Saturday, October 11, 2025
E-PAPER
Homeఅంతరంగంచదువుకుందాం…

చదువుకుందాం…

- Advertisement -

జీవితం అందంగా, సరదాగా సాగిపోవాలన్నా… జీవితం అంటే బోలెడంత ప్రేమ, ఇష్టం రావాలన్నా… సమస్యలు ఎదురవగానే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నా… మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉండాలన్నా… జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా… వీటితో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా… అన్నింటికీ ఒకటే చిట్కా… అదేంటంటే పుస్తకాలు చదవడం. పుస్తకాలంటే క్లాసు పుస్తకాలు మాత్రం కాదు. పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే కేవలం మనకు తెలిసిన ఉపయోగాలే కాకుండా ఇంకా ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని ఇటీవలే వైద్యులు తమ పరిశోధనలో నిరూపించారు. అందుకే మెదడు చురుగ్గా ఉండాలంటే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారిలో ఏకాగ్రత, సూపర్‌ మెమోరీ, రీసనింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌ మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా వుంటాయని ఈ పరిశోధనల్లో తేలింది. అలాగే మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, ఎమోషనల్‌ బాలన్స్‌కి కూడా పుస్తక పఠనం సహాయం చేస్తుంది.

మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తులని కేవలం పుస్తకాల అధ్యయనంతో వారి ఆరోగ్యం మెరుగుపడేలా చేశారు వైద్యులు. అందుకే మెదడు శక్తి పెరగాలంటే బుక్‌ రీడింగ్‌కు మించిన ఆప్షన్‌ లేదని గట్టిగా చెబుతున్నారు. ఒకప్పుడు మన అమ్మలూ, అమ్మమ్మలకి పుస్తకాలే ప్రపంచం. కాస్త సమయం దొరికినా వాటితోనే కాలక్షేపం. చదవడమే కాదు, వాటిపై చర్చలు కూడా పెట్టేవారు. వాళ్లు తెలుసుకున్నది నలుగురితో పంచుకునేవారు. అందుకే అప్పట్లో వాళ్లు అంత ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా సమాజిక మాధ్యమాల మాయాజాలమే. స్క్రోలింగ్‌ నుంచి చూపు మరల్చలేకపోతున్నారు. దీనివల్ల ఎన్నో సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అందుకే కాసేపు స్క్రీన్‌ని పక్కన పెట్టి పుస్తకాలు చదివితే మంచిది. అయితే నేటి తరం విద్యార్థులు చాలా మంది సబ్జెక్టు పుస్తకాలు తప్ప వేరేవి మేమెప్పుడూ చదవలేదు అంటుంటారు. పైగా వాటిని చదవడం మా వల్ల కాదూ అంటున్నారు. అలాంటి వారు మొదటగా చిన్న చిన్న కథలు ఉండే బుక్స్‌ని ఎంపిక చేసుకొని చదవడం మొదలుపెడితే పుస్తకాలపై ఆసక్తి పెరుగుతుంది. అందులోనూ పది నుంచి పదిహేను నిమిషాల్లో పూర్తయ్యే పుస్తకాన్ని ఎంచుకోవాలి.

అప్పుడే విసుగు కూడా అనిపించదు. పైగా ఇంకా చదవాలనే ఆసక్తి కూడా కలుగుతుంది. ఒకేసారి జీవిత చరిత్రలు మొదలుపెట్టకుండా హాస్యం, థ్రిల్లర్‌, ఫిక్షన్‌ వంటివి ఎంపిక చేసుకోండి. ఇలాంటి పుస్తకాలు ఆసక్తిగా చదివిస్తాయి. చదివేటప్పుడు నచ్చిన లైన్లను నోట్‌ చేసుకోండి. నిద్రపోయే ముందు వాటిని మళ్లీ ఓసారి చూసుకోండి. అవే ఇంకా ఆ పుస్తకంలో ఇలాంటి విషయాలు ఏమేమి ఉన్నాయో చూడాలన్న ఆసక్తిని కలిగిస్తాయి. ప్రాథమిక దశ దాటాక రోజుకి ఐదు, పది పేజీలంటూ లక్ష్యాన్ని పెట్టుకోండి. మీరు ఎంపిక చేసుకున్న పుస్తకం మీకు తెలియకుండానే ఇట్టే పూర్తయిపోతుంది. ‘రెండు పేజీలు అయినా చదవందే నిద్ర పట్టదు’ అని అమ్మల దగ్గర వినే ఉంటారు. మనకేమో ఫోన్‌లో స్క్రోల్‌ చేయందే కునుకు రాదు. ఈ అలవాటును దారి మళ్లించాలన్నా, కళ్లకు, మెదడుకు, మనసుకు విశ్రాంతి ఇవ్వాలన్నా… పుస్తకం పట్టాల్సిందే. అందుకే రోజూ నిద్రపోయే ముందు కనీసం ఇరవై నుంచి ముప్ఫై నిమిషాలు పుస్తకాలు చదివేందుకు కేటాయించండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -