Saturday, September 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభూ నిర్వాసితులకు ఎకరాకు రూ.35 లక్షలు ఇవ్వాలి

భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.35 లక్షలు ఇవ్వాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రైతులతో కలిసి జయమ్మ చెరువును
సందర్శించిన బృందం
నవతెలంగాణ- నారాయణపేట

భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.35 లక్షల పరిహారమివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో శుక్రవారం రైతులతో కలిసి జయమ్మ చెరువు వరకు నాయకులు ద్విచక్ర వాహనాల ర్యాలీ తీశారు. మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలలో భాగంగా ఈ గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులతో జాన్‌వెస్లీ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం పని చేస్తున్నట్టు చెబుతున్న ఈ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి.. సొంత నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.14లక్షల పరిహారమే ఇస్తామనడం అన్యాయమన్నారు. భూనిర్వాసితుల కు న్యాయం చేయాలని కోరారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు.

బలవంతపు సేకరణ చేయొద్దని, భూ నిర్వాసితుల సమ్మతి మేరకే భూములను సేకరించాలని అన్నారు. 40 రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ పార్క్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన పరిహారాన్ని ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన భూములను ఇప్పుడు మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో వారు కోల్పోవాల్సి వస్తోందని అన్నారు. ఈ ప్రాంతంలో రూ.14 లక్షలకు ఎకరం భూమి ఎక్కడా రాదన్నారు. ఇప్పటికైనా సీఎం రైతులకు సరైన పరిహారం చెల్లించాలని, అలాగే నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. లేని పక్షంలో సరైన పరిహారం ఇచ్చేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్‌ ధరకు అనుగుణంగా భూపరిహారం అందించాలని, అప్పుడే భూ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.వెంకట్రాములు అన్నారు. భూ నిర్వాసితుల పక్షాన సీపీఐ(ఎం) చిత్తశుద్ధితో పోరాడుతుందని భరోసా ఇచ్చారు. భూములు కోల్పోతున్న వారికి సరైన పరిహారం ఇవ్వకుంటే మళ్లీ వలసలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ ప్రాంత వాసిగా ముఖ్యమంత్రి జిల్లా ప్రజలకు, రైతులకు సరైన పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జి.వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మచ్చేందర్‌, ఉపాధ్యక్షులు ధర్మరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, ఉపాధ్యక్షులు జోషి, నాయకులు సింగారం హనుమంతు, అంజి, అంజప్ప, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -