- సూపరింటెండెంట్‌తో పాటు ఇద్దరు వైద్యులకు మెమోలు జారీ
– ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల విధులపై ఉన్నతాధికారుల విచారణ - నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల సమయపాలన, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ‘నవతెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారంటూ శుక్రవారం ‘నవతెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
కథనంపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, డీసీహెచ్‌వో డాక్టర్ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఇన్చార్జి డాక్టర్ తారాసింగ్ ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులు, సిబ్బంది హాజరు, విధుల సమయపాలన తదితర అంశాలపై విచారణ చేపట్టి వివరాలు సేకరించారు.
వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులు సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు ఇద్దరు వైద్యులకు మెమోలు జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. విచారణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలెక్టర్‌కు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చింతగల్ల శ్రీనివాసులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



