Saturday, January 24, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మహిళా ఉద్యమ రథసారధులు

మహిళా ఉద్యమ రథసారధులు

- Advertisement -

దేశ వ్యాప్తంగా మహిళలందరినీ ఏకం చేసేందుకు 1981లో ఏర్పడిన ఐద్వా నాటి నుండి నేటి వరకు ఎన్నో ఉద్యమాలు నడిపింది. మహిళలు స్వేచ్ఛగా బతికేందుకు అనేక హక్కులు సాధించింది. ఆ హక్కులను కాపాడుకునేందుకూ పోరాడుతోంది. సమస్యలపై మహిళలను చైతన్యం చేసేందుకు అహర్నిశలూ కృషి చేస్తోంది. ఈ దిశగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘాన్ని నడిపించడంలో అనేక మంది నాయకురాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు. స్త్రీ సమానత్వ సాధనే లక్ష్యంగా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. నాటి నుండి నేటి వరకు ఐద్వాను నడిపినా.. నడిపిస్తున్న ఆ రథసారధుల సంక్షిప్త పరిచయం…

సుశీలాగోపాలన్‌
1930 నవంబర్‌ 27 జన్మించిన ఆమె 13 ఏండ్ల వయసులో తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఐదు దశాబ్దాలపాటు భారతదేశ వామపక్ష మహిళా ఉద్యమాన అత్యంత ముఖ్యమైన నాయకురాలిగా ఎదిగారు. చిన్న గ్రామాన కార్మికుల సభలో బెరుకు వక్తగా ప్రజాజీవితాన్ని ప్రారంభించిన ఆమె అతి తక్కువ కాలంలోనే ప్రజానేతగా ఎదిగారు. విద్యార్థిగా ఉద్యమ జీవితం ప్రారంభించిన ఆమె కార్మికవర్గ, ప్రజాతంత్ర ఉద్యమాల్లో గణనీయమైన పాత్ర నిర్వహించారు. పీచు పరిశ్రమలను పునరుజ్జీవింపజేయటం, ఇందులోని కార్మికుల పరిస్థితుల మెరుగు కోసం విశేషమైన కృషి సల్పారు. 1964లో మరరికులం నియోజకవర్గానికి జైలు నుండే పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కాలంలో వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. 1981లో ఐద్వాకు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. విభిన్న తరగతులకు చెందిన స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పని చేశారు. కుటుంబ హింస, లైంగిక వేధింపులపై ఆమె నాయకత్వాన అనేక పోరాటాలు చేశారు. 2001 వరకు ఐద్వా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. మరణించేవరకు ఐద్వా పోషకురాలిగా ఉన్నారు.

సుధా సుందరరామన్‌…
చెన్నైలోని ఎథిరాజ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో ఆంగ్ల సాహిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు ఎస్‌.ఎఫ్‌.ఐ ఉద్యమాలపై ఆసక్తి పెంచుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. వివాహం తర్వాత హింసకు గురవుతున్న మహిళల రక్షణ కోసం పని చేయడం ప్రారంభించారు. కొంత కాలం తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఐద్వాలో పూర్తికాలం కార్యకర్తగా చేరారు. 1995లో తమిళనాడు రాష్ట్ర ఐద్వా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2001 వరకు ఆమె ఆ బాధ్యతల్లో ఉన్నారు. చట్ట సభలల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కోసం తన గొంతు వినిపించారు. 2004 నుండి 2013 వరకు ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

శ్యామిలి గుప్తా…
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఈమె విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. 1963లో కమ్యూస్టు పార్టీలో చేరారు. బెంగాల్‌ ప్రావిన్షియల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌లో ముఖ్యమైన పాత్ర పోషించారు. 1963లో తన 18 ఏండ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1964లో సీపీఐ(ఎం) ఏర్పడిన తర్వాత అందులో చేరారు. కళాశాల అధ్యాపకురాలిగా కొంత కాలం పనిచేసిన ఆమె 1970లలో మహిళా ఉద్యమంలో పని చేయడం ప్రారంభించారు. ఐద్వా ఏర్పడక ముందు గణతాంత్రిక్‌ మహిళా సమితికి కీలక నిర్వాహకురాలిగా ఉన్నారు. 1983లో దాని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1996 వరకు ఆ హోదాలో పనిచేశారు. 1990లో ఐద్వాకు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో మహిళా ఉద్యమ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు. బెంగాలీ పత్రిక ఏక్‌ సాథే సంపాదకులుగా కూడా ఉన్నారు. 2010లో ఐద్వా అధ్యక్షురాలిగా ఎన్నికై మరణించే వరకు ఆ బాధ్యతలో కొనసాగారు. 2013లో బుద్ధగయలో జరిగిన ఐద్వా అఖిల భారత సమావేశంలో శ్యామలి గుప్తా అనారోగ్యానికి గురై కోల్‌కతాకు తిరిగి వచ్చిన తర్వాత 2013 నవంబర్‌ 25న మరణించారు.

మంజరి గుప్తా…
కమ్యూనిస్టులను వ్యతిరేకించే తండ్రి పెంపకంలో పెరిగిన ఈమె కమ్యూనిస్టు అయిన సాధన్‌ గుప్తాను వివాహం చేసుకున్నారు. అంతకు ముందు దేశంలో జరుగుతున్న ఉద్యమాల గురించి అవగాహన ఉన్నా పెండ్లి తర్వాతే ఉద్యమాల్లోకి అడుగుపెట్టారు. 1968లో మహిళల ప్రత్యేక పత్రిక ‘ఏక్‌సాథె’ ప్రారంభమైంది. ఈ పత్రికతో ఆనాటి నుండి మంజికి అనుబంధం. ఈ పత్రికద్వారానే ఆమెకు కనకముఖర్జీ పరిచయమయ్యారు. ఆమె సూచన మేరకు ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో, ఏంగెల్స్‌ రచించిన ‘కుటుంబం, స్వంత ఆస్థి, రాజ్యం పుట్టుక’ వంటి అభ్యుదయ సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. మహిళల సమస్యలపై లోతైన అవగాహన పెంచుకున్నారు. మ్యానిఫెస్టోను ప్రపంచ సాహిత్యంలోనే అద్భుతమైన కవితగా ఆమె పేర్కొంటారు. 1969లో సీపీఐ(ఎం) సభ్యురాలయ్యారు. అదే ఏడాది పశ్చిమబంగ మహిళా సమితి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం ఆవిర్భావ మహాసభల్లో మంజరి పాలుపంచుకున్నారు. అప్పటి నుండి 1990 వరకు ఆమె ఐద్వా అధ్యక్షురాలిగా పని చేశారు. 1993-2001 మధ్య కాలంలో ఆమె పశ్చిమబెంగాల్‌ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

జగ్మతి సంగ్వాన్‌…
హర్యానాలో కులదురంహార హత్యలకు, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈమె కేవలం ఉద్యమకారిణి మాత్రమే కాదు అంతర్జాతీయ క్రీడాకారిణి కూడా. ఆసియా వాలీబాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో సభ్యురాలు. హర్యానాలో అత్యుత్తమ క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక భీమ్‌ అవార్డు అందుకున్న తొలి మహిళా క్రీడాకారిణి. అంతేకాదు హర్యానాలో క్రీడల్లో మహిళల స్థితిగతులపై పీహెచ్‌డీ కూడా చేశారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త రైతు ఉద్యమంలో చురుకుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన కిసాన్‌ మహిళా సమితికి నాయకత్వం వహించారు. పంచాయతీ ఎన్నికల్లో నిరక్షరాస్యులు పోటీ చేయరాదన్న హర్యానా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసి పోరాడారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలో కీలకంగా ఉన్నారు. ఐద్వా హర్యాన రాష్ట్ర కార్యదర్శిగా మహిళా సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారు. అలాగే 2013లో ఐద్వా జాతీయ కార్యదర్శిగా ఎన్నికై 2019 వరకు ఆ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, సిపిఐ(ఎం) రోహూ తక్‌ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు.

