Monday, March 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ ఆర్థికవ్యవస్థకు ఖర్గ్‌ మూలం

ఇరాన్‌ ఆర్థికవ్యవస్థకు ఖర్గ్‌ మూలం

- Advertisement -

ఈ ద్వీపం నుంచే 90శాతం ఆయిల్‌ ఎగుమతులు
లక్ష్యంగా అమెరికా వైమానికదాడులు
మూసుకుపోనున్న మరో జలమార్గం?

టెహ్రాన్‌ : ఇరాన్‌ ముడి చమురు వ్యాపారానికి ఆరో ప్రాణం ఖర్గ్‌ ద్వీపం. ఆ దేశ చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటాయి. అటువంటి కీలకమైన ఖర్గ్‌ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతానికి ఖర్గ్‌ ద్వీపంలోని ఇరాన్‌ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, తమ తదుపరి దాడి అక్కడి చమురు మౌలిక సదుపాయాలేనని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఖర్గ్‌ గురించి అంతటా చర్చ జరుగుతోంది.

ఖర్గ్‌ ద్వీపం ఎక్కడుంది ?
ఇరాన్‌ నైరుతి సముద్ర తీరానికి 26 కి.మీ దూరంలో ఖర్గ్‌ ద్వీపం ఉంది. హార్ముజ్‌ జలసంధికి వాయవ్య దిశలో దాదాపు 483 కి.మీ దూరంలో ఉన్న ఈ ఐలాండ్‌ ఇరాన్‌ ఓడరేవు నగరం బుషెహర్‌కు వాయవ్య దిశలో 55 కి.మీ దూరంలో ఉంది. ఈ ద్వీపం చుట్టూ చాలా లోతు వరకు సహజసిద్ధంగానే సముద్ర జలాలున్నాయి. అతిపెద్ద ముడిచమురు ట్యాంకర్లను సైతం నిలిపేందుకు అనుకూలమైన తీర ప్రాంతం కావడంతో ఆయిల్‌ ట్యాంకర్లు, నౌకల పార్కింగ్‌ కోసం ఖర్గ్‌ ద్వీపం చుట్టూ పెద్దసంఖ్యలో టెర్మినళ్లను ఇరాన్‌ నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో ఇరాన్‌ సైనిక స్థావరాలున్నాయి. ప్రత్యేకించి ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) పహారాలో ఖర్గ్‌ ఉంది. ఎందుకంటే ఇరాన్‌ ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటుంది. ఈవిధంగా దేశ ముడి చమురు వాణిజ్యంపైనా ఐఆర్‌జీసీకి బలమైన పట్టు ఏర్పడింది.

ఖర్గ్‌ ఇరాన్‌కు ఎందుకు ముఖ్యమైంది?
అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సేకరించిన 1984 నాటి డీక్లాసిఫైడ్‌ నోట్‌ ప్రకారం, ఖర్గ్‌ ద్వీపం ఇరాన్‌ పెట్రోలియం వ్యవస్థలో అత్యంత కీలకమైంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. 1980వ దశకంలో జరిగిన ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధ సమయంలో, 2003లో అమెరికా – ఇరాక్‌ యుద్ధం వేళ ఖర్గ్‌ ద్వీపం ప్రధాన టార్గెట్‌గా మారింది. యుద్ధ సమయంలో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఇరాక్‌ వందల సార్లు ఖర్గ్‌ ద్వీపంపై బాంబు దాడులు చేసింది. ఈ ద్వీపంలోని టెర్మినళ్లకు ఇరాన్‌లోని అబూజర్‌, ఫోరౌజాన్‌, డోరూడ్‌ చమురు, సహజ వాయువు క్షేత్రాల నుంచి ఖర్గ్‌ వరకు పైప్‌లైన్‌లు విస్తరించి ఉన్నాయి. ఈ పైప్‌లైన్ల వ్యవస్థ సముద్ర జలాల అడుగున ఉంటుంది. దీని ద్వారా ఖర్గ్‌కు చేరుకునే చమురు, సహజ వాయువును భారీ నౌకలు, ఆయిల్‌ ట్యాంకర్ల ద్వారా ప్రపంచ దేశాలకు సప్లై చేస్తుంటారు.

ఖర్గ్‌ ద్వీపంలో ఇరాన్‌ చమురు శాఖకు చెందిన మూడు ప్రధాన ఇంధన సౌకర్యాలు ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు ఫలాత్‌ ఇరాన్‌ ఆయిల్‌ కంపెనీ. ఇది రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్‌లో చమురును ఉత్పత్తి చేసే నాలుగు శుద్ధి కర్మాగారాల్లో ఇదే అతిపెద్దది. ఈ ద్వీపంలోనే ఖర్గ్‌ పెట్రో కెమికల్‌ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ యూనిట్లలోనే చమురు, ధ్రవీకత సహజ వాయువును నిల్వ చేస్తారు, ఎగుమతి చేస్తారు. ఇరాన్‌ ప్రభుత్వం ఖర్గ్‌లోని చమురు టెర్మినల్‌ నిల్వ సామర్థ్యాన్ని 2 మిలియన్‌ బ్యారెళ్లకు విస్తరించిందని 2025లో నివేదికలు వచ్చాయి. ఇక్కడున్న ప్రతీ చమురు ట్యాంక్‌కు ఒక మిలియన్‌ బ్యారెళ్ల చమురును నిల్వ చేసే కెపాసిటీ ఉంది.

ఇరాన్‌ ప్రతిదాడి ఎలా చేస్తోంది?
హార్ముజ్‌ మీదుగా ఇతర దేశాల ఆయిల్‌ ట్యాంకర్ల రాకపోకలను ఇరాన్‌ అడ్డుకుంటోంది. కానీ ఖర్గ్‌ ద్వీపం నుంచి చమురు సప్లైలను ఇరాన్‌ ఇంకా కొనసాగిస్తోందని తెలుస్తోంది. తాజాగా ట్యాంకర్‌ ట్రాకర్‌.కామ్‌ చేసిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం, మార్చి 11న (బుధవారం) ఖర్గ్‌ ద్వీపంలో అనేక పెద్ద ముడిచమురు ట్యాంకర్లు లోడ్‌ అవుతున్నట్టు వెల్లడైంది. ఈ యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి బుధవారం వరకు ఇరాన్‌ రోజుకు సగటున 1.1 మిలియన్‌ బ్యారెళ్ల నుంచి 1.5 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ఖర్గ్‌పై అమెరికా దాడిని ఇరాన్‌ తీవ్రమైన అంశంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఖర్గ్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్‌ ఘాటుగా బదులిచ్చే ఛాన్స్‌ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే, పశ్చిమాసియా, ఇజ్రాయిల్‌లలో ఉన్న ఇంధన సదుపాయాలకు నిప్పు పెడతామని ఇరాన్‌ సైన్యం హెచ్చరిక చేసింది. ఈ లెక్కన ఖర్గ్‌పై అమెరికా చేసిన తాజా దాడి, ఈ యుద్ధాన్ని మరింత సాగదీసే ముప్పు ఉంది.

హార్ముజ్‌తో ఇరాన్‌- ఖర్గ్‌తో అమెరికా ఒత్తిడి
ఖర్గ్‌ ద్వీపంలో చమురు వాణిజ్యం స్తంభిస్తే ఇరాన్‌ ఆర్థికంగా బలహీనపడటం ఖాయం. ఎందుకంటే ఇరాన్‌ చమురు వాణిజ్యంలో 90 శాతం ఆ ఒక్క ద్వీపం నుంచే జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఖర్గ్‌పై అమెరికా ఫోకస్‌ పెట్టింది. తద్వారా హార్ముజ్‌ విషయంలో ఇరాన్‌ వైఖరిని మార్చాలని భావిస్తోంది. హర్మూజ్‌ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడిని పెంచేందుకు ఇరాన్‌ యత్నిస్తోంది. దీనికి ప్రతిగా ఖర్గ్‌పై దాడులతో, ఇరాన్‌పై ఒత్తిడిని పెంచేందుకు అమెరికా యత్నిస్తోందని జేపీ మోర్గాన్‌ కంపెనీకి చెందిన గ్లోబల్‌ కమోడిటీ రీసెర్చ్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

ఖర్గ్‌ దెబ్బతింటే..
ఖర్గ్‌ ద్వీపం ఇరాన్‌ ప్రభుత్వానికి, సైన్యానికి నిధులు సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఒకవేళ ఖర్గ్‌లో ముడి చమురు వాణిజ్యం ఆగిపోతే ఇరాన్‌ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బ తింటుంది. ఫలితంగా సైనికశక్తి కూడా బలహీన పడుతుంది. అమెరికా కోరుకుంటున్నది ఇదే. ఒకవేళ ఖర్గ్‌పై అమెరికా దాడులు తీవ్రతరమైతే, ఇరాన్‌ కూడా బలంగా ప్రతిఘటించే ఛాన్స్‌ ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -