Tuesday, July 29, 2025
E-PAPER
Homeజాతీయంపారిశుధ్య కార్మికులపై లాఠీఛార్జి

పారిశుధ్య కార్మికులపై లాఠీఛార్జి

- Advertisement -

– పలువురికి గాయాలు
– అరెస్టులు, సిఐ తీరుతో ఉద్రిక్తత
– పోలీస్‌ స్టేషన్‌ ముందు పెద్ద ఎత్తున ఆందోళన
నెల్లూరు :
నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. దీంతో, పలువురికి గాయాలయ్యాయి. అరెస్టులు, సిఐ తీరుతో ఉద్రిక్తత నెలకొంది. పారిశుధ్య పనులను ప్రయివేటు కాంట్రాక్టర్లకు అప్పగించి తమ పొట్టకొట్టొదంటూ 14 రోజుల నుంచి ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయినా, అధికారులు పట్టించుకోకపోగా సోమవారం పోటీ కార్మికులను దించారు. నిప్పో, అయ్యప్ప గుడి సెంటర్లో వారితో పనిచేయిస్తుండగా మున్సిపల్‌ కార్మికులు అక్కడికి చేరుకున్నారు. పోటీ కార్మికులను దించి మా పొట్టగొట్టాలని చూడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలకుపైగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో తాము పని చేస్తున్నామన్నారు. మనమందరమూ పేదలమేనని, దళితులమని, మా పరిస్థితిని అర్థం చేసుకోవాలని పోటీ కార్మికులకు నచ్చజెప్పారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వేదాయపాలెం సెంటర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేసుకొని మున్సిపల్‌ కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరించారు. పత్రికల్లో రాయలేనటువంటి మాటలు మాట్లాడారు. అక్కడే ఉన్న యూనియన్‌ రూరల్‌ అధ్యక్షులు దేశమూర్తి దీనిపై పోలీసులను ప్రశ్నించారు. దీంతో, పోలీసులు రెచ్చిపోయారు. ఆయనతోపాటు కొంతమంది పారిశుధ్య కార్మికులను అరెస్టు చేసి వాహనం ఎక్కించడంతో మహిళా కార్మికులు అడ్డుకున్నారు. వారిని సైతం పోలీసులు వేదాయపాలెం స్టేషన్‌కు తరలించారు. అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, నాయకులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. సిఐటియు రూరల్‌ అధ్యక్షులు కొండిపసాద్‌ పారిశుధ్య కార్మికుల సమస్యలను సిఐ శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా, సిఐ పట్టించుకోకుండా ‘ముందు వీరిని పోలీస్‌ స్టేషన్లో పడేయండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో, సిఐటియు నాయకుడిపై పాటు మరికొంతమందినీ పోలీసులు స్టేషన్‌లోకి లాక్కెల్లారు. పోలీసుల చర్యను నిరసిస్తూ స్టేషన్‌ ఎదుట పారిశుధ్య కార్మికులు బైఠాయించి నినాదాలు చేశారు. ఆగ్రహించిన సిఐ శ్రీనివాసరావు నేరుగా రంగంలోకి దిగి వారిపై లాఠీఛార్జి చేశారు. దీంతో, 20 మందికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసి పోలీసు స్టేషన్‌ వద్దకు భారీ మున్సిపల్‌ కార్మికులు చేరుకున్నారు. తమ తోటి కార్మికులను రక్తం కారేలా కొట్టడం, అరెస్టు చేయడంపై నిలదీశారు. అక్కడి నుంచి వెంటనే వెళ్లకపోతే జిల్లాలోని పోలీసు యంత్రాంగాన్ని మొత్తం ఇక్కడకు తీసుకొస్తానంటూ వారిని సిఐ హెచ్చరించారు. అయినా, కార్మికులు భయపడకుండా ఆందోళన కొనసాగించారు. అక్కడికి సిపిఎం నాయకులు చేసుకొని పోలీసు అధికారులతోనూ, సిఐతోనూ మాట్లాడారు. దీంతో, కార్మికులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
పోలీసుల తీరు గర్హనీయం
మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులందరూ దళితులు, గిరిజనులని, అటువంటి వారిపై ఇంత అమానుషంగా ప్రవర్తించడం దుర్మార్గమని సిపిఎం, సిఐటియు నాయకులు అన్నారు. మీడియాతో వారు మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేయడం, గాయపర్చడం గర్హనీయమని తెలిపారు. సమస్యలను పరిష్కరించకపోగా పారిశుధ్య కార్మికులను నిర్బంధించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు, యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.పెంచల నరసయ్య, సిఐటియు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు సిఐటియు నాయకులు పి. సూర్యనారాయణ, కె.సతీష్‌, నాగేశ్వర్‌రెడ్డి, కోటేశ్వరరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
అమానుషం : సిపిఎం
మున్సిపల్‌ కార్మికుల పట్ల పోలీసుల అమానుషత్వాన్ని సిపిఎం జిల్లా కమిటీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. లాఠీఛార్జి చేయడం, గాయపర్చడం, అరెస్టు చేయడం, మహిళా కార్మికుల పట్ల కూడా దురుసుగా వ్యవహరించడం దుర్మార్గమని జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -