Monday, June 2, 2025
E-PAPER
Homeసోపతిజ్ఞాన పోస్ట్‌

జ్ఞాన పోస్ట్‌

- Advertisement -

ప్రజల అవసరాలకు అనుగుణంగా తపాలా శాఖ ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. విద్యార్థులతో పాటు పుస్తకాలను అమితంగా ఇష్టపడే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి మరింత సౌకర్యవంతంగా ఉండేలా ”జ్ఞాన పోస్ట్‌” అనే ఒక ప్రత్యేకమైన సేవను ప్రారంభించింది. దీని ద్వారా పుస్తకాలను, విద్యా సంబంధిత మెటీరియల్‌ను దేశంలోని ఏ ప్రాంతానికైనా చాలా సులభంగా, సేఫ్‌గా పంపవచ్చు. గతంలో అందుబాటులో ఉన్న ”ప్రింటెడ్‌ బుక్‌ పోస్ట్‌”కు కొన్ని పరిమితులు ఉండటంతో గత ఏడాది అక్టోబర్‌ నుండి దాన్ని పూర్తిగా నిలిపివేశారు. దీని స్థానంలో ”జ్ఞాన పోస్ట్‌”ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ ”జ్ఞాన పోస్ట్‌” ద్వారా పుస్తకాలను పంపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. 300 గ్రాముల బరువు వరకు కేవలం 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ధర తక్కువ కావడంతో విద్యార్థులు, పుస్తక ప్రియులు ఈ సేవను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు పంపిన పుస్తకం ఎక్కడి వరకు చేరిందో తెలుసుకోవాలనుకుంటే తపాలా శాఖ ”ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌” అనే అదనపు సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఈ సౌకర్యాన్ని పొందడానికి అదనంగా మరో 17 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.
”జ్ఞాన పోస్ట్‌” ద్వారా పంపే పుస్తకాల విషయంలో తపాలా శాఖ కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. గుర్తింపు పొందిన విద్యా బోర్డులు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న విద్యార్థులకు వారి కరస్పాండెన్స్‌ (దూరవిద్య) లేదా రెగ్యులర్‌ (ప్రత్యక్ష) కోర్సుల సిలబస్‌లో సూచించబడిన అన్ని రకాల పుస్తకాలను దీని ద్వారా పంపవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల పోటీ పరీక్షలకు (ఉదాహరణకు: ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశ పరీక్షలు మొదలైనవి) ఉపయోగించే పుస్తకాలను పంపడానికి కూడా అనుమతి ఉంది. వీటితో పాటు సమాజం, సంస్కతి, మతపరమైన విషయాలకు సంబంధించిన సాహిత్యం, చట్టానికి లోబడి అధికారికంగా జారీ చేయబడిన లేదా ప్రచురించబడిన పుస్తకాలను కూడా ”జ్ఞాన పోస్ట్‌” ద్వారా పంపవచ్చు. అయితే ఈ విషయంలో తపాలా శాఖ నిర్దేశించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది.
నియమాలు: ”జ్ఞాన పోస్ట్‌” ద్వారా పుస్తకాలను పంపేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ నియమాలు సమర్థవంతమైన నిర్వహణకు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఉద్దేశించబడ్డాయి.
