Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి చట్టబద్ధత

ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి చట్టబద్ధత

- Advertisement -

ఏకగ్రీవంగా ఆమోదించిన శాసన మండలి
దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా గుర్తింపు : వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించేందుకు ‘తెలంగాణ యూనివర్సిటీల చట్టం-1991’ని సవరిస్తూ రూపొందించిన బిల్లును శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్‌ మన్‌మోహన్‌ సింగ్‌ తెలంగాణ ఎర్త్‌ యూనివర్సిటీ బిల్లును మంగళవారం శాసన మండలిలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1978లో స్థాపించిన కొత్తగూడెం స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ (తర్వాతి కాలంలో ఇంజినీరింగ్‌ కాలేజీ)ని అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. డిసెంబర్‌ 2025లో ప్రారంభమైన ఈ వర్సిటీకి, తాజా చట్ట సవరణ ద్వారా పూర్తి స్వయంప్రతిపత్తి లభిస్తుందన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి వచ్చే రెండేండ్లలో రూ.500 కోట్లు కేటాయించనున్నామని తెలిపారు. యూనివర్సిటీ విస్తరణ కోసం 310 ఎకరాల భూమి అందుబాటులో ఉందని చెప్పారు. ఎర్త్‌ సైన్సెస్‌ కోసం ఏర్పడ్డ దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అని అన్నారు. సింగరేణి గనులు, గోదావరి నది, అటవీ సంపద ఉన్న కొత్తగూడెం ప్రాంతం విద్యార్థులకు లివింగ్‌ లాబొరేటరీగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న బీటెక్‌ కోర్సులతో పాటు, కొత్తగా బీఎస్సీ జియాలజీ, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌, ఎంఎస్సీ కోర్సులను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. చట్టబద్ధత వల్ల యూనివర్సిటీకి సొంతంగా కరికులమ్‌ రూపొందించుకునే స్వేచ్ఛ, యూజీసీ నిధులు, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. సింగరేణి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.. తెలంగాణను మైనింగ్‌, జియాలజీ రంగాల్లో గ్లోబల్‌ లీడర్‌గా నిలబెట్టేందుకే ఈ యూనివర్సిటీని స్థాపించినట్లు మంత్రి సభకు వివరించారు.

ఏర్పాటే కాదు… నిధులు కేటాయించండి స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యుల సూచన
యూనివర్సిటీని ఏర్పాటు చేసి వదిలేయకుండా భారీగా నిధులు కేటాయించాలని సభ్యులు తీన్మార్‌ మల్లన్న డిమాండ్‌ చేశారు. రూ.500 కోట్లు సరిపోవనీ, వీటిని రెండింతలు పెంచడంతో పాటు పరిశోధనలకు ప్రత్యేక కేటాయిపులు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల్లాగా కాకుండా పెద్ద ఎత్తున బడ్జెట్‌ కేటాయించాలని సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జేఎన్‌టీయూ పరిధిలో 230 కాలేజీలున్నాయనీ, 130 కాలేజీలకు కొత్త యూనివర్సీటిని ఏర్పాటు చేయవచ్చని కాంగ్రెస్‌ సభ్యులు బల్మూరి వెంకట్‌ అన్నారు. ఈ గణాంకాలను పరిగనలోకి తీసుకుని సంగారెడ్డిలో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇండియా ర్యాంకింగ్‌లో రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలు చాలా వెనకబడ్డాయనీ, ఇది ఆందోళన కలిగించే విషయమని బీజేపీ సభ్యులు మల్క కొంరయ్య పేర్కొన్నారు. సభ్యుల అభిప్రాయాలను పరిగనలోకి తీసుకుంటామని మంత్రి సభకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -