కేరళపై మోడీ ప్రభుత్వ ఆర్ధిక దిగ్భంధనానికి వ్యతిరేకంగా 12న తిరువనంతపురంలో భారీ నిరసన కార్యక్రమం
తిరువనంతపురం : కేరళపై కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక దిగ్భంధనం, వివక్షాపూరిత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న ఎల్‌డీఎఫ్ భారీ నిరసన కార్యక్రమం సత్యాగ్రహం నిర్వహించనుంది. తిరువనంతపురంలోని అమరవీరుల స్తూపంవద్ద జరిగే ఈ సత్యాగ్రహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు, ఎమ్మెల్యేలుతో పాటు కేరళ ఎంపీలు, ఎల్‌డిఎఫ్ సీనియర్ నాయకులు, సామాజిక, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. అలాగే, కేరళ భవిష్యత్‌పై శ్రద్ధ ఉన్న ప్రజలంతా ఈ సత్యాగ్రహంలో పాల్గొనాలని ఎల్‌డిఎఫ్ పిలుపునిచ్చింది.
ఈ సత్యాగ్రహం ద్వారా కేరళపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత విధానాలను, వాటికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇస్తున్న మద్దతు వైఖరిని ప్రజల ముందు ఉంచాలని ఎల్‌డిఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ అభివృద్ధి దృక్పథాన్ని కూడా ప్రజలకు ఎల్‌డీఎఫ్ తెలియజేయనుంది. అదేవిధంగా ఈ భారీ నిరసన కార్యక్రమం సందర్బంగా కేరళ నలుమూలకు మూడు వాహన యాత్రలను ఎల్‌డీఎఫ్ ప్రారంభించనుంది. ఈ యాత్రలు ఫిబ్రవరి 16న ముగుస్తాయి. కేరళ అభివృద్ధికి ముప్పుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ జోక్యాలకు వ్యతిరేకంగా పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని ఎల్‌డీఎఫ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
కేరళపై కేంద్రం ఆర్థిక దిగ్భంధనానికి నిదర్శనాలు
కేరళ రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఉద్దేశించిన నిధులను తగ్గించడం ద్వారా కేరళపై తీవ్రమైన ఆర్ధిక దిగ్భంధనాన్ని మోడీ ప్రభుత్వం విధిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులను రూ. 9,267.6 కోట్ల మేరకు కేంద్ర కోత విధించింది. అదే సమయంలో కేరళకు ఇవ్వాల్సిన రూ.6,947.36 కోట్ల బకాయిలను చెల్లించకుండా కేంద్రం పెండింగ్‌లో ఉంచింది. ఈ పెండింగ్ బకాయిల్లో ధాన్యం సేకరణ ప్రోత్సహకాలకు సంబంధించి రూ. 1,344 కోట్లు, సర్వ శిక్షా అభియాన్ కింద రూ. 1,066 కోట్లు, సామాజిక భద్రతా పెన్షన్లలో కేంద్రం వాటా అయిన రూ. 341 కోట్లు, జల్ జీవన్ మిషన్ కింద రూ. 650 కోట్లు ఉన్నాయి. అలాగే వీటికి అదనంగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్రం చేసిన మార్పుల వలన రాష్ట్రంపై రూ. 3,544 కోట్ల అదనపు ఆర్థిక భారం పడింది.



