కొలనులో పాక వేసిన
కొలిపాక జినదేవుడి జైనబంధం,
కొండలను తొలిచిన దారుల వెంట
రాళ్లురప్పలు ఏరిపారేస్తూ
నిప్పురవ్వల్లో కత్తిమొనల్లా
రాటుదేలిన సహవాసంతో
చీకటి గుయారాల్లోంచి
వెలుగులోకి నడచిన నేను!
ఊరువాడల చుట్టూ అల్లుకున్న
పంట పొలాల జీవనాధారంగా
సబ్బండకులాల సహజీవనం!
చెట్టుపుట్టా పామును
భయంగా పూజించిన చోటే
నేను చెక్కిన రాతి విగ్రహాలకై
మండపాలై గర్భగుడులై
జిజ్ఞాసతో ఆరాధనా స్థలాలుగా!
నదీతీరాల వెంట తీర్థ క్షేత్రాలుగా
నేనే రాసిన స్థల కాల పురాణాల వెంట
పద్దెనిమిది కులాల మఠాల
పరివేష్టిత సోమేశ్వరాలయం
శిథిల విగ్రహాల పురావైభవం!
బుద్ధుడు మహావీరుడు తీర్థంకరులు
వ్యాపార వాణిజ్యకుబేరుల ధనార్జనలో
పాలరాతి విగ్రహాల ఉత్సవం!
రాయగిరి రాళ్లలోంచి శ్వాసించిన
బుద్ధుడి విరాట్ స్వరూపం
హుస్సేన్‌సాగర్‌లో నిండా మునిగి
అభయహస్తంతో లేచి నిలుచున్నాడు
జలదిగ్బంధ శిలా వేదికపై
ఇటు కొలిపాకలో మారుమూల
అర్చనలో జైనముని మౌనం
నిఖిలేశ్వర్, 9177881201



