Friday, November 21, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినవంబర్‌ 24న 'ఎవల్యూషన్‌ డే'ని జరుపుకుందాం!

నవంబర్‌ 24న ‘ఎవల్యూషన్‌ డే’ని జరుపుకుందాం!

- Advertisement -

ఇంగ్లీష్‌ నేచురలిస్ట్‌ ఛార్లెస్‌ డార్విన్‌ తన జీవపరిణామ సిద్ధాంతాన్ని (ON THE ORIGIN OF SPECIES) ప్రకటించిన రోజు 24 నవంబర్‌ 1859 – ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంతముఖ్యమో గ్రహించడానికి, ఆ శాస్త్రవేత్త మీద ఉన్న గౌరవం ప్రకటించుకోవడానికి 24 నవంబర్‌ను ‘ఎవల్యూషన్‌ డే’గా ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటున్నాయి. దీన్ని పెద్దఎత్తున మన దేశంలో కూడా జరపడం చాలా అవసరం. ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం దేశంలో బలపడాలని చెప్పిన భారత తొలి ప్రధాని నెహ్రూ స్థాయిని తగ్గించాలని ప్రయత్నిస్తున్న- ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ చర్యల్ని తిప్పికొట్టడానికి సామాన్య ప్రజలు వివేకవంతులై ఇలాంటి వైజ్ఞానిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పనిసరి! జీవ పరిణామ సిద్ధాంతం (THEORY OF EVOLUTION) పనికిరానిదని ప్రభుత్వం-సిలబస్‌ నుండి తొలగించింది. భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని ప్రవేశ పెడతామంటోంది. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే, ప్రగతిశీల భావాలు గల వారంతా వైజ్ఞానిక కార్యక్రమాలు పెద్దఎత్తున జరుపుకోవాలి.

1909లో డార్విన్‌ శత జయంతి, అర్థ శత వర్థంతి సందర్భంగా నూట అరవై ఏడు దేశాల నుండి నాలుగు వందల మంది ప్రముఖ శాస్త్రవేత్తలందరూ కేంబ్రిడ్జిలో సమావేశమై పెద్దఎత్తున డార్విన్‌కు నివాళులర్పించారు. ఆయన జీవశాస్త్రంలో చేసిన కృషిని శ్లాఘించారు. సామాన్య జనంలో డార్విన్‌ గూర్చి అవగాహన పెరగడానికి, ఆయన పరిణామ సిద్ధాంతాన్ని వారికి పరిచయం చేశారు-
న్యూయార్క్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ – అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీలోనూ, రాయల్‌ సొసయిటీ ఆఫ్‌ న్యూజీల్యాండ్‌ లోనూ, జరిపిన కార్యక్రమాలకు అనూహ్యంగా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోలో నవంబర్‌ 24-28 మధ్య డార్విన్‌ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. 2009లో ‘బిబిసి డార్విన్‌ సీజన్‌’ శీర్షికతో బిబిసి టెలివిజన్‌/ రేడియో కార్యక్రమాలు నిర్వహించింది. ఎందుకంటే అది డార్విన్‌ ద్విశత జయంతి. పైగా, డార్విన్‌ పరిణామ సిద్ధాంతం వెలువడి 150 ఏండ్లయింది. ఇలా ప్రపంచదేశాల్లో జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఇలాంటివి మన దేశంలో ఎన్ని జరిగాయీ? అనేది ఆలోచించుకోవాలి!

ఈ విషయాల్లో మన దేశ పరిస్థితులు మరీ దిగదుడుపుగా ఉన్నాయి. మతపరమైన పండుగలకు సూళ్లు, కాలేజిలు, ఆఫీసులకు సెలవులిస్తూ అర్థరహితమైన పండుగల్ని ప్రభుత్వాలు ప్రమోట్‌ చేస్తున్నాయి. కుటుంబాలలో జరిగే పూజలు, పునస్కారాలు, ఆచారాలు, సంప్రదాయాల వల్ల యువతరం మెదళ్లు కలుషితం అవుతున్నాయి. దేవుళ్ల శోభాయాత్రల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం దొరుకుతోంది. వివేక వంతమైన, అర్థవంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యాసంస్థల్లోగాని, పౌర సమాజాల్లో గానీ, కుటుంబాల్లో గానీ ఏ ఒక్కటైనా నిర్వహిస్తున్నారా? లేదు కదా? అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సైన్సు కార్యకర్తలు, బాధ్యతగల పౌరులు, వివేకవంతులైన అధికారులు, మరీ ముఖ్యంగా మహిళలు పూనుకుని -దేశంలో కొనసాగుతున్న విషమ పరిస్థితులను అర్థం చేసుకుని, ఎక్కడికక్కడ ఎవరికి వారు వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి. వట్టి ఆలోచనలతో పని జరగదు. వాటిని ఆచరణలో పెట్టాలి.

విద్యాసంస్థల్లో పని చేసే వారిపై బాధ్యత మరింతగా ఉంది. విద్యార్థులకు జీవపరిణామంపై, డార్విన్‌పై, సందర్భాన్ని బట్టి ఇంకా అనేక వైజ్ఞానిక అంశాలపై వ్యాస రచన/ ఉపన్యాస పోటీలు పెడుతూ వారిలో వైజ్ఞానిక జిజ్ఞాస పెంచాలి. భావిభారత పౌరులు వారే గనక, మనం వారి మీదే శ్రద్ధ పెట్టాలి. వారిని హేతుబద్ధంగా ఆలోచింప జేయాలి. మానవవాదులుగా తీర్చిదిద్దుకోవాలి. చేస్తున్న కార్యక్రమాలతో మనం మరొకరికి స్ఫూర్తినిస్తూ ఉండాలి! సైన్స్‌ డే (28, ఫిబ్రవరి), పర్యావరణ పరిరక్షణ దినం (5 జూన్‌), డార్విన్‌ డే(12 ఫిబ్రవరి), ఎవల్యూషన్‌ డే (24 నవంబర్‌), కైండ్‌ నెస్‌ డే(13 నవంబర్‌) -హ్యూమనిస్ట్‌ డే (21 జూన్‌), ఎర్త్‌ డే (24 ఎప్రిల్‌), సైంటిఫిక్‌ టెంపర్‌ డే (20 ఆగష్టు) -ఫిలాసఫీ డే(నవంబర్‌లో మూడో గురువారం), ఉమెన్స్‌ డే (8 మార్చి), చిల్డ్రన్స్‌ డే (14 నవంబర్‌) వంటివి విద్యాసంస్థల్లో తప్పక నిర్వహిస్తూ ఉండాలి. విద్యార్థుల అవగాహన, స్థాయి పెంచడానికి ఆయా విషయాలు ఇతివృత్తంగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. వీటితో పాటు సంవిధాన్‌ దివస్‌ (Constitution Day 26 నవంబర్‌) కూడా తప్పక జరుపుతూ ఉండాలి. ప్రస్తుతం మతాలకున్న ప్రాముఖ్యాన్ని తగ్గించి వైజ్ఞానిక దృక్పథం, హేతువాదం, మానవవాదం నిత్యజీవితంలో భాగమైపోయేట్లుగా చేస్తూ ఉండాలి.

ఎవరి వ్యక్తిగత విశ్వాసాలనో దెబ్బతీయాలని మనం అనుకోవడం లేదు. అవి వాటి పరిధిలో ఉంటే సంతోషిద్దాం- అంతే! మత విశ్వాసాలెప్పుడూ వ్యక్తిగత స్థాయిలో ఉండాలి. అంతేగాని, వికృతంగా సమాజ స్వరూపాన్ని మార్చేంత దుర్మార్గంగా ఉండకూడదు. అయితే, మత విశ్వాసకులతో ప్రపంచం ప్రగతి పథాన నడవలేదని మాత్రం కచ్చితంగా చెబుదాం! మనషులంతా ఒక్కటి అని తెలుసుకున్న వాళ్లం గనుక, విశ్వాసకుల్ని, అవిశ్వాసకుల్ని అందరినీ సమానంగా గౌరవిస్తాం. అయితే విశ్వాసకులు తమ అంధ విశ్వాసాల్ని వదిలేసి మానవవాదులుగా మారితే వారిని మరింతగా గౌరవిస్తాం.సైన్సు కార్యకర్తలంతా ఆ పనుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉండాలి. చంద్రయాన్‌-3 విజయవంతమైందని, అందుకు కారణం తనే అన్నట్టు అనవసరంగా ఆ సందర్భంగా ఆన్‌లైన్‌లో దేశ ప్రజలకు కనపడి, భారతీయ మువ్వన్నెల జెండా ఊపిన నేటి ప్రధాని మోడీ చేసిన నిర్వాకం ఈ దేశ ప్రజలు గ్రహించాలి.

ఇస్రో శాస్త్రవేత్తల జీతాల్లో కోతలు విధించడం గురించి – ఇస్రోకు ముడిసరుకు అందించిన వేలమంది సాంకేతిక నిపుణులకు, కార్మికులకు జీతాలివ్వకపోవడం గురించి- ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి. వారంతా పొట్ట పోసుకోవడానికి రోడ్లమీద టీలు, టిఫిన్లు అమ్ముకోవడం, బయట మెకానిక్‌లుగా, డ్రైవర్లుగా పనిచేయడం గురించి – ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని శ్లాఘించకుండా, దాన్ని తన ఎలక్షన్‌ ఎజెండాలో చేర్చుకోవడం గురించి- ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి. పైగా, పురాతన భారతీయ విమానయాన శాస్త్రంలో ఇవన్నీ రాసిపెట్టే ఉన్నాయని అబద్దాలు ప్రచారం చేసుకుంటూ ఉండడం గురించి- ఈ దేశ ప్రజలు తప్పక తెలుసుకోవాలి. ఇది నేటి శాస్త్రవేత్తల కృషిని, స్థాయిని తగ్గించినట్లుగా ఉందన్న విషయం తెలుసుకుని ఈ దేశ ప్రజలు కలత చెందాలి! ఈ అంశాల గూర్చి సీరియస్‌గా ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఈ విషమ పరిస్థితుల్లోంచి బయట పడే మార్గాల్ని అన్వేషించుకోవాలి.

రాబోయే కాలాలలో విద్యావంతులతో, ముఖంగా వైజ్ఞానిక పిపాస గల వివేకవంతులతో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకునే విధంగా చూసుకోవాలి. ఆ మధ్య కర్నాటకలో ప్రజాసంఘాలు నిర్వహించిన పాత్రను ఆదర్శంగా తీసుకుని, ఇతర రాష్ట్రాలలో కూడా ప్రజా సామాజిక-విద్య – వైజ్ఞానిక సంఘాలు చైతన్యవంతంగా కదలాలి. తప్పదు- దేశం వేల ఏండ్లు వెనక్కి వెళ్లాలంటే ఎవరూ ఏమీ చేయనక్కరలేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆ పని సజావుగా చేస్తూనే ఉంది. లేదు- దేశం ప్రగతిప్రథాన నడవాలంటే మాత్రం దేశ పౌరులందరూ సమైక్యంగా కదలాలి. ఈ మాట నేను అంటున్నది కాదు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిసే అలా చెప్పారు. ప్రజలు పెద్దఎత్తున రోడ్ల మీదికి రావాలని చెప్పారు. అంతే కాదు, తను ప్రజల వెంటే ఉన్నానని కూడా ధైర్యం చెప్పారు. ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని దేవుణ్ణి ధ్యానిస్తూ కండ్లు మూసుకోవడం కాదు, నువ్వెవరు? ఎన్ని పరిణామాలు జరిగి, నువ్వు ఇలా మారావు – అన్నది తెలుసుకుంటే – నీ కండ్లు తెరుచుకుంటాయి! ఎన్నెన్ని మానవజాతులు ఉద్భవించి అంతరించాయి.

ఎన్ని వలసల తర్వాత నీ జాతి ఇప్పుడు నువ్వున్న ప్రాంతానికి చేరింది వంటి విషయాలు క్షణ్ణంగా తెలుసుకోవాలంటే, తప్పదు జీవ పరిణామం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ భగవంతుడి సృష్టిలో నీ పుటక ఒక భాగమని నువ్వింకా భావిస్తూ ఉంటే గనక, నీ మెదడ్లో చీకటి తొలగిపోలేదని అర్థం. చీకట్లోనే జీవితం బాగుందనుకునే వారితో మనకు పేచీలేదు. జీవితంలో వెలుగులు కావాలనుకునేవారు తప్పక వెజ్ఞానిక స్పృహ పెంచుకుంటారు. జీవ పరిణామం గురించి తెలుసుకుంటారు. మతమౌఢ్యాన్ని చావు దెబ్బ తీసిన డార్విన్‌ పరిణామ సిద్ధాంతం వెలువడిన ఆ రోజును గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఏవల్యూషన్‌ డే’ జరుపుకుంటారు. ఎక్కడి పాట అక్కడ పాడటం, అధికారం కోసం నానా గడ్డి కరవడం రాజకీయ నాయకులకు అలవాటు. శాస్త్రవేత్తలు అలా చేయరు. ఒక నిబద్ధతతో, నిజాయితీగా, నిజాల్ని మాత్రమే వెల్లడిస్తారు. అలాంటి వారిలో మహౌన్నతుడు చార్లెస్‌ డార్విన్‌. ఆయన మతాలకున్న విలువను తగ్గించాలనుకోలేదు. మూఢ నమ్మకాల్ని నిర్మూలించగలనని కూడా అనుకోలేదు.

ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతమే కాలక్రమంలో ఆ పనులు చేస్తూ వచ్చింది. అందుకే సంప్రదాయ వాదులకు డార్విన్‌ అన్నా, డార్విన్‌ సిద్ధాంతమన్నా పడదు. వారు సృష్టి/ దైవ సిద్ధాంతం కావాలనుకుంటారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నవారి పాలసీ కూడా అదే! సిలబస్‌ నుండి ‘ఎవల్యూషన్‌’ ఛాప్టర్‌ తొలగిస్తున్నారని తెలియగానే, హైద్రా బాదులో పెద్దపెద్ద విద్యాసంస్థల్లో జెవివి వారు ఎవల్యూషన్‌ మీద నా లెక్చర్స్‌ ఏర్పాటు చేశారు. నేను కూడా సంతోషంగా వెళ్లి ఉపన్యసించి వచ్చాను. సిలబస్‌ నుండి తీసివేయగానే పిల్లలు ఇక ఏ రకంగానూ నేర్చుకోలేరన్న భ్రమలో ప్రభుత్వం వారుంటే – ఉండనివ్వండి. బాధ్యత గల పౌరులుగా మన పిల్లలకు మనం, ఏం నేర్పుకోవాలో మనకు తెలుసు కదా? ప్రభుత్వాలు తాత్కాలికం – వైజ్ఞానిక స్పృహే శాశ్వతం! అందువల్ల మనం, వీలైనన్ని ఎక్కువగా వైజ్ఞానిక కార్యక్రమాలు అన్నిస్థాయిల్లో నిర్వహించుకుంటూనే ఉండాలి!
(24 నవంబర్‌ : వరల్డ్‌ ఎవల్యూషన్‌ డే)
సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -