నవతెలంగాణ హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి ప్రవేశించారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కోట పనిచేశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తన కొడుకు మరణం తర్వాత మానసికంగా కూడా కృంగిపోయారు.
తెలుగు సినిమా లెజెండ్ కోట
తన నటనా ప్రస్థానాన్ని రంగస్థల నాటకాలతో ప్రారంభించారు. సినిమాల్లోకి రాకముందు దాదాపు 20 ఏండ్ల పాటు నాటక రంగంలో అనుభవం సంపాదించారు. బ్యాంకులో ఉద్యోగం చేస్తూ… నటకాలు వేసేవారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన, 750కి పైగా సినిమాల్లో నటించి, తనదైన ముద్ర వేశారు.
విలన్ పాత్రలతో పాటు కామెడీ, సెంటిమెంట్, సీరియస్ రోల్స్ లోనూ ఆయన ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా బాబూ మోహన్ తో కలిసి 60కి పైగా సినిమాల్లో నటించారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అహనా పెళ్లంట, మామగారు, హలో బ్రదర్, అతడు వంటి సినిమాల్లో ఆయన నటన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
కోట శ్రీనివాసరావు తన విలక్షణ నటనతో తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన నటనా శైలి, డైలాగ్ డెలివరీ, హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రావుగోపాల రావు వంటి లెజెండరీ నటుల తర్వాత, వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ వెండితెరపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆయన నటించిన చివరి కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు ఎంచుకున్నప్పటికీ, ఆ పాత్రలకు ఆయన ప్రాణం పోశారు.