Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయం

ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయం

- Advertisement -

ఆయన్ను ఎవరూ కాపాడలేరు
బీఆర్‌ఎస్‌ నాలుగు ముక్కలైంది
జూబ్లీహిల్స్‌ సీటు మాదే… : పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఈ ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్‌ జైలుకు వెళ్లడం పక్కా అని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. దీని నుంచి ఆయన్ను ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. మంత్రివర్గ అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మును ప్రయివేట్‌ వ్యక్తులకు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని తెలిపారు. ‘కేటీఆర్‌ ది పిరికిపంద చర్య. ఆయనే.. దమ్ముంటే అరెస్టు చేయండి అంటారు. రాత్రికి రాత్రే కోర్టుకు వెళ్లి నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారని మొసలి కన్నీళ్లు కారుస్తారు. ఇదంతా.. తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.’ అని వ్యాఖ్యానించారు.

సంఘటన్‌ శ్రీజన్‌ అభియాన్‌ (ఏఐసీసీ అబ్జర్వర్స్‌ మీటింగ్‌)లో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీ వచ్చిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలంగాణ భవన్‌లోని మీడియాతో మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ పరిశీలకులు నేరుగా జిల్లాల్లో సర్వేలు నిర్వహిస్తారని అన్నారు. అధ్యక్షుల ఎంపికలో స్థానిక కాంగ్రెస్‌ ప్రమేయం ఉండదని, ఆ జిల్లా పరిధిలో మండల స్థాయి నేతలతోనూ చర్చలు నిర్వహిస్తారని చెప్పారు. ఏడు మండలాలను కేసీఆర్‌ ఏపీలో కలపడానికి అంగీకరించడమే అతిపెద్ద తప్పని అన్నారు. ఆ ఏడు మండలాల ప్రజల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయని గుర్తు చేశారు. ‘స్థానికత అంశంలోనూ బీఆర్‌ఎస్‌ అలాంటి తప్పులే చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల బాధలు దారుణంగా ఉన్నాయి. ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించాను’ అని అన్నారు.

బీఆర్‌ఎస్‌లో నాలుగు ముక్కలాట నడుస్తోంది…
బీఆర్‌ఎస్‌ పార్టీలో నాలుగు ముక్కలాట నడుస్తోందని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. గత పదేండ్ల పాపాలు ఒకవైపు, బీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు మరోవైపు.. ఇక ఆ పార్టీ పునర్జీవం పోసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ఈ సమయంలో ఏం చూసి ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తారని అన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లోనే బీజేపీ ఉందని, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండు కలిసినా… తమకు సమానం కాదని తెలిపారు. ‘కవితది పొలిటికల్‌ సూసైడ్‌. ఆమె ఎందుకిలా చేస్తుందో తెలియదు. కాంగ్రెస్‌ పార్టీకి ఆ కుటుంబ పంచాయితీతో సంబంధం లేదు. ఆమెకు మంత్రిపదవి ఇస్తారనేది వందశాతం అవాస్తవం. పదేండ్లు అందినకాడికి దోచుకుని ఇప్పుడేమో డ్రామాలు ఆడితే సరిపోతుందా? ప్రజల అటెన్షన్‌ డైవర్షన్‌ చేయడానికి కేసీఆర్‌ ఆడించిన డ్రామానే.’ అని కొట్టి పారేశారు.

కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే అడ్డుకుంటుండ్రు…
బీసీ బిల్లులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని పీసీసీ చీఫ్‌ మండిపడ్డారు. బీజేపీ వాళ్లు తలచుకుంటే ఒక్కరోజులోనే పని అయిపోతుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మనసు పెడితే 24 గంటల్లో బీసీ బిల్లులకు ఆమోదం లభిస్తుందని చెప్పారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పేరు వస్తుందని వాళ్లు బీసీ బిల్లులను అడ్డుకుంటు న్నారని చెప్పారు.

బీజేపీని బీఆర్‌ఎస్‌ కాపాడుతోంది
బీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో చర్యలు తీసుకుంటానని చెప్పిన కిషన్‌ రెడ్డి ఎక్కడికి పోయారు? అని ప్రశ్నించారు. ‘సీబీఐకి అప్పగించి రోజులు గడుస్తున్నా.. కిషన్‌ రెడ్డి ఎందుకు నిద్రావస్థలో ఉన్నారు. సీబీఐ ఎందుకు ఆలోచిస్తోంది? ఆలస్యం చేస్తోంది? కావాలంటే.. తెలంగాణలోనే మేమే అరెస్టు చేయవచ్చు కానీ.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ కావున సీబీఐకి అప్పగించాం. కేసీఆర్‌లా నియంతపాలన చేయట్లేదు.’ అని అన్నారు. దీంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంత్యంత దారుణంగా ఉందన్నారు.

2018లో ఫోన్‌ ట్యాపింగ్‌తోనే అధికారంలోకి…
2018లో ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ‘ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ అతిపెద్ద కేసు. నన్ను విచారణకు పిలిచారు. వెళ్లి వివరణ ఇచ్చా. నాది, రేవంత్‌ రెడ్డి ఫోన్లను ఎన్నికల కంటే రెండున్నరేండ్ల ముందు నుంచే ట్యాప్‌ చేశారు. ప్రతి 14 రోజులకొకసారి గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఫోన్‌ రికార్డు వివరాలను టెలికం కంపెనీల నుంచి తీసుకుంది. రెగ్యులర్‌ ప్రాసెస్‌లో భాగంగా టెలికం కంపెనీలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యథావిధిగా మా ప్రభుత్వానికి రికార్డు అందజేశాయి. అలా.. మా ప్రభుత్వంలో ఫోన్‌ ట్యాపింగ్‌ బయటికి వచ్చింది. దాదాపు 650 మంది ఫోన్లు రికార్డు చేశారు.’ అని వివరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నమోదైన బీఎల్‌ సంతోష్‌ ఎమ్మెల్యేల కొనుగోలు దర్యాప్తు సాగుతోందని చెప్పారు.

జూబ్లీహిల్స్‌ సీట్‌ మాదే…
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి ఎప్పుడు బై ఎలక్షన్‌ జరిగినా ఆ సీటు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. అయితే..సర్వే ఆధారంగా, గెలుపు ప్రామాణికంగా అభ్యర్థిని నిలుపుతామని చెప్పారు. ‘నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, బాబా ఫసియుద్దీన్‌.. ఈ ముగ్గురూ ఆ నియోజకవర్గానికి చెందిన వాళ్లు. బొంతు రామ్మోహన్‌ కూడా రేసులో ఉన్నాడు. అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఆశిస్తున్నారు. ముగ్గురు మంత్రుల కమిటీ అక్కడ అన్నీ పరిశీలిస్తోంది. స్థానికులకే సీటు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. తుమ్మల, పొన్నం, వివేక్‌.. సైతం స్థానికులకే ఇస్తే బాగుంటుందని అంటున్నారు.’ అని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్‌ బై ఎలక్షన్‌ జరిగిందని… అప్పుడు ఇంతకన్నా ఎక్కువ సింపతి ఉన్నా స్థానిక ప్రజలు అభివద్ధికే పట్టం కట్టారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్‌ అవుతుందన్నారు. అయితే… ఇక్కడ గెలుపొందిన వారికి మంత్రి పదవి అన్న ప్రచారంపై స్పందిస్తూ, ఈ అంశం తన పరిధిలోనిది కాదన్నారు. ఏఐసీసీ అధిష్టానం, సీఎం మాత్రమే చూసుకుంటారని క్లారిటీ ఇచ్చారు.

ఖర్గే సూచనతో పాదయాత్ర…
ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే సూచనతోనే తాను పాదయాత్ర చేపట్టినట్టు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. ఈ యాత్రకు సీఎం సహకరించడం లేదని వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఖర్గే, రాహుల్‌ గాంధీ, సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర నేతలతో ఢిల్లీలో జరిగిన మీటింగ్‌లో ఈ ప్రోగ్రాం ఫిక్స్‌ అయిందన్నారు. తొలుత బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తాను చెప్పగా… ఖర్గే పాదయాత్ర చేయాలని సూచించారన్నారు. ఇందుకు సీఎం, రాష్ట్ర ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ను సహకరించాలని ఆదేశించారని… ఇందుకు సీఎం అంగీకరించగా, మీనాక్షి తాను కూడా పాదయాత్ర చేస్తానని చెప్పారన్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. పీసీసీ చీఫ్‌గా తాను ఏడాది కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -