కొండపైకి పెరిగిన అధికారుల దోపిడి, పత్తాలేని ఈవో
ఏసీబీకి చిక్కిన ఈఈపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి
ఇష్టారాజ్యంగా టెండరుదారుల వ్యవహారం
కొండపైన షాపులను వేలం వేయాల్సిందే
-బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి.. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి దేవస్థానాన్ని కాపాడండీ అంటూ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య వేడుకున్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ఆయన మాట్లాడుతూ కొండపైన మూడు నెలల కాలంలోనే ముగ్గురు ఈవోలు మారడం.. ఇంచార్జి ఈవో అందుబాటులోకి ఉండకపోవడంతో కొండపైన దోపిడి పెరిగిందని ఆవేదన చెందారు. రాష్ట్ర తొలిసీఎం కేసీఆర్ రూ.1300 కోట్లతో స్వామివారి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దితే, కాంగ్రెస్ పాలనలో ఆలయం పూర్తిగా దోపిడికి గురవుతుందన్నారు. కేసీఆర్ ఆలోచనకు చిన్నంగా కొండపైన వ్యవహారం కొనసాగుతుండన్నారు. ఇటీవల రూ. 1.90 లక్షల లంచాన్ని తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన దేవస్థాన ఈఈ వూడేపు రామారావుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని తెలిపారు. కొండపైన జరిగే ప్రతి కాంట్రాక్టులో ఆలయ అధికారులను ముట్టజెప్పకుంటే బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేదన్నారు.
టెండరుదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా ధరలు పెంచి భక్తులను హింసిస్తున్నారని తెలిపారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి, డీఈవో అందుబాటులో లేకపోవడంతోపాటు కిందిస్థాయి అధికారులు తమకుతోచిన విధంగా పనులు సాగించడంతో కొండపైకి భక్తులరావాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. దేవస్థాన రూల్స్ ప్రకారం వసూళ్లు చేయాల్సిన టెండరుదారులు రూ.100 కొబ్బరికాయలను విక్రయించడం దారుణమన్నారు. కొబ్బరికాయ కొట్టే ప్రాంతంలో భక్తుల వద్ద బలవంతంగా డబ్బులు వసూళ్లు చేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కొండపైన టెండర్ వేయాల్సిన స్వామి, అమ్మవార్ల వస్త్రాల విక్రయశాల స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆదేశాలతో తిరిగి వారికి అప్పగించి, ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. ఏసీబీకి చిక్కిన ఈఈపై నిష్పక్షపాతంగా విచారణ జరుపాలి.
ఐటీవల ప్రసాద విక్రయశాలలోని యంత్రాలకు సంబంధించిన గుత్తేదారుడి వద్ద నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ దేవస్థాన ఈఈ రామారావుపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని అన్నారు. వందల ఎకరాలు భూములు, రూ. కోట్ల విలువ చేసే విల్లాస్ పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఆయనకు ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో ఏసీబీ విచారణ చేపట్టాలన్నారు. ఆయనతో పాటు దేవస్థానంలో ఎంతో మంది ఏఈవోలకు సైతం విలువైన భూములు, ఆస్తులున్నాయంటూ పట్టణంలో చర్చ జరుగుతుందని, వీరిపైన సైతం ఏసీబీ దాడులు జరిపి విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు కవిడే మహేందర్, గడ్డమీది రవీందర్ గౌడ్, బండ బాలసిద్ధులు, పులేపాక అశోక్, తోటకూరీ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.



