Wednesday, April 30, 2025
Homeప్రధాన వార్తలుధాన్యం కొనరేం..!

ధాన్యం కొనరేం..!

– ఎక్కడికక్కడే నిలిచిన వడ్లకుప్పలు
– పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు
– నిజామాబాద్‌ జిల్లాలో సొసైటీకి తాళం వేసిన రైతులు

నవతెలంగాణ- మక్లూర్‌/వీపనగండ్ల/ వెల్దుర్తి/మల్హర్‌రావు(కాటారం)
ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తే.. సకాలంలో కొనుగోళ్లు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను పంపకపోవడంతో కొనుగోలు జరగడం లేదని, దాంతో ఎక్కడి కుప్పలు అక్కడే ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలోని గొట్టుముక్కల గ్రామానికి చెందిన రైతులు మాక్లూర్‌ సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ ధాన్యం బస్తాలను వెంటవెంటనే తరలించడం లేదని, వెంటనే లారీలు తెప్పించి ధాన్యం బస్తాలు రైస్‌ మిల్లర్లకు తరలించాలని సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌ను నిలదీశారు. సిబ్బందిని బయటకు పంపించి కార్యాలయానికి తాళం వేసి సుమారు అరగంట పాటు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ శేఖర్‌కు సమాచారమివ్వగా ఆయన రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ రైతులు వినలేదు. దాంతో రైస్‌ మిల్లుల యజమానులతో ఫోన్‌లో మాట్లాడారు. రైస్‌ మిల్లులో ఖాళీ అయిన లారీలను రెండు రోజుల్లో గొట్టుముక్కల గ్రామానికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామ రైతులు.. పండించిన ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే నిర్వాహకులు తాలు ఉందనే నెపంతో కొనుగోలు చేయకుండా వారం రోజులుగా నిలిపివేశారు. దీంతో రైతులు బస్టాండ్‌ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రోడ్డుమీద వరి తాలు పట్టే మిషన్లు ఉంచి ధర్నా చేశారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను, ఇతర వాహనాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు, రైస్‌ మిల్లర్లు కలిసి రైతులను దోపిడీ చేసేందుకు తాలు కారణం చూపి కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ వరలక్ష్మి, ఏపీఎం బుచ్చన్న, గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు చుక్క కమల శ్యామల కరుణాకర్‌ యాదవ్‌, స్థానిక పోలీసులు రైతులు రాస్తారోకో చేస్తున్న దగ్గరికి చేరుకొని వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు స్పష్టం చేయడంతో.. ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. బుధవారం లోపు ధాన్యం కొనుగోలు చేయాలని, లేకుంటే మళ్లీ ఆందోళన నిర్వహిస్తామని రైతులు స్పష్టం చేస్తూ ధర్నా విరమించారు. అనంతరం తహసీల్దార్‌ వరలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లు ఆలస్యం : సీపీఐ(ఎం)
మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌ గ్రామ రైతులు వెల్దుర్తి నుంచి మెదక్‌ వెళ్లే ప్రధాన రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గౌరీ మద్దతు ప్రకటించారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల అలసత్వం వల్లే కొనుగోలు ప్రక్రియ జరగడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్దుర్తి పోలీసులు స్థానిక పీఏసీఎస్‌ సిబ్బందితో మాట్లాడి ఉప్పు లింగాపూర్‌ గ్రామానికి వచ్చిన హమాలీలను తిరిగి వెనక్కి రప్పించి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని రేగులగూడెం గ్రామంలో మంథని – కాటారం మెయిన్‌ రోడ్డుపై రైతులు గంటపాటు ధర్నా చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img