Friday, March 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపోరాడుదాం..సాధించుకుందాం

పోరాడుదాం..సాధించుకుందాం

- Advertisement -

జాతీయ గ్రామీణ ఉపాధి హామీని రక్షించుకుందాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపు
పని ప్రదేశంలో నీళ్లు, నీడ కరువు
గాయాలపాలైతే మందు బిళ్లలకూ దిక్కు లేదు
పొద్దంతా పని చేసినా రూ.200 వస్తలేవు
కూలీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోన్న కేంద్రం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌ కూలీలతో జాన్‌వెస్లీ మాటామంతి
200 రోజుల పని.. రూ.800 కూలీ ఇవ్వాలని డిమాండ్‌

నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
ఉపాధిహామీ నిర్వీర్యానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా పోరాడుదామని, ‘ఉపాధి’ని రక్షించుకుందామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. 200 రోజులు పని కల్పించాల్సిందేనని, రోజు వేతనం రూ.800 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎర్రటి ఎండలో పొద్దంతా పని చేసినా రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వచ్చిన డబ్బుల్లోనూ రవాణాకు రూ.60, గడ్డపార సాన పెట్టేందుకు మరో రూ.40 పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రోజువారీగా కూలీకి మిగిలేది వంద రూపాయలేనని, ఇలా అయితే పేదల ఆదాయం ఎలా పెరుగుతుందో చెప్పాలని మోడీని ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ‘గడపగడపకూ’ కార్యక్రమానికి సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో ఉపాధిహామీ పనులను జాన్‌వెస్లీ పరిశీలించారు.

ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. ”రోజుకు ఎన్ని గంటలు పని చేస్తున్నారు. ఎంత కూలి గిట్టుబాటు అవుతోంది” అని అడిగారు. దీనికి వారు బదులిస్తూ ”నాలుగు వారాలుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం పైసా ఇవ్వడం లేదు. రోజుకు రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదు.. అందులో చేసిన కష్టం, గడ్డపార సానబెట్టేందుకే పోతోంది. రానుపోను బస్సు చార్జీలకే సరిపోవడం లేదు. ఎర్రటి ఎండలో పని చేస్తున్నాం.. అడవుల్లో నీళ్లు లేవు, నీడా లేదు. నీళ్లను ఇంటి నుంచే తెచ్చుకుంటున్నాం. దెబ్బలు తగిలితే వైద్యానికీ దిక్కులేదు. మా బోటోళ్ల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. మరికొన్ని గ్రామాల్లో ఐదారు వారాలుగా చేసినా డబ్బులు ఇస్తలేరు. గడ్డపారలు మేమే కొనుక్కుంటున్నాం. గతంలో గడ్డపార, పారా, తట్టలు ఇచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’ అంటూ కూలీలు జాన్‌వెస్లీ దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా చట్టంలో మహాత్మా గాంధీ పేరుని లేకుండా చేసిందని అన్నారు. ప్రతివారం డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందన్నారు. డబ్బులు రావడం లేదని విసిగి వేసారిన కూలీలు వారే స్వయంగా పనికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తోందని విమర్శించారు. 200 రోజులు పని కల్పించాలని కూలీలు డిమాండ్‌ చేస్తే.. కేవలం 120 రోజులకు మాత్రమే కల్పిస్తున్నారని అన్నారు. ఈ పనుల్లోనూ రోజుకు రూ.307 చొప్పున వేతనం చెల్లించాలని చట్టం చెబుతోందని, కానీ రూ.200 కూడా రావడం లేదని తెలిపారు. పని ప్రదేశంలో నీళ్లు, నీడ కల్పించాల్సి ఉన్నా తాము పర్యటించిన ఏ ప్రాంతంలోనూ అలాంటి వసతులు లేవన్నారు. పని ప్రదేశంలో గాయాలపాలైన కూలీలకు మందు బిళ్లలకూ దిక్కేలేదన్నారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌.. ఉపాధిహామీలో పని చేసే మహిళకు నెలకు రూ.2500 చెల్లిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఊరికి 10 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి చేతులు దులుపు కుందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా 30కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉపాధిహామీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, బడ్జెట్‌ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉపాధి హామీని రక్షించుకునేందుకు పోరాటాలు కొనసాగుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకునేందుకే తమ పార్టీ ఆధ్వర్యంలో పర్యటనలు చేస్తున్నామన్నారు.

అనంతరం మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామన్నారు. అయినా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లక్షలాది కూలీలతో కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. 200 రోజుల పని, రూ.800 కూలి సాధించుకునే వరకూ అక్కడే కూర్చుంటామని తెలిపారు. ఈ పర్యటనలో ఆయన వెంట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్‌, డి.జగదీష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్‌, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్‌ బుగ్గరాములు, పి. జగన్‌, మండల మండల కమిటీ సభ్యులు తదతరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -