నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురులో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ కె. వీరస్వామి తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు కేవలం విద్యాబోధన చేయడమే కాకుండా, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, దేశభక్తి వంటి విలువలను పెంపొందించడంలో గురువులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే గురుపూజోత్సవం ఉపాధ్యాయుల పట్ల విద్యార్థుల్లో గౌరవం, కృతజ్ఞతా భావాలను పెంపొందిస్తుందని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గురువులు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు, జీవితంలో సరైన మార్గాన్ని చూపించే మార్గదర్శకులని అన్నారు. విద్యార్థులు తమ గురువులను గౌరవిస్తూ, వారు చూపిన మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సన్మానించి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, ప్రకాష్ బాబు, నాగేశ్వరావు, శ్రీనివాస్, రామ్మూర్తి , మహేందర్, సుధాకర్, బాబు, సతీష్ అధ్యాపకేతర సిబ్బంది ప్రదీప్, లక్ష్మణ్, గౌరీశంకర్ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.



