.. గాలింపు ముమ్మరం


న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ కీచక బాబా బాగోతాలు బయటకు వచ్చాయి. పలువురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ స్వామి చైతన్యానంద సరస్వతి ఎలియాస్‌ పార్థ సారథిపై ఆరోపణలు వచ్చాయి. బాధిత విద్యార్థినుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆయనను పట్టుకోవటానికి పోలీసులు బృందాలు గాలింపు చర్యలను తీవ్రం చేశాయి. ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో గల ఓ ప్రముఖ ఆశ్రమానికి పార్థ సారథి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన డైరెక్టర్‌గా ఉన్న విద్యాసంస్థలో ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌) కేటగిరిలో స్కాలర్‌షిప్‌లతో కొందరు విద్యార్థినులు పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ డిప్లొమా కోర్సులు చదువుతున్నారు.

నిందితుడు తమను లైంగిక వేధింపులకు గురి చేసేవాడని విద్యార్థినులు ఆరోపించారు. ఇక్కడ చదువుతున్న మొత్తం 32 మంది విద్యార్థినుల వాంగ్మూలాలను రికార్డు చేసిన పోలీసులు.. ఇందులో 17 మంది ఆ బాబాపై ఆరోపణలు వినిపించారని తెలిపారు. ఆయన తమపై అసభ్యకరమైన భాషను వాడేవాడనీ, అభ్యంతరకర సందేశాలు పంపేవాడనీ, శారీరకంగా కలవాలంటూ బలవంతం చేసేవాడని బాధితులు తెలిపారు. స్వామి చైతన్యానంద డిమాండ్లకు ఒప్పుకోవాలని మహిళా ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కూడా తమపై ఒత్తిడి తెచ్చారని బాధితులు వాపోయారు. ఆశ్రమంలో పని చేసేకొందరు వార్డెన్లు తమను బాబాకు పరిచయం చేశారని వివరించారు. అంతేకాదు.. విద్యార్థినులను గదికి రమ్మనేవాడు. విదేశీ టూర్లు అంటూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేసేవాడు. చెప్పినట్టు వినకపోతే మార్కులు తగ్గిస్తాననీ, ఫెయిల్‌ చేయిస్తానని బెదిరించేవాడు. ఈ నిందితుడు విద్యార్థినులతో జరిపిన సందేశాలు బయటకు వచ్చాయి.

బాధితుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాల కింద కేసును నమోదు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి అమిత్‌ గోయెల్‌ చెప్పారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడి నివాసంతో పాటు బాధితులు పేర్కొన్న స్థలాల్లో కూడా సోదాలు నిర్వహించారు. కాగా నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు. ఆయనను పట్టుకోవటానికి పోలీసు బృందాలు పలు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఈ కేసుపై జాతీయ మహిళా కమిషన్‌ (ఎస్‌సీడబ్ల్యూ) ఇప్పటికే స్పందించింది. దీనిని సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వామి చైతన్యానంద వాడిన ఓ ఓల్వో కారును ఇన్‌స్టిట్యూట్‌ బేస్‌మెంట్‌లో కనుగొన్నారు. అయితే ఆ కారుకు ఉన్నది నకిలీ నెంబర్‌ ప్లేట్‌గా గుర్తించారు. పోలీసులు ఆ వాహనాన్ని సీజ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -