కాంగ్రెస్ ఎమ్మెల్యే, విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
త్యాగాల కుటుంబం.. రాహుల్ గాంధీ కుటుంబంపై కేటీఆర్ మాట్లాడుతుంటే సిగ్గేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీని ఉరి తీయాలని కేటీఆర్ బలుపుతో మాట్లాడు తున్నారన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోయారని విమర్శించారు. కేసీఆర్ పని అయిపోయిందని, అధ్యక్ష పదవి కోసం హరీశ్‌రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారని అన్నారు. సోనియమ్మ దయతో ”మీ నాన్న ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి అయ్యావు” అని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై, మీపై కవిత చేసిన వ్యాఖ్యలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, రాహుల్ గాంధీ కుటుంబంపై మరోసారి మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.
అబద్ధాల పునాదులపై ఏర్పడిన ప్రభుత్వం ఎమ్మెల్యే కేపీ వివేకానంద
అబద్ధాల పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేండ్లుగా అబద్ధాలతోనే పాలన సాగిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆన్ రికార్డులోనూ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రజల విశ్వాసం కోల్పోయారని, అందుకే ప్రతి విషయానికీ దేవుడిపై ఒట్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతదేశ చరిత్రలోనే ఇలా దేవుడిపై ఒట్లు వేసింది సీఎం రేవంత్ రెడ్డినేని అన్నారు. సభలో సీఎం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అంతా అబద్ధాలేనని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తానే ఆపేయించానని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఇది పచ్చి అబద్ధమని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిందని, ఇప్పుడు సీఎం తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. కృష్ణా జలాల తాత్కాలిక ఒప్పందాన్ని శాశ్వత ఒప్పందం అన్నట్టుగా రేవంత్ సభను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, మినిట్స్ రికార్డును వక్రీకరించారని విమర్శించారు. సభలో సీఎం వ్యవహరించిన తీరు, మాట్లాడిన భాషపై తమ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని నిర్ణయించిందని, ఇప్పటికే సెక్రటరీకి అందించామని తెలిపారు. స్పీకర్ దీనిని ఆమోదించాలని కోరారు. సభలో సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడారని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శాసనసభను కౌరవ సభలా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం టైమ్‌పాస్ చేయడానికే జీరో అవర్‌ను నాలుగు గంటలపాటు సాగదీశారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తన మోసపూరిత, చిల్లర మాటలను మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు హర్షించరని హెచ్చరించారు. అబద్ధాలు చెప్పినందుకు రేవంత్‌రెడ్డి బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల పొట్ట కొడుతున్నారు..: ఎమ్మెల్యే పాయల్ శంకర్
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగులు సుఖపడతారనుకుంటే, ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికీ 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని, అయినా ప్రభుత్వానికి వారిపై కనీసం కనికరం లేదని అన్నారు.
గత పాలకులు పెట్టిన బకాయిలంటూ సాకులు చెబుతూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కోర్టును ఆశ్రయించిన వారికి, అందులోనూ కొందరికి మాత్రమే బకాయిలు చెల్లిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలే కారణమని చెప్పారు. ఉద్యోగులతో పెట్టుకుంటే మీ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించకపోతే వారి పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని, ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
విద్యావ్యవస్థ కుంటుపడుతోంది..
బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుబడుతోందని బీజేపీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క విద్యార్థీ లేని స్కూళ్లు తెలంగాణలో 45 శాతం ఉన్నాయని, ఈ విషయంలో దేశంలోనే రాష్ట్ర రెండో స్థానంలో ఉండటం చాలా బాధాకరమని అన్నారు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా సక్రమంగా లేవని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మాత్రమే పనులు ప్రారంభించిందని, మిగతా నియోజకవర్గాలను గాలికి వదిలేశారా? అని ప్రశ్నించారు. వెంటనే పాఠశాలలకు నిధులు మంజూరు చేసి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.



