లేనిపక్షంలో సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం
రైతుల ఉపాధిని దెబ్బతీసే కుట్ర
ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందా
దేవాలయం పేరుతో మోసం
దళారులుగా మారిన రెవెన్యూ అధికారులు
రైతులకు అండగా త్వరలో కార్యాచరణ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కుర్మిద్దలో కౌలు రైతుల భూసదస్సు
నవతెలంగాణ-యాచారం
‘ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూ దందా చేస్తోంది. దేవాలయం పేరుతో డ్రోన్లతో దొంగ సర్వేలు చేసి, 1400 ఎకరాల భూ సేకరణకు సిద్ధమవుతోంది. అదంతా మోసం.. భూసేకరణను ఆపాలి. లేదంటే రైతులకు అండగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే.. సీఎం కార్యాలయాన్ని సైతం ముట్టడించడానికి వెనుకాడం’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలపరిధిలోని నందివనపర్తి, తాడిపర్తి, కుర్మిద్ద, సింగారం గ్రామాల రక్షిత కౌలు రైతులతో మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కుర్మిద్దలో భూసదస్సు నిర్వహించారు. ముందుగా రైతుల సాగు భూములను సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు.
ఓంకారేశ్వర ఆలయం పేరుతో కొన్నేండ్లుగా ప్రభుత్వం రక్షిత కౌలుదారులను మోసం చేస్తోందని జాన్‌వెస్లీ విమర్శించారు. నాలుగు గ్రామాల పరిధిలోని 1400 ఎకరాల రక్షిత కౌలు రైతుల భూమిని ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకోవాలన్న ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఇలా భూసేకరణ చేసుకుంటూ పోతే రైతుల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. ఆ భూములపై ఆధారపడి బతుకుతున్న రైతులు జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. గ్రామ సర్పంచులు కౌల్దారులకు అండగా నిలబడి, భూసేకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ భూ సేకరణకు వ్యతిరేకంగా డప్పు చాటింపు చేసి రైతులను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.
భూసేకరణ చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు తెలివిగా రైతుల మధ్య చీలికలు తీసుకొస్తున్నారని విమర్శించారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో డ్రోన్లతో భూములను సర్వే చేసి ప్రభుత్వానికి పంపుతున్నారన్నారు. రెవెన్యూ అధికారులు దళారులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సేకరణను ఆపకపోతే రైతులతో కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరలోనే రక్షిత కౌలు రైతుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కందుకూరి జగన్, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, మంచాల మండల కార్యదర్శి రావుల జంగయ్య, నాయకులు పి.అంజయ్య, ఆలంపల్లి జంగయ్య, ఎస్.చందునాయక్, సింగారం సర్పంచ్ బోడ కృష్ణ, కుర్మిద సర్పంచ్ నీలం శ్రీవిద్య, తాడ్పర్తి సర్పంచ్ నీలం ఝాన్సీ, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కౌలు రైతులు పాల్గొన్నారు.
భూసేకరణ ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



