Sunday, March 1, 2026
E-PAPER
Homeసోపతిజంగిల్‌ సఫారీ చేద్దామా...

జంగిల్‌ సఫారీ చేద్దామా…

- Advertisement -

నగర జీవన శైలితో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. సమయం దొరికితే రిలాక్స్‌ అవ్వాలని భావిస్తున్నారు. రీఛార్జ్‌ అయ్యి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారిలో మెజారిటీ జనం టూర్‌కే ఓటేస్తున్నారు. అయితే, ఇందులోనూ సెపరేట్‌ సెక్షన్‌ ఉంది. విహారంలోనే జంగిల్‌ టూర్‌ను కవర్‌ చేయాలని, జంతువులు, పక్షులతో ఆడుకుని రావాలని ఈ సెక్షన్‌ ఆకాంక్షిస్తోంది. ఇలాంటి వారికోసం దేశవ్యాపంగా సూపర్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. మార్చి 3న వన్య ప్రాణుల దినోత్సవం సందర్భంగా మరి ఆ ప్రాంతాలేవో ఇక్కడ చూద్దాం.

జిమ్‌ కార్బెట్‌ : మనదేశపు తొలి జాతీయ వనం ఇదే. అంతరించిపోతున్న బెంగాల్‌ టైగర్స్‌ను సంరక్షించేందుకు భారత ప్రభుత్వం 1973లో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ టైగర్‌ కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలైంది. దేశంలో అత్యధిక పులులు ఇక్కడే ఉన్నాయి. సుమారు 520 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్‌.. కొండలు, నదీ తీరాలు, చిత్తడి నేలలు, గడ్డి భూములతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద పులులు, చిరుత పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, జింకలు వంటివి ఎన్నో ఈ సఫారీలో చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఏడు సఫారీ జోన్లు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళ సఫారీ సూపర్‌. ఇది ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని నైనిటాల్‌ జిల్లాలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 1700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది

.

రణథంబోర్‌ : దేశంలోని ప్రముఖ రిజర్వ్‌ ఫారెస్టులో రణథంబోర్‌ ఒకటి. రాజస్థాన్‌ రాష్ట్రంలోని వింధ్య, ఆరావళి పర్వతాల మధ్యలో ఈ ఫారెస్ట్‌ ఉంది. ఇక్కడ ఫ్యామిలీతో కలిసి చేసే సఫారీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌, చిరుత, భల్లూకం, 300 పైగా పక్షి జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. అందుకే ఇక్కడ చేసే టైగర్‌ సఫారీ ఎంతో ప్రత్యేకం. దీంతోపాటు రణథం బోర్‌ రాజుల కోటను కూడా సందర్శించి రావచ్చు. హైదరాబాద్‌ నుంచి సుమారు 1300 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

గిర్‌ : ఈ ప్రముఖ జూ పార్క్‌ గుజరాత్‌లోని గిర్‌లో ఉంది. ఆసియాటిక్‌ సింహాలు ఇక్కడ స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఇవే ఇక్కడ ఫేమస్‌. ఒకప్పుడు ఈ సింహాలు అంతరిచిపోయే దశకు చేరుకున్నాయి. ఆ తర్వాత వాటి సంరక్షణా చర్యలు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం 650 పైన ఉంటాయని అంచనా. సింహాలతోపాటు, చిరుతపులులు, హైనాలు, సాంబార్‌ జింకలు వంటి అనేక జంతువులు ఇక్కడ ఉన్నాయి. పక్షి జాతులు 300కు పైగా ఉన్నాయి. పక్షి ప్రేమికులకు ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఈ ప్రదేశానికి సమీపంలోనే పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. ఈ అభయారణ్యం ఫ్యామిలీ సఫారీకి చాలా సేఫ్‌. హైదరాబాద్‌ నుంచి సుమారు 1500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

పేంచ్‌ : ఈ అభయారణ్యం మధ్యప్రదేశ్‌లోని పేంచ్‌ నదీ తీరంలో విస్తరించి ఉంది. ఇక్కడ పులులు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. పెద్దపులులతోపాటు చిరుతలు ప్రముఖంగా ఉంటాయి. ఎలుగుబంట్లు కూడా చాలా ఉన్నాయి. 250 పక్షి జాతులను ఇక్కడ చూడొచ్చు. పేంచ్‌ నది పార్కును రెండు భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడి వన్యప్రాణులకు నది జీవనాధారం. నదీతీరాలు చూపరులను కనువిందు చేస్తాయి. ఫ్యామిలీ టూర్‌ కు ఇది మంచి ఛాయిస్‌. హైదరాబాద్‌ నుంచి సుమారు 580 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కజిరంగా : దేశంలో మరో ప్రముఖ జూ పార్క్‌ కజిరంగా. ఇది అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ అడవి నేచర్‌ ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడ ఏనుగు సఫారీ ప్రత్యేకం. ఏనుగులపైకి ఎక్కి అరణ్యంలో తిరుగుతూ ఇతర జంతువులు, పక్షులను చూడొచ్చు. పెద్దపులులు, ఖడ్గమృగాలు, చిరుతలు వంటి అన్ని రకాల జంతువులు ఒకేచోట కనిపించడం కజిరంగా స్పెషాలిటీ. హైదరాబాద్‌ నుంచి సుమారు 2,600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

తాడోబా : మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో ఈ అభయారణ్యం ఉంది. దేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగిన రిజర్వ్‌ ఫారెస్టులలో తడోబా ఒకటి. పర్యాటకులకు పులులు తప్పకుండా కనిపిస్తాయి. ఇతర జంతువులు ఎన్నో ఉన్నాయిక్కడ. బైసన్లు, పక్షులు, స్లాత్‌ ఎలుగుబంట్లు, అడవి కుక్కలు ఎక్కువగా అగుపిస్తాయి. 200కు పైగా జాతుల పక్షులు ఉన్నాయి. ఇక, ఇక్కడి ప్రకృతి నేచర్‌ లవర్స్‌ను కట్టిపడేస్తుంది. ఫొటో గ్రాఫర్లు ఇక్కడ పండగ చేస్కుంటారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలకు ఈ అభయారణ్యం దగ్గరగా ఉంటుంది. అందుకే పులులు అక్కడి నుంచి తెలంగాణ వైపు వలస వస్తుంటాయి. హైదరాబాద్‌ నుంచి సుమారు 415 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

జంగిల్‌ బుక్‌ ‘కన్హా’: జంగిల్‌ బుక్‌ సినిమా ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. అందులోని మోగ్లీని జనం ఎప్పటికీ మరిచిపోరు. ఆ సినిమాకు స్పూర్తినిచ్చింది కన్హా అభయారణ్యమే! ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ పెద్దపులులు, చిరుతలు, జింకలు లెక్కకు మించి కనిపిస్తాయి. సాల చెట్ల అడవులు అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్‌ కూడా ఉంటుంది. ఇక ఇదే రాష్ట్రంలో మరో అభయారణ్యం కూడా ఉంది. దీని పేరు ‘పన్నా’. ఇక్కడ 80కి పైగా టైగర్స్‌ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు మనోహరంగా ఉంటుంది. ఇక్కడి జలపాతాలు, పచ్చని లోయలు, గుహలు టూరిస్టులను ఎంతగానో అలరిస్తుంటాయి. హైదరాబాద్‌ నుంచి కన్హా అభయారణ్యం సుమారు 750 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పన్నా 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

బాంధవ్‌ గఢ్‌: మధ్యప్రదేశ్‌లోని వింధ్య పర్వత శ్రేణులలో ఈ అభయారణ్యం ఉంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ పులులు. ప్రతీ చదరపు కిలోమీటర్లకు ఒక పులి కనిపిస్తుంది. పులిని తప్పక చూడాలనుకునేవారు ఈ సఫారీని ఎంచుకుంటారు. అందుకే ఫొటోగ్రాఫర్లు, పర్యాటకులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. చిరుతలు, స్లాత్‌ ఎలుగుబంట్లు, సాంబార్‌, మచ్చల జింకలు ఎన్నో ఉన్నాయి. పురాతనమైన ‘బాంధవ్‌గర్‌ కోట’ శిథిలాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. కెమెరా పట్టుకొని వస్తే చాలు.. మెమొరీ కార్డులు నిండిపోతాయంటే అతిశయోక్తి కాదు! హైదరాబాద్‌ నుంచి సుమారు 970 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అమ్రాబాద్‌ : మనకు దగ్గరగా ఉన్న అభయారణ్యాల గురించి చూసుకుంటే తెలంగాణ నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ ప్రముఖమైనది. భారతదేశంలోని అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులలో ఇది ఒకటి. చిరుతలు, పెద్దపులులు, అడవి పందులు, నీల్గాయిలు, జింకలు వంటివి ఎన్నో ఉన్నాయిక్కడ. పక్షి జాతుల విషయానికి వస్తే ఏకంగా 300కి పైగా ఉన్నాయి. నేచర్‌ గురించి చెప్పాలంటే లోయలు, ఎత్తయిన కొండలు, చెరువులు ఉన్నాయి. ఇక్కడ ట్రాకింగ్‌, నేచర్‌ ట్రయల్‌ వాక్స్‌ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో ఇక్కడ ఫుల్లుగా ఎంజారు చేయొచ్చు. హైదరాబాద్‌ నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్‌లో ఉండే నల్లమల అడవుల్లో కూడా శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం ఉంది. ఇక్కడ కూడా పెద్దపులి, చిరుత, అడవి పందులు, సాంబర్‌ జింకలు, పక్షులు ఎన్నో ఉన్నాయి. దేశంలోనే విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రిజర్వు ఫారెస్టుల్లో ఇది ఒకటి. ఇక్కడి వెళ్లిన టూరిస్టులు బోనస్‌గా శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకోవచ్చు. వన్యప్రాణి ఫొటోగ్రఫీ, కృష్ణా నది తీరాలు మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయి. హైదరాబాద్‌ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇలా ప్లాన్‌ చేసుకోండి: ఫ్యామిలీతో వెళ్లేవాళ్లు ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. సఫారీకి బుకింగ్‌ కన్ఫామ్‌ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు గనక అప్పటికప్పుడు దొరకడం సాధ్యం కాకపోవచ్చు. ప్రతీ టైగర్‌ రిజర్వుకు ప్రత్యేక వెబ్‌ సైట్‌ ఉంది. అందులోకి వెళ్లి బుక్‌ చేసుకోవాలి. పిల్లలకు జంతువుల గురించి అక్కడి పరిసరాల గురించి పెద్దలు ముందుగానే వివరిస్తే బాగుంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో జాగ్రత్తలు కూడా సూచిస్తే మంచిది. టైగర్‌ రిజర్వుల్లోకి వెళ్లేవాళ్లు సెంటు కొట్టుకోకూడదు. పెర్‌ఫ్యూమ్‌ స్మెల్‌ వల్ల జంతువులు దగ్గరికి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక అనుభవాలను పదిలంగా భద్రపరుచుకోవడానికి మంచి కెమెరా తీసుకెళ్తే బాగుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -