Saturday, February 7, 2026
E-PAPER
Homeబీజినెస్కీలక వడ్డీరేట్లు యథాతథం

కీలక వడ్డీరేట్లు యథాతథం

- Advertisement -

సైబర్‌ బాధితులకు రూ.25వేల పరిహారం
వచ్చే ఏడాది జీడీపీ తగ్గొచ్చు : ఆర్బీఐ గవర్నర్‌ వెల్లడి

ముంబయి : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా నిర్ణయిస్తూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీలో రెపోరేటును 5.25 శాతంగా నిర్ణయించారు. శుక్రవారం మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వృద్ధి నమోదవుతుందన్నారు. అంతర్జాతీయంగా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు దేశీయ వృద్ధికి మరింత ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక ద్రవ్యోల్బణం ఈ ఏడాది 2.1 శాతంగా ఉండవచ్చని అంచనా వేశామన్నారు. జనవరి నాటికి దేశ విదేశీ మారక నిల్వలు 723.8 బిలియన్‌ డాలర్లకు చేరడం ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సంర 2025-26లో 7.4 శాతం వృద్ధి ఉండొచ్చన్నారు. వచ్చే 2026-27 తొలి త్రైమాసికం 6.9 శాతం, రెండో త్రైమాసికంలో 7 శాతం వృద్ధి అంచనా వేస్తోన్నామన్నారు.

మిస్‌సెల్లింగ్‌పైనా దృష్టి
డిజిటల్‌ మోసాల బారినపడే కస్టమర్లకు రక్షణ కల్పించే దిశగా ఆర్బీఐ ఓ నిర్ణయం తీసుకుంటుందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. చిన్న మొత్తంలో జరిగే మోసపూరిత లావాదేవీల వల్ల నష్టపోయే బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందించేలా నూతన విదివిధానాలను రూపొందిస్తున్నామన్నారు. ఖాతాదారుల భద్రతను పెంచేందుకు మూడు ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించామన్నారు. బ్యాంకుల్లో థర్డ్‌ పార్టీ ఉత్పత్తుల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలను (మిస్‌సెల్లింగ్‌) అరికట్టడంతో పాటు, రుణాల రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై కూడా కఠిన నిబంధనలు తీసుకురానున్నట్లు మల్హోత్రా తెలిపారు. బ్యాంకులు విక్రయించే సేవలు ఖాతాదారులకు ఎంతవరకు అవసరమనే దానిపై స్పష్టమైన ప్రమాణాలు నిర్దేశిస్తామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఈ మార్గదర్శకాలను విడుదల చేసి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -