‘ఏ జీవన్ హై ఇస్ జీవన్ కా యహీ హై యహీ హై/ యహీ హై రంగ్ రూప్/ థోడే గమ్ హై థోడే ఖుషియా / యహీ హై యహీ హై/ఛావ్ ధూప్’ అంటూ సాగే ఈ అద్భుత పాటను రిహార్సల్ లేకుండా ఒకే టేకులో పాడిన అమర గాయకుడు కిషోర్ కుమార్. గాయకునిగా ఆయన బాణీ విలక్షణమైనది. ఆయన గళం కిర్రెక్కిస్తుంది.. పాట పరవశింప చేస్తుంది. నటన మత్తు చల్లుతుంది. దేవానంద్, అమితాబ్ బచ్చన్, రాజేశ్ ఖన్నా వంటి సూపర్ స్టార్స్ ఆయన పాటలతోనే వెలిశారు. ఆయన గానంతోనే అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. ఆయన గాత్రంలోని వైచిత్రిని పట్టుకొని, దానినే సాధన చేస్తూ తర్వాతి తరం వారు కొందరు గాయకులుగా జయకేతనం ఎగురవేశారు.
ఒక్కసారి ఆయన గానంతో పరిచయమైతే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మనసు బాగా లేనప్పుడు వింటే సేద తీరుతాం. ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకోవాలని భావించేవారు ఆయన పాటతోనే సావాసం చేస్తారు. ఎలా చూసినా ఆయన గాత్రం మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. సంగీత ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన ఈ ప్రతిభావంతుని వర్ధంతి అక్టోబరు 13న, ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ సోపతి పాటకుల కోసం అందిస్తున్న వ్యాసం.
కిశోర్ కుమార్ అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. 1929 ఆగస్టు 4న మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో జన్మించాడు. తండ్రి కుంజాలాల్ గంగూలీ న్యాయవాది. తల్లి గౌరీ దేవి సంపన్న బెంగాలీ కుటుంబం నుంచి వచ్చింది. ఖాండ్వాలోని గోఖలే కుటుంబం కుంజాలాల్‌ని తమ వ్యక్తిగత లాయరుగా ఉండమని ఆహ్వానించడంతో వారి కుటుంబం బెంగాల్ వదలి మధ్యప్రదేశ్‌కు వెళ్లింది. ప్రసిద్ధ క్యారక్టర్ నటుడు అశోక్ కుమార్, కిషోర్ కుమార్‌కు పెద్దన్నయ్య. మరొక అన్న అనూప్ కుమార్. కిషోర్ అందరికన్నా చిన్నవాడు. వారికి సతీదేవి అనే సోదరి కూడా వుంది. కిషోర్ కుమార్‌కు, అన్న అశోక్ కుమార్‌కు మధ్య 18 ఏండ్ల వ్యత్యాసం వుంది. కిషోర్ పిల్లవాడుగా ఉండగానే అశోక్ కుమార్ బాలీవుడ్‌లో హీరోగా స్థిరపడ్డాడు. కిషోర్ ఇండోర్‌లోని క్రైస్తవ కళాశాల నుంచి పట్టా తీసుకున్నాడు. అశోక్ కుమార్ బొంబాయిలో వుండడం చేత వీరి కుటుంబం తరచూ అక్కడకు వెళుతూ వుండేది.
సినీరంగంలో..
అభాస్ చదువు పూర్తయ్యాక తనపేరు ‘కిషోర్ కుమార్’గా తనే మార్చుకొని బాంబే టాకీస్ స్టూడియోలో అప్పుడప్పుడు కోరస్ పాడుతూ ఉండేవాడు. తర్వాత అన్న అశోక్ కుమార్ నటించిన చిత్రాల్లో చిన్నాచితకా వేషాలూ వేసాడు. నటునిగా దేవానంద్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘జిద్ది’ (1948) సినిమాలో సంగీత దర్శకుడు ఖేమ్ చంద్ ప్రకాష్ కిశోర్‌తో ‘మర్నే కి దువాయే క్యో మాంగూ, జీనేకి తమన్నా కౌన్ కరే’ అనే పాటను పాడించాడు. అందులోనే ‘ఏ కౌన్ ఆయా రే… కర్ కే యే సోలా సింగారే కౌన్ ఆయా’ అనే యుగళ గీతాన్ని తొలిసారి లతా మంగేష్కర్‌తో కలిసి ఆలపించాడు. దీన్ని దేవానంద్, కామినీ కౌశల్ మీద చిత్రీకరించారు. అయితే 1949లో గానీ కిషోర్ చలన చిత్ర జీవితాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. బాంబే టాకీస్ వారు 1951లో ఫణి మజుందార్ దర్శకత్వంలో ‘ఆందోళన్’ అనే సినిమా నిర్మిస్తూ అందులో కిషోర్‌ను హీరోగా పరిచయం చేశారు. అన్నకు కిషోర్‌ని ఒక మంచి హీరోగా నిలబెట్టాలని వుండేది. కానీ కిషోర్ మాత్రం గాయకుడిగా స్థిరపడాలనే ధ్యేయంతో ఉండేవాడు. 1946-55 మధ్య కాలంలో కిషోర్ 22 సినిమాల్లో నటిస్తే వాటిలో 16 సినిమాలు ఫ్లాపులే. కిషోర్ గాయకునిగా మొగ్గు చూపడానికి ఇదొక కారణం. ‘నౌకరి’ (1954)లో కిషోర్ కుమార్ హీరోగా షీలా రమణి హీరోయిన్‌గా నటించారు. ఆ చిత్రానికి సలీల్ చౌదరి సంగీత దర్శకుడు. ఆ సినిమాలో పాడించేందుకు సలీల్ చౌదరి ముందు ఒప్పుకోలేదు. కనీస సంగీత పరిజ్ఞానం కిషోర్‌కు లేదనేదే ఆయన అభియోగం. ‘అర్జి హమారీ ఏ మర్జి హమారీ’ అనే సోలో పాటను అయిష్టంగానే పాడించాడు. ఆ పాట సలీల్‌కు నచ్చడంతో హేమంత కుమార్ ఉషా మంగేష్కర్‌తో పాడాల్సిన ‘చోటా సా ఘర్ హౌగా’ పాటను కూడా కిషోర్‌తోనే పాడించారు. శంకర్ దాస్ గుప్త, శ్యామల్ మిత్రాతో కలిసి ఒక బంద గీతాన్ని కూడా కిషోర్ ఈ సినిమాలో పాడారు. 1955-66 మధ్య కాలంలో కిషోర్ నటించిన ‘లడ్కి’, ‘నౌకరి’, ‘బాప్ రే బాప్’, ‘పైసా హి పైసా’, ‘న్యూ ఢిల్లీ, ‘నయా అందాజ ‘భాయి భాయి’, ‘ఆషా’, ‘చల్తీ కా నామ్ గాడి’, ‘దిల్ కా థగ్’ వంటి సినిమాలు విజయవంతం కావడంతో కిషోర్ కుమార్‌కు నటన పట్ల ఆసక్తి పెరిగింది. ‘పడోసన్’ సినిమాలో కిషోర్‌కు మంచి పేరొచ్చింది. అప్పటి అగ్రశ్రేణి తారలతో హీరోగా నటించాడు. ‘హాఫ్ టికెట్’ సినిమాలో ‘ఆకే సీది లాగి దిల్ పే’ అనే పాటను కిషోర్, లతాజీతో పాడించాలని సలీల్ చౌదరి ప్లాన్ చేశారు. ఈ పాటను ప్రాణ్‌తో కలిసి తను ఆడవేషంలో వుండి పాడాల్సి వుండగా, లతా మంగేష్కర్ బొంబాయిలో లేకుండడంతో కిశోరే ఆడ, మగ గొంతుకతో పాడి సలీల్ చౌదరిని ఆశ్చర్యపరచాడు. తన అన్నలు అశోక్ కుమార్, అనూప్ కుమార్‌తో కలసి ‘ఛల్తీ కా నామ్ గాడీ’ చిత్రంలో వినోదం పండించారు. ఇది ఆయన సొంత చిత్రం కావడం విశేషం.
పాటల మెళకువలు నేర్పిన బర్మన్ దాదా
అశోక్ కుమార్ మొదటి నుంచే కిషోర్‌కి హితబోధ చేస్తూ వచ్చాడు. నేపథ్య గాయకుడిగా రాణించాలంటే కె.ఎల్.సైగల్‌ను అనుసరించకుండా తనదంటూ ఒక బాణీని ఏర్పరచు కోవాలని. బాంబే టాకీస్ వారు ‘మాషాల్’ (1950) సినిమా నిర్మిస్తున్న రోజుల్లో సచిన్ దేవ్ బర్మన్ ఒకసారి అశోక్ కుమార్ ఇంటికి వచ్చారు. కిషోర్ వేరే గదిలో సైగల్ పాడిన పాటను పాడుతూ వున్నాడు. బర్మన్, కిషోర్‌ని పిలిచి ‘బాగా పాడుతూ వున్నావు. కానీ సైగల్‌ను అనుకరిస్తున్నావు. ఇతర గాయకుల్ని అనుకరించి పాడేవాళ్లు గొప్ప గాయకులు కాలేరు. నీ భవిష్యత్తు నీ చేతిలోనే వుంది’ అని సలహా ఇచ్చి దీవించారు. కిషోర్, బర్మన్ దాదాకు ప్రియ శిష్యుడైపోయాడు. అతని వెంటే స్టూడియోలు తిరిగేవాడు. బర్మన్, కిషోర్‌కు పాటల మెళకువలు ఎన్నో నేర్పారు. బర్మన్ దాదా ద్వారా దేవానంద్‌తో కిశోర్‌కు పరిచయమైంది. ఫిల్మిస్తాన్ నిర్మించిన ‘టాక్సీ డ్రైవర్’, ‘మునీంజీ’, ‘పేయింగ్ గెస్ట్’ సినిమాలకు, నవకేతన్ నిర్మించిన ‘బాజీ’, ‘ఫంతూష్’, ‘నౌ దో గ్యారా’ సినిమాలకు సచిన్ దేవ్ బర్మన్ సంగీత దర్శకుడు కావడంతో కిషోర్‌కు ఆ సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది. దాంతో గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘టాక్సీ డ్రైవర్’ సినిమాలో కిషోర్ కుమార్ పాడిన ‘జీవన్ కే సఫర్ మే రాహీ’ అనే థీమ్ సాంగ్‌కు లతాజీ కంటే కిషోర్ పాడిన పాటకే మార్కులు ఎక్కువ పడ్డాయి. అప్పటికీ కొందరు సంగీత దర్శకులు కిషోర్‌కి శాస్త్రీయ సంగీతం రాదనే నెపంతో పెద్దగా అతన్ని ప్లేబాక్‌కు పిలిచేవారు కాదు. పైగా మహమ్మద్ రఫీ మంచి ఉచ్చ దశలో ఉండడంతో కిషోర్‌ని నటన నుండి దష్టి మరల్చవద్దని అన్న సలహా ఇవ్వడంతో ఒక పక్క వేషాలు వేస్తూనే ప్లేబాక్ పాడుతూ వచ్చాడు. కిషోర్ ప్రవేశించే నాటికే హేమాహేమీలైన తలత్ మెహమూద్, మహమ్మద్ రఫీ, మన్నాడే, ముఖేష్ హిందీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఆ సమయంలో బాంబే టాకీస్ ద్వారా అశోక్ కుమార్ నిర్మించిన ‘జిద్దీ’ సినిమా విజయం కిషోర్‌కు లాభించింది. ఆ రోజుల్లో రాజ్ కపూర్‌కు శంకర్-జైకిషన్ ద్వయం, దిలీప్ కుమార్‌కు నౌషాద్ ఆలి ఆస్థాన సంగీత దర్శకులు కావడంతో దేవానంద్, బర్మన్ దాదాను ఎన్నుకున్నాడు. పరోక్షంగా అది కిషోర్‌కు లాభించింది. పైగా దేవానంద్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లు కావడం కిషోర్‌కు ప్రయోజనం చేకూరింది. ‘ఫంతూష్’ సినిమాలో ‘హై మేరె టోపీ పలట్ కే ఆ’ అనే పాటకు స్వరాలు కూర్చింది సచిన్ కుమారుడు రాహుల్ దేవ్ బర్మన్. ఆ పాట హిట్టవడంతో కిషోర్ రాహుల్‌కి కూడా మంచి మిత్రుడై పోయాడు. దేవానంద్ ‘నౌ దో గ్యారా’ సినిమా ద్వారా తమ్ముడు విజయానంద్ (గోల్డీ)ని దర్శకుడుగా పరిచయం చేశాడు. గోల్డీకి మాత్రం దేవానంద్‌కు రఫీ చేత పాడిస్తే సినిమా బాగా ఆడుతుందని మనసులో వుండేది. కానీ దేవానంద్, బర్మన్ ఇద్దరూ కిషోర్ వైపే మొగ్గు చూపారు. అయితేనేం వారి అంచనాలను వధా కానీలేదు కిషోర్. ‘ఆంఖోం మే క్యా జీ రుపెహలా బాదల్’ అనే పాటను సిలోన్ రేడియోలో శ్రోతలు అదే పనిగా కోరేవారు.
వైవాహిక జీవితం
కిషోర్ కుమార్‌కు మొత్తం నాలుగు పెళ్లిళ్లు. అందరూ నటీమణులు కావడం విశేషం. మొదటి భార్య బెంగాలీ గాయని, నటి రుమా ఘోష్‌ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాలతో వివాహ జీవితం ఎనిమిదేండ్లకే ముగిసిపోయింది. వీరిద్దరి సంతానమే తర్వాతి రోజుల్లో గాయకునిగా ప్రసిద్ధి చెందిన ‘అమిత్ కుమార్’. ‘చల్తీ కా నామ్ గాడీ’, ‘ఝుమ్రూ’, ‘హాఫ్ టికెట్’ సినిమాలలో కిషోర్ సరసన హీరోయిన్‌గా నటించిన అందాలతార ‘మధుబాల’ను 1960లో కిషోర్ వివాహం చేసుకున్నాడు. మధుబాలకు చిన్నతనంలోనే గుండెలో రంధ్రం ఉండేది. కిషోర్ ఆమె అనారోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. లండన్ తీసుకెళ్లారు. ప్రయోజనం లేకపోయింది. కిషోర్‌కు ఆమె మీద మోజు తగ్గింది. దాంతో మధుబాల పుట్టింటికి వెళ్లిపోయింది. ఆరోగ్యం క్షీణించి 1969లో చనిపోయింది. 1976లో నటి ‘యోగితా బాలి’ని వివాహం చేసుకున్నాడు. రెండేండ్ల తర్వాత యోగితా, కిశోర్ నుండి విడాకులు తీసుకొని, నటుడు మిథున్ చక్రవర్తిని పెండ్లి చేసుకుంది. 1980లో కిశోర్ కుమార్ నాలుగవ సారి మరో నటి లీనా చందావర్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు. కడదాకా కిశోర్ ఆమెతో కాపురం చేశాడు. కిశోర్, లీనా చందావర్కర్ తనయుడు సుమిత్ కుమార్. 1987 అక్టోబర్ 13న కిశోర్ తన 58వ ఏటనే కన్నుమూశాడు. కిశోర్ మరణం తర్వాత లీనా చందావర్కర్, కిషోర్ మొదటి భార్య కుమారుడు అమిత్ కుమార్, సుమిత్ కుమార్‌లతోనే ఉంటున్నారు. ఏది ఏమైనా కిశోర్ కుమార్ నటునిగా, గాయకునిగా ఎంతటి విలక్షణమైన బాణీ పలికించారో, వ్యక్తిగతంగానూ తనదైన పంథాలో సాగారు. హిందీ సినిమా సంగీతం గురించి చర్చ సాగినంత కాలం కిశోర్ గానం కూడా ప్రాణం పోసుకొని ఉంటుందని చెప్పవచ్చు.
కిశోర్ జీవితం వ్యధభరితం
కిషోర్ జీవితంలో గాఢమైన వ్యధ ఉంది. ఏ పరిస్థితులలోనూ రాజీ పడలేదు. ఊపిరి పీల్చినంతకాలమూ దర్జాగా నవ్వుతూ, నవ్విస్తూ కాలం గడిపారు. కిషోర్ వ్యక్తిత్వాన్ని 90 శాతం గ్రహించిన వారు ఇద్దరే ఉన్నారు. ఆయన నలుగురు భార్యల్లో రెండవ భార్య మధుబాల, నాల్గవ భార్య లీనా చందావర్కర్. మధుబాలను కిషోర్ స్వప్న దేవతగా పేర్కొనవచ్చు. ఆమెను దష్టిలో వుంచుకొనే ‘రాత్ కలీ ఏక్ ఖాబ్ మె ఆయీ ఔర్ గలే కా హార్ హుయి…’ అన్నాడు. అయితే మధుబాలతో పెండ్లి జరిగిన సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె మతి చెందిన తర్వాత యోగితా బాలిని వివాహమాడారు. అనతికాలంలోనే నటి లీనా చందావర్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు. లీనాతో తిరిగి మధుబాలను దర్శింప గలిగాడు కిశోర్ కుమార్. జీవితంలో అనేక సందర్భాలలో తీవ్ర మనస్తాపానికి, పలువురి కువిమర్శలకు, ఎన్నో రకాల చికాకులకు గురైన కిషోర్ తన మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం చెక్కు చెదరనివ్వలేదు. వ్యక్తిగా కూడా కిషోర్ చాలా ఉన్నతుడు. చలన చిత్రాలలో గాని, స్టేజీ మీద గాని గంతులు వేస్తూ, మేనరిజంలను అభినయిస్తూ, ప్రజలను కడుపుబ్బ నవ్వించిన కిషోర్‌ది నిజానికి చాలా గంభీర స్వభావం. సినీ ప్రపంచ హంగామాలకు, ఆడంబర విన్యాసాలకు, పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు. ఆనందమైనా, దుఖఃమైనా తనలోనే ఇముడ్చుకొని, వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తనవరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి.
పురస్కారాలు
కిశోర్ కుమార్ ఉత్తమ పురుష నేపధ్య గాయకునిగా ఎనిమిది ఫిలిం ఫేర్ పురస్కారాలను పొందాడు. ఈ విభాగంలో అత్యధిక ఫిలిం ఫేర్ పురస్కారాలు పొందిన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతనికి మద్యప్రదేశ్ ప్రభుత్వం 1985-86లో ‘లతా మంగేష్కర్ పురస్కారం’ అందజేసింది. 1997లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కిషోర్ కుమార్ పురస్కారం’ ను ప్రారంభించింది. ఇటీవల 2012లో న్యూఢిల్లీలో జరిగిన ఓసియన్ సినీఫాన్ ఆక్షన్‌లో అతను విడుదల చేయని చివరి పాట రూ.15.6 లక్షలు (1.56 మిలియన్లు)కు అమ్ముడయి రికార్డు సష్టించింది.
సంగీత ప్రపంచానికి మార్గదర్శి కిషోర్ కుమార్
- Advertisement -
- Advertisement -