Saturday, November 8, 2025
E-PAPER
Homeఅంతరంగంఅర్థం చేసుకుందాం…

అర్థం చేసుకుందాం…

- Advertisement -

‘పాపం, పుణ్యం ప్రపంచ మార్గం.. కష్టం, సుఖం, శ్లేషార్థాలూ.. ఏమీ ఎరుగని పూవుల్లారా.. అయిదారేళ్ల పాపల్లారా.. మీదే మీదే సమస్త విశ్వం.. మీరే మీరే భాగ్యవిధాతలు’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. నిజమే కదా మన భావిభారతం పిల్లలే. వారూ, వారి ఆలోచనలు బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. కానీ నేడు మన పిల్లల భవిత ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. పెరిగిపోతున్న సాంకేతికత, మారిపోతున్న విద్యా విధానం పిల్లలను యంత్రాల్లా తయారు చేస్తున్నాయి. బిజీ జీవితం గడుపుతున్న తల్లిదండ్రుల పెంపకం కూడా దీనికి ఓ కారణంగా ఉంటుంది. నేటి పిల్లల మనసు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే 2009 తర్వాత పుట్టిన పిల్లలను ‘జెన్‌ జెడ్‌’ తరంగా పిలుస్తున్నారు. వీరంతా పూర్తిగా డిజిటల్‌ యుగంలో పెరుగుతున్నవారు. చాలా ఫాస్ట్‌గా ఉంటారు. అన్నీ స్పీడ్‌గా జరిగిపోవాలని భావిస్తారు.

అందుకే వీరిని అర్థం చేసుకోవడానికి, సరైన దారిలో పెట్టడానికి ముందు మనం చాలా నేర్చుకోవల్సి వస్తుంది. ఈ తరం పిల్లలు మొబైల్‌ యాప్‌లు, యూట్యూబ్‌, సోషల్‌ మీడియాతోనే పెరుగుతున్నారు. కుదురుగా కాసేపు కూర్చోలేరు. వీరికి సమాధానం చప్పడం కూడా కష్టమే. సాధారణంగా పెద్దవాళ్లు ఏం చెప్పినా పిల్లలు వినాలి అనుకుంటారు. ఇది నిజమే కానీ మీరెప్పుడైనా పిల్లల మాట వింటున్నారా? ‘అసలు వాళ్లకేం తెలుసని వినాలి’ అనుకుంటారు చాలా మంది. నేటి తరం పిల్లలతో ఇలా ఉంటే అస్సలు సెట్‌ కాదు. ఎందుకంటే వాళ్ల మాట మీరు విని అర్థం చేసుకుంటేనే సరైన దారిలో పెట్టగలిగేది. మరి ఎలా చేయాలనే కదా మీ బాధంతా! తీరిక లేని జీవన శైలి, పనతి ఒత్తిడి వల్ల పిల్లలతో గడిపే సమయం చాలా మందికి దొరకడం లేదు. అలాగని బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. ఉన్న సమయంలోనే వీలు చూసుకోవాలి.

పిల్లలు నిద్రపోయాక మీరు ఇంటికి వస్తుంటే ఉదయాన్నే వారికోసం ఓ అరగంట ముందు లేవండి. వాళ్లు రెడీ అవుతున్నప్పుడో, తింటున్నప్పుడో దగ్గర కూర్చుని కబుర్లు చెప్పండి. అప్పుడు రోజు ఎలా గడుస్తుందో? సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునే ప్రయత్నం చేయండి. పిల్లలు తప్పు చేశారని తెలిస్తే చాలు కొందరు తల్లిదండ్రులు అంత ఎత్తు లేస్తారు. క్రమశిక్షణలో ఉంచడం మంచిదే అయితే, మితిమీరి భయపెట్టడం మాత్రం తప్పు. దీనివల్ల వారిలోని భావాల్ని, ఎదుర్కొనే సమస్యల్ని మీకు చెప్పడానికి సాహసించరు. అంతేకాదు ప్రతి పనీ మీకు తెలియకుండానే పూర్తి చేయాలనుకుంటారు. అటువంటి పరిస్థితి రానివ్వకండి. చిన్నారులు ఏదైనా చెప్పడానికి జంకుతున్నా? దాచిపెట్టాలని చూస్తున్నారని తెలిసినా వెంటనే నిలదీయొద్దు.

మొదట పట్టించుకోనట్లే ప్రవర్తించండి. ఆపై తమంతట తాముగా వాళ్లు నిజం చెప్పే ధైర్యాన్ని ఇవ్వండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు తోడుంటారనే భరోసా కల్పించండి. అప్పుడే ఏ విషయాన్నైనా మీతో స్వేచ్ఛగా చెప్పగలరు. ఒకవేళ పొరపాట్లు చేసినా మీరు సరిదిద్దగలరు. ఎదిగే పిల్లలకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వాటికి సమాధానం ఇవ్వలేక కసురుకోవడం, తిట్టి పంపించేయడమో చేస్తుంటారు కొందరు. మరి వారి సందేహాలను ఎవరు తీరుస్తారు. మీరే కదా! కనుక చెప్పే సమయం లేకపోతే వాయిదా వేయండి. ఒక వేళ మీకు తెలియకపోతే తెలుసుకుని చెబుతా అని చెప్పండి. వీలైతే ఆ సమాధానాన్ని ఇద్దరూ కలిసే వెదకండి. ఇవన్నీ నేటి పిల్లల్ని సరైన దారిలో పెట్టే మార్గాలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -