నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రంథాలయాలు దేశ సంస్కృతిని, చరిత్రను భావితరాలకు అందించే నిధి వంటివి. అలాంటి విజ్ఞాన భాండాగారంలో నేడు దేశవ్యాప్తంగా జరుపుకునే గణతంత్ర వేడుకులను నిర్వహించే వారే కరువయ్యారు. మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించకపోవడం పట్ల గ్రంథాలయ సిబ్బందికి గణతంత్ర దినోత్సవం పట్టింపు లేదా? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చి భారతదేశం సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశ ప్రగతిని, వారసత్వాన్ని భావిభారత పౌరులకు చాటి చెప్పే గ్రంథాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ రోజు జాతీయ జెండా ఎగర వేయకపోవడం గ్రంథాలయ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనం. రిపబ్లిక్ డే రోజు గ్రంథాలయానికి తాళం వేసి ఉండడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. గణతంత్ర వేడుకలను నిర్వహించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు గ్రంథాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