మొదటగా జ్ఞాన పోస్ట్‌ ద్వారా పంపే ప్రతి ప్యాకెట్‌ బరువుకు ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. మీరు పంపే ప్రతి ప్యాకెట్‌ కనీసం 300 గ్రాముల బరువు కలిగి ఉండాలి. అంతకంటే తక్కువ బరువు ఉంటే అనుమతించబడదు. అదే సమయంలో ప్యాకెట్‌ గరిష్ట బరువు 5 కిలోలను మించకూడదు. రెండవది.. ”జ్ఞాన పోస్ట్‌” సేవ కేవలం వ్యక్తిగత, విద్యా సంబంధిత అవసరాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. అందువల్ల ఎలాంటి వాణిజ్యపరమైన పుస్తకాలను (అంటే వ్యాపార లాభాల కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి విక్రయించే పుస్తకాలు) ఈ సేవ ద్వారా పంపడానికి కచ్చితంగా అనుమతి లేదు. మూడవది.. నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పకుండా ప్రచురించబడే పుస్తకాలు, పత్రికలు లేదా ఇతర ప్రచురణలు పంపడానికి అవకాశం లేదు. ఉదాహరణకు: వారపత్రికలు, పక్షపత్రికలు, నెలవారీ మ్యాగజైన్‌లు, రెండు నెలలకోసారి వచ్చే ప్రచురణలు, త్రైమాసిక పత్రికలు, అర్ధ వార్షిక పత్రికలుకు అనుమతి లేదు. నాల్గవది.. మీరు పంపే పుస్తకాలపై కేవలం పుస్తకాల జాబితా మాత్రమే ఉండాలి. పుస్తకాల విషయ సూచిక లేదా రచయిత పేరు వంటి సమాచారం ఉండవచ్చు, కానీ ఎలాంటి ప్రకటనలు (అంటే ఇతర ఉత్పత్తులు లేదా సేవలను ప్రోత్సహించే ప్రకటనలు) పుస్తకాలపై లేదా ప్యాకెట్‌లో ఉండకూడదు. చివరగా.. మీరు పంపే ప్యాకెట్‌లోని ప్రతి పుస్తకంపై తప్పనిసరిగా ప్రింటింగ్‌ ప్రెస్‌ పేరు లేదా పుస్తకాన్ని ప్రచురించిన ప్రచురణకర్త పేరు స్పష్టంగా ముద్రించి ఉండాలి. ఈ నియమాలన్నింటినీ తప్పనిసరిగా పాటిస్తే మీరు ”జ్ఞాన పోస్ట్‌” సేవను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు.
లక్షణాలు: మొదటగా ఈ సేవ ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ సౌకర్యం. మీరు పోస్ట్‌ చేసిన వస్తువును గమ్యస్థానానికి చేరుకునే వరకు ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ సేవను ఉపయోగించి ఎప్పటికప్పుడు దాని స్థితిని తెలుసుకోవచ్చు. అలాగే చిరునామా ఆధారిత సదుపాయం. మీరు పంపాలనుకుంటున్న చిరునామాకు నేరుగా డెలివరీ చేయబడుతుంది. పోస్ట్‌ ఆఫీస్‌లో మీ పుస్తకాన్ని బుక్‌ చేసుకున్న వెంటనే, మీకు అధికారిక రసీదు ఇస్తారు. ఈ రసీదు మీ పోస్టింగ్‌ ప్రామాణికమైన రుజువుగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు డెలివరీ సమయంలో గ్రహీత సంతకంతో కూడిన స్వీకరణ రుజువు (ూతీశీశీట శీట ణవశ్రీఱఙవతీy) కావాలనుకుంటే పొందొచ్చు. అదనపు రుసుము చెల్లించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. దీని ద్వారా మీ వస్తువు సరైన వ్యక్తికి చేరిందని మీరు కచ్చితంగా తెలుసుకోవచ్చు. ”జ్ఞాన పోస్ట్‌” కింద బుక్‌ చేయబడిన అన్ని ప్యాకెట్లు రోడ్డు, రైలు మార్గాల ద్వారా గమ్యస్థానానికి చేరుతాయి. చివరగా ఈ సేవ అన్ని పోస్ట్‌ ఆఫీస్‌ కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. మీ సమీపంలోని ఏదైనా పోస్ట్‌ ఆఫీస్‌కు వెళ్లి ఈ సేవను ఉపయోగించుకోవచ్చు.
పొరపాటున ఒక పోస్టల్‌ వస్తువును పంపిన తర్వాత వెనక్కి తీసుకునే, చిరునామా మార్చే సదుపాయం కూడా ఉంది. అయితే ఆ వస్తువు డెలివరీ కోసం ఇన్వాయిస్‌ చేయబడనంత వరకు, చట్ట ప్రకారం స్వాధీనం చేసుకోనంత వరకు మాత్రమే ఇది సాధ్యం. అలాగే మీరు పంపిన వస్తువును తిరిగి తీసుకోవచ్చు. అయితే దీని కోసం తపాలా శాఖ నిర్ణయించిన నిర్దిష్ట రుసుమును చెల్లించాలి. అలాగే డెలివరీ ఇన్వాయిస్‌ చేయనప్పుడే ఇది సాధ్యమవుతుంది.
– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -