పౌర సమాజం స్పందించకపోతే భవిష్యత్ మరింత ప్రమాదకరం
పేదల కోసం పనిచేసే మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు? : రౌండ్‌టేబుల్ సమావేశంలో వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నేతలు
నేడు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా
కేంద్రం తీరును తప్పుబడుతూ సంతకాల సేకరణ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
బూటకపు ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులను హత్యచేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్టు గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ప్రకటించింది. బూటకపు ఎన్‌కౌంటర్లను తప్పుబడుతూ ప్రజల నుంచి సంతకాల సేకరణ చేయాలని నిర్ణయించింది. పాక్ ఉగ్రదాడులపై సైతం చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం..ప్రజల కోసం పనిచేస్తున్న దేశపౌరులైన మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపట్లేదని ప్రశ్నించింది.
బూటకపు ఎన్‌కౌంటర్లపై పౌర సమాజం స్పందించకపోతే భవిష్యత్ మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది. అటవీ ప్రాంతాల్లో విలువైన ఖనిజ సంపదను మార్చి 2026 నాటికి కార్పొరేట్లకు ఆప్పగించేందుకు మోడీ సర్కారు మాట ఇచ్చిందనీ, అందుకే అడ్డుగా ఉన్న మావోయిస్టులను ఎన్‌కౌంటర్ల పేరుతో చంపేయిస్తున్నదని విమర్శించింది. లొంగిపోయేందుకు ప్రయత్నించిన వారిని, కాల్పులు విరమించి షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులను చుట్టుముట్టి కాల్చి చంపడాన్ని తప్పుబట్టింది. దేశసంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడం దేశభక్తి ఎలా అవుతుందని ప్రశ్నించింది.
దేశంలో కమ్యూనిస్టులు బలపడాలి : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
దేశంలో కేంద్రంలోని మోడీ సర్కారు విధానాలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో కమ్యూనిస్టులు మరింత బలపడాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. వామపక్షభావజాలం ఉన్న వారిని బలహీనపర్చే ఎలిమినేషన్ ప్రక్రియను బీజేపీ సర్కారు ప్రారంభించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్, సోషలిస్టు భావజాలం కలిగిన ఇతర పార్టీలు ఏకమై బీజేపీపై పోరాడాల్సిన ఆవశ్యకత నేడు నెలకొందని చెప్పారు. ఫాసిస్టు శక్తులు బలపడితే దేశానికి, సమాజానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
బీహార్ తరహాలో తెలంగాణలోనూ కేంద్రం సర్‌ను ప్రవేశపెట్టబోతున్నదన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అధికారమే పరమావధిగా భావించి దేశాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పాలకుల హింసనే కాదు మావోయిస్టుల తరపున జరిగే హింసను సైతం తాము వ్యతిరేకిస్తున్నామనీ, అయితే, బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండిస్తామని స్పష్టం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పోరాడిన వారు జన జీవన స్రవంతి లో కలుస్తామని చెప్పితే వినకుండా పట్టుకుని చంపడం ఏం పద్ధతి అని ప్రశ్నించారు.
న్యాయమూర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో శవపరీక్షలు చేయాలి : కూనంనేని
ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయమూర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో శవ పరీక్షలు నిర్వహించాలనీ, దాన్ని వీడియో తీయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రాముని పేరు చెబుతూ బీజేపీ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తున్నదని విమర్శించారు. మానవ హననం చేయాలని అమిత్‌షా, మోడీలకు ఏ శాస్త్రం, ఏ ధర్మం చెబుతున్నదని నిలదీశారు. ఎన్ కౌంటర్ అంటే ఏమిటో కూడా తెలియనివారు కేంద్ర మంత్రులుగా ఉండటం మన దౌర్భాగ్యమని ఎద్దేవా చేశారు. తమకు, మావోయిస్టులకు మధ్య భావజాలంలో తేడా ఉన్నప్పటికీ అందరం పేద వర్గాల కోసమే పని చేస్తామని చెప్పారు. ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలని, ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్ల పైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, మోడీని ప్రశ్నిస్తే దాడులు : మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
దేశంలో మోడీ, బీజేపీ విధానాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైనా దాడి జరుగుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులతో పాటు అన్ని రంగాలపైనా, వ్యవస్థలపైనా ఆర్‌ఎస్‌ఎస్ నుంచి సైద్ధాంతిక దాడి జరుగుతున్నదని విమర్శిం చారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకుని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపర్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి ఏదో ఒక రకంగా పాలనా వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. కార్పొరేట్లకు దేశంలోని ఖనిజవనరులను అప్పనంగా అప్పగిస్తూ..అదే సమయంలో సామాన్యులపై పన్నుల మీద పన్నుల భారం మోపుతూ…అప్పుల మీద అప్పులు చేస్తూ దేశాన్ని 200 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు.
హింసతో రాజకీయ ఉద్యమాలను ఆపలేరు : కోదండరామ్
టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ రాజకీయ ఉద్యమాలను హింసతో రూపుమాపలేరనీ, వ్యక్తులను చంపినా సిద్ధాంతం బతికే ఉంటుందని చెప్పారు. మనుషులను చంపే అధికారం చట్టం ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. ఎన్ కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన కూడా కేసు నమోదు చేసి విచారించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని గుర్తుచేశారు. రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కి మోడీ సర్కారు పాలన చేస్తున్నదని విమర్శించారు.
అభివృద్ధి నమూనాలో మానవతా విలువలేవి : ప్రొఫెసర్ హరగోపాల్
కేంద్రం ప్రభుత్వం చెబుతున్న ‘అభివృద్ధి నమూనా’లో మానవతా విలువలు లేవని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. అటవీ ప్రాంతాల్లోని వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మహారాష్ట్రంలో 1.25 లక్షల చెట్లు, చత్తీస్‌గఢ్‌లో 2.25 లక్షల చెట్లను కూల్చి పర్యావరణ విధ్వంసం చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. మోడీ సర్కారుది రూట్‌లెస్ అభివృద్ధి నమూనా అనీ, అది నిరుద్యోగాన్ని పెంచే నమూనా అనీ, కార్పొరేట్ నమూనా అని విమర్శించారు. కేంద్రం ఎవరి మాటలనూ వినడం లేదని, రాజ్యాంగం, చట్టాలను కూడా అమలు చేయడం లేదని వాపోయారు.
జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ బూటకపు ఎన్ కౌంటర్లను ప్రభుత్వం మానుకోవాలనీ, మావోయిస్టులతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మావోయిస్టులు కూడా సాయుధపోరాటాన్ని వదిలి ప్రజాజీవి తంలోనికి రావాలని కోరారు. మనుషులను పట్టుకుని కాల్చిచంపడం ఆర్టికల్ 21 ఒప్పుకుంటుందా? అని ప్రశ్నించారు. అరుణోదయ సాంస్కృతిక మండలి నాయకులు విమలక్క మాట్లాడుతూ ఎన్ కౌంటర్ల పేరుతో కేంద్రం మానవ హననం చేస్తోందన్నారు. మావోయిస్టులు చేసేది హింస అయితే కేంద్రం చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించారు.
సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు హన్మేశ్, సీపీఐ(ఎంఎల్). న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు చలపతిరావు, సీపీఐ(ఎం.ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ రాజా, సీపీఐ(ఎం.ఎల్) చంద్రన్న గ్రూప్ నాయకులు భాస్కర్,, ఎస్‌యుసీఐ (యు) నేత మురహరి, సీపీఐ (ఎంఎల్). నాయకులు గుర్రం విజరుకుమార్ మాట్లాడుతూ కేంద్రం తక్షణమే బూటకపు ఎన్‌కౌంటర్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, బండి సంజరు వ్యాఖ్యలు చట్టవిరుద్ధమన్నారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకులు నారాయణ, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి.నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాయాదేవి, నెదునూరి జ్యోతి, రమావత్ అంజయ్య నాయక్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, తదితరులు పాల్గొన్నారు.
సామినేని హంతకులను అరెస్టు చేయాలి : జూలకంటి
ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) నేత సామినేని రామారావును హత్యచేసి 20 రోజులు జరుగుతున్నా ఇంతవరకు హంతకులను అరెస్టు చేయకపోవడం సరిగాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అన్ని ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ నేతల ఒత్తిడితో హంతకులను అరెస్టు చేయట్లేదని విమర్శించారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించాలని కోరారు. మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాననీ, నిందితులకు శిక్షపడేలా చూస్తామని హామీనిచ్చారు.



