Tuesday, April 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచేయిచేయి కలుపుదాం..కుల నిర్మూలనకు అడుగులేద్దాం...

చేయిచేయి కలుపుదాం..కుల నిర్మూలనకు అడుగులేద్దాం…

- Advertisement -

ఆధునిక యుగంలో మనం అంతరిక్షానికి వెళ్తున్నాం, కృత్రిమ మేధస్సును సృష్టిస్తున్నాం. కానీ, మనిషి మెదడులో వేల ఏళ్ల క్రితం నాటి కులపిచ్చి మాత్రం రూపుమాప లేకపోతున్నాం. దీనికి ప్రధాన కారణం, పాలకవర్గాలు పెంచిపో షిస్తున్న కులమే. కులం అనేది కేవలం ఒక వర్గీకరణ కాదు, అది ఒక మానసిక రోగం. ఇది మనుషుల మధ్య గోడలు కట్టి, సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను ఒక క్రమపద్ధతిలో స్థిరపరు స్తోంది. కులం ఎక్కడ ఉంటుందో అక్కడ సమానత్వం ఉండదు, సమానత్వం లేనిచోట నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అన్నట్లుగా ”కులం అనేది కేవలం శ్రమ విభజన కాదు, అది శ్రామికుల విభజన” ఒక వ్యక్తికి ఉన్న ప్రతిభను కాకుండా, అతడు పుట్టిన కులాన్ని బట్టి అతడి వత్తిని నిర్ణయించడం వల్ల దేశం గొప్ప మేధావులను, సజనాత్మకతను కోల్పోతోంది. కుల వ్యవస్థ వల్ల సామాజిక చైతన్యం దెబ్బతిని, ఒక వర్గం మరో వర్గాన్ని అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఇది జాతీయ సమగ్రతకు, దేశాభివద్ధికి పెద్ద అడ్డంకి.

మనువాద సిద్ధాంతం కొన్ని కులాలకే ‘పవిత్రతను’, ‘ఉన్నతత్వాన్ని’ కట్టబెట్టింది. కానీ, నిత్యజీవితంలో మనం చూస్తున్న నైతిక విలువలు అందుకు భిన్నం. రోడ్లూడ్చే ఒక సామాన్య పారిశుద్ధ్య కార్మికురాలు ప్రజ్ఞ, తనకు దొరికిన రూ.45 లక్షల విలువైన బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి, మనిషికి ఉండాల్సిన అసలైన సంస్కారాన్ని చాటిచెప్పారు. అదే సమయంలో, సమాజంలో గొప్పగా గౌరవించబడే పండిత కండారారు రాజీవరు వంటి పూజారులు దేవాలయంలో కిలోల కొద్దీ బంగారం దొంగిలిస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోతున్నారు. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఒక్కటే? మనువాదులారా! ఇప్పుడు ఉన్నతులెవరు? ఎవరు అధములు? నైతికత అనేది పుట్టుకతో వచ్చేది కాదు, అదిచేసే పనిలో, చూపే గుణంలో నిరూపించే ఘటనలివి.

రాజకీయ క్రీడలో కులం దాగి ఉంది. విద్వేషం విషం కక్కుతున్నది. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల అసమానతలు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులపై ,ధర్మం పేరుతో,సనాతనం పేరుతో, రిజర్వేషన్ల పేరుతో దాడులు జరుగుతున్నాయి. అధికారం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి అగ్రకులాధిపత్యాన్ని స్థిరపరిచే ప్రయత్నాలు చోటుచేసుకుంటున్నాయి.అధికార పీఠాన్ని దక్కించుకోవడం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టి, అగ్రకుల ఆధిపత్యాన్ని స్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘సనాతనం’, ‘ధర్మం’ పేరుతో రాజ్యాంగబద్ధమైన హక్కులైన రిజర్వేషన్లపై దాడులు ఎక్కువయ్యాయి. యూనివర్సిటీలు అగ్రహారాలుగా మారాయి. జ్ఞానాన్ని పంచాల్సిన యూనివర్సి టీలు నేడు కుల వివక్షకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో ఇటీవల 175 కుల దురహంకార హత్యలు జరగడం మన సామాజిక స్థితిగతులకు అద్దం పడుతోంది. మనిషి ప్రాణం కంటే కులం పట్టింపే ఎక్కువైందనడానికి ఇవి నిదర్శనం. దీనికి తోడు ‘కల్చరల్‌ డామినేషన్‌’, ‘సింబలిక్‌ వైలెన్స్‌’ ద్వారా అణగారిన వర్గాల అస్తిత్వాన్ని తక్కువ చేసి చూపే ధోరణి పెరుగుతోంది. ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులు చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని సష్టించబడుతోంది.

కులం లేని సమాజం సాధ్యమేనా అని నిరాశ పడేవారికి తమిళనాడుకు చెందిన స్నేహ పార్తిబరాజా ఒక దిక్సూచి. దశాబ్ద కాలం పాటు న్యాయపోరాటం చేసి, దేశంలోనే మొట్టమొదటిసారిగా ”కులం లేదు, మతం లేదు” అనే అధికారిక సర్టిఫికెట్‌ను సాధించారు. తాను కేవలం భారతీయురాలినని, మనిషినని సగ ర్వంగా చాటుకున్నారు. కుల సంకెళ్లను తెంచుకోవాలనుకునే కోట్లాది మందికి ఆమె ఒక స్ఫూర్తి. కులంపై పోరాటంలో మనకు చాలమంది గొప్ప మహనీయుల చరిత్ర మనకు మార్గదర్శకత్వంగా ఉంది. ”విద్య లేకపోతే విత్తు లేదు, విత్తు లేకపోతే నీతి లేదు, నీతి లేనిచోట నైతికత లేదు. ఇదంతా ఒక్క అవిద్య వల్లనే జరిగింది” అని జ్యోతిబా ఫూలే పేర్కొన్నారు. కుల అణచివేతకు మూలం చదువు లేకపోవడమేనని ఆయన చెప్పారు. ”మనిషిని మనిషిగా గౌరవించని ఏ ధర్మమైనా అది ధర్మం కాదు” అని పెరియార్‌ గర్జించారు.

కులం అనేది ఒక సామాజిక నిర్మాణం మాత్రమే కాదు, అది ఒక సాంస్కతిక సమస్య. దీన్ని చట్టాలతో మాత్రమే కాదు, కళారూపాలతో, ప్రత్యామ్నాయ సంస్కృతితో జయించాలి. మనువాద చీకట్లను ఎదిరించే ధైర్యం ప్రతి గొంతుకలో ఉండాలి. ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే శక్తులను పసిగట్టి, మానవీయ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలి. అన్ని రకాల ఆధిపత్యాన్ని, అణచివేతను, దోపిడీని వ్యతిరేకిస్తూ.. మనువాద భావజా లానికి వ్యతిరేకంగా మనమంతా ఒక వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోనే కుల రహిత సంఘాలు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాల, వివిధ సంస్థల సహకారంతో ఏప్రిల్‌ 11 నుంచి14 వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం (బాగ్‌ లింగంపల్లి, హైదరాబాద్‌) కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్నది. నేడు ముగింపు సందర్భంగా చేయి చేయి కలుపుదాం, కుల నిర్మూలన మానవహారం నిర్మిద్దాం. ఒకే కుటుంబంగా జీవిద్దాం. కుల నిర్మూలన దిశగా అడుగులేద్దాం.

భూపతి వెంకటేశ్వర్లు
9490098343

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -