నూతన గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా
తెలుగులో ప్రమాణ స్వీకారం
హాజరైన ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణాను సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పని చేద్దామని నూతన గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌గా శుక్లా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్‌సింగ్ ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ”రాష్ట్ర ప్రజలకు సేవ
చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సాంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పని చేసిన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నా. తెలంగాణ ప్రాంతం ఆశలు, ఆవిష్కరణలు, సహనశక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రజల అంకుఠిత దీక్ష, రాష్ట్రంలోని సమృద్ధ వనరులు, వ్యూహాత్మక దృష్టి, సమగ్ర అభివృద్ధికి, స్థిరమైన ప్రగతికి బలమైన ప్రాతిపదికను అందిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఉన్న తెలంగాణా ప్రభుత్వానికి, క్యాబినెట్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. మనమందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదామని విశ్వసిస్తున్నా” అని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు.
హాజరైన ప్రముఖులు
గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు వందేమాతరం, జనగణమన ను ఆలపించారు. అనంతరం శివ్ ప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా శివ్‌ప్రతాప్.. తెలంగాణ గవర్నర్‌గా తన బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తానని తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ఆయనకు సీఎం పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.