బృందా కరత్‌…
1947 అక్టోబర్‌ 17న కోల్‌కతాలో పుట్టారు. గ్రాడ్యూషన్‌ పూర్తి చేసిన తర్వాత లండన్‌ వెళ్లి ఎయిర్‌ ఇండియాలో చేరారు. అక్కడ మహిళలందరు కచ్చితంగా స్కర్ట్స్‌ ధరించాలనే నిబంధనకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. అప్పుడే ఆమె వియత్నాంపై అమెరికా చేస్తున్న యుద్ధం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అదే సమయంలో మార్క్సిస్ట్‌ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితురాలయ్యారు. లండన్‌ ఎయిర్‌ ఇండియాలో నాలుగేండ్లు పని చేసిన తర్వాత 1971లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కోల్‌కతా వచ్చేశారు. అదే ఏడాది ఎంతో ఇష్టంగా సీపీఐ(ఎం)లో సభ్యత్వం తీసుకున్నారు. ప్రారంభంలో కళాశాలలో చేరి విద్యార్ధి ఉద్యమాల్లో పని చేయడం ప్రారంభించారు. ప్రజాసమస్యలపై కొంత అనుభవం గడించిన తర్వాత ట్రేడ్‌ యూనియన్స్‌ కార్యకలపాల్లో పాల్గోనేందుకు కోల్‌కతా నుండి ఢిల్లీకి వెళ్లారు. ఉత్తర ఢిల్లీలోని టెక్స్‌టైల మిల్లుల యూనియన్‌ ఆర్గనైజర్‌గా పని మొదలుపెట్టారు. అప్పటి నుండి కార్మిక ఉద్యమాల్లో, మహిళా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. 1980లలో అత్యాచార నిరోధక చట్టాలలో సంస్కరణల కోసం విస్తృత ప్రచారం చేట్టారు. 1993 నుంచి 2004 వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికై అనేక ప్రజాసమస్యలపై పార్లమెంటులో తన గొంతు వినిపించారు. కార్మిక, మహిళా ఉద్యమాలతో పాటు గిరిజన ప్రజల సమస్యలపై కూడా ఆమె అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారు. 2005లో సీపీఎంలో పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. సీపీఎం పార్టీలో పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు.

సుభాషిణి అలీ…
ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో భాగమైన కల్నల్‌ ప్రేమ్‌ సెహగల్‌, కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ల కుమార్తె. డెహ్రాడూన్‌లో వెల్హావమ్‌ బాలికల పాఠశాలలో చదివారు. మద్రాసులోని ఉమెన్స్‌ క్రిస్టియన్‌ కాలేజీ నుండి బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసి కాన్పూర్‌ యూనివర్సిటీ నుండి మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. తర్వాత సీపీఐ(ఎం)లో చేరి పూర్తి కాలం కార్యకర్తగా మారారు. రాజకీయ జీవితం ప్రారంభించిన తొలినాళ్ల నుంచే లక్షలాది మంది కష్టజీవులకు అండగా నిలిచారు. మహిళా విముక్తి, సాధికారత కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. సంపన్న కుటుంబంలో పుట్టినా సాధారణ ప్రజలతో మమేకమయ్యారు. క్రమంగా కార్మిక ఉద్యమాలకు నాయకురాలయ్యారు. కళలన్నా ఆమెకు ఎంతో ఇష్టం. చిత్ర పరిశ్రమకు కూడా ఎన్నో సేవలు అందించారు. వివిధ క్లాసిక్‌ చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశారు. ప్రగతిశీల, అభ్యుదయ పత్రికలకు క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తుంటారు. కార్మిక నాయకురాలిగా, ఐద్వా నాయకురాలిగా అప్పట్లో కాన్పూర్‌ రాజకీయాలను ఆమె ఎంతో ప్రభావితం చేశారు. 1989 సార్వత్రిక ఎన్నికలలో కాన్పూర్‌ పార్లమెంటుకు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని 56,587 ఓట్లతో ఓడించారు. 2001 నుండి 2010 వరకు ఐద్వా జాతీయ అధ్యక్షురాలిగా మహిళా సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. 2015లో సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరోకు ఎన్నికయ్యారు. ఈమె 2019లో కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను హిందీలోకి అనువదించారు.

మాలిని భట్టాచార్య…
1943 అక్టోబర్‌ 14న డాకా, బెంగాల్‌ ప్రెసిడెన్సీలో పుట్టిన ఆమె భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌) ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యనభ్యసించారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్‌సీ అభ్యర్థి మమతా బెనర్జీపై 30,900 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అలాగే 1991లో లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్‌సీ అభ్యర్థి సంతోష్‌ భట్టాచార్యపై 50,301 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2013 బుద్దగయలో జరిగిన ఐద్వా 10వ జాతీయ మహాసభల్లో అఖిల భారత అధ్యక్షురాలిగా ఎన్నికై 2023 వరకు ఆ బాధ్యతల్లో ఉండి అనేక మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అంతేకాదు మాలిని రచయిత్రి, పండితురాలు, అనువాదకురాలు, నాటక రచయిత్రి కూడా.

మరియం ధావలే…
ప్రస్తుతం ఐద్వా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. లింగ సమానత్వం కోసం జరిగిన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మహిళా హక్కుల కార్యకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లింగ సమానత్వం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆమె నాయకత్వంలో ఐద్వా చేస్తున్న పోరాటాలు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు పొందుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులపై తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈమె ముంబైలోని విల్సన్‌ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అక్కడే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమయింది. భగత్‌సింగ్‌ ప్రేరణతో ఆమె 1979లో స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.ఎఫ్‌.ఐ)లో పని చేయడం మొదలుపెట్టారు. ఆ సంఘంలో నాయకత్వ స్థాయికి ఎదిగారు. మహారాష్ట్ర ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని నిర్వహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. తర్వాత ఐద్వాలో పని చేయడం మొదలుపెట్టారు. మహారాష్ట్ర ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్రం వ్యాప్తంగా అనేక సమస్యలపై మహిళలను సంఘటిత పరచయడంలో విశేష కృషి చేశారు. 1988 నుండి 1994 వరకు ఆ సంస్థకు అఖిల భారత ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని మహిళలను సంఘటితం చేయడంపై ఆమె తన దృష్టి సారించారు. విద్య, గృహ హింస, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి హక్కుల సమస్యలపై అణగారిన వర్గాలను సమీకరించడంలో ఆమె గణనీయమైన పాత్ర పోషించారు. 2019లో ముంబయిలో జరిగిన జాతీయ మహాసభల్లో ఆమె ఐద్వా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆమె నాయకత్వంలో మత హింస, కుల ఆధారిత వివక్ష, మహిళా కార్మికులను ప్రభావితం చేసే నయా ఉదారవాద విధానాలపై ఐద్వా తన ప్రచారాలను విస్తరించింది. 2022లో మధురైలో జరిగిన సీపీఐ(ఎం) జాతీయ మహాసభల్లో ఆమె పొలీట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు.


పి.కె.శ్రీమతి…
ప్రస్తుతం ఐద్వా జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చూస్తున్న వీరు ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైర్‌ అయ్యారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన ఈమె మొదటి నుండి అభ్యుదయ భావాలతో పెరిగారు. పాఠశాలలో చదివేటప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. స్కూల్‌ స్థాయి నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. తర్వాత కాలంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా)లో పని చేయడం మొదలుపెట్టారు. 2001 నుండి 2011 వరకు ఎమ్మెల్యేగా ఎన్నికై అచ్యుతానందన్‌ కార్యవర్గంలో 2006 నుండి 2011 వరకు కేరళ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో మహిళలకు అవసరమైన అనేక వినూత్న పథకాలు రూపొందించారు. 2014లో కన్నూర్‌ లోక్‌సభ నుండి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలాగే కేరళ ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. కన్నూర్‌ జిల్లా పంచాయతీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా, కన్నూర్‌ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా, మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా, మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలిగా, కన్సల్టేటివ్‌ కమిటీ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సభ్యురాలిగా మహిళల ఆరోగ్యం కోసం అనేక కొత్త పథకాలు రూపొందించారు. అమ్మాయిలను రక్తహీనత నుండి కాపాడుకోవడం కోసం పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పౌష్టికాహారం అందించేలా ప్రయత్నించారు. సిల్క్‌ బోర్డ్‌ సభ్యురాలిగా ఉండి అనేక మంది మహిళలు పారిశ్రామిక వేత్తలుగా తయారయేందుకు కృషి చేశారు. కేరళ ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా కూడా కూడా పని చేశారు. పలు సమస్యలపై మహిళలను ఏకం చేసేందుకు విశేషంగా కృషి చేశారు. అలాగే ఆమె సీపీఐ(ఎం) జాతీయ కమిటీ సభ్యురాలు. 2023లో కేరళలో జరిగిన ఐద్వా జాతీయ మహాసభల్లో జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -