నవతెలంగాణ – హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ఓ భార్య ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటుచేసుకుంది. గుండెపోటుతో చనిపోయాడని నాటకమాడినా, మృతుడి స్నేహితుల అనుమానంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమ విచారణలో హత్య మిస్టరీని ఛేదించారు. పూర్తి వివరాల్లోకి వేలితే.. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండేవారు. ఆయనకు 2007లో లక్ష్మీమాధురితో వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, విజయవాడలోని ఓ సినిమా హాల్లో టికెట్ కౌంటర్‌లో పనిచేస్తున్న మాధురికి, సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారంపై చులకన భావంతో ఉన్న మాధురి, ఆ వ్యాపారాన్ని మాన్పించింది. అనంతరం వ్యాపారం పేరుతో భర్తను హైదరాబాద్ పంపించింది. కొన్నాళ్ల తర్వాత శివనాగరాజు తిరిగి గ్రామానికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మాధురి, అతడిని అంతమొందించాలని ప్రియుడు గోపితో కలిసి పక్కా ప్రణాళిక వేసింది. ఈ నెల 18న రాత్రి భర్త కోసం వండిన బిర్యానీలో 20 నిద్రమాత్రలను పొడి చేసి కలిపింది. అది తిన్న శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాక, రాత్రి 11:30 గంటల సమయంలో ప్రియుడు గోపి అక్కడికి చేరుకున్నాడు. శివనాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా, మాధురి దిండుతో ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసింది.
భర్త చనిపోయాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోగా, మాధురి ఏమాత్రం కంగారు లేకుండా రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. తెల్లవారుజామున 4 గంటలకు చుట్టుపక్కల వారిని పిలిచి, తన భర్త గుండెనొప్పితో మరణించాడని నాటకం మొదలుపెట్టింది. అయితే, అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా వచ్చిన శివనాగరాజు స్నేహితులు, మృతదేహం చెవి నుంచి రక్తం కారడం, గాయం ఉండటాన్ని గమనించి అనుమానంతో మృతుడి తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఊపిరాడకపోవడం వల్లే మరణించాడని, పక్కటెముకలు విరిగాయని రిపోర్టులో తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది. అనంతరం మాధురిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



