ఒక ‘పాఠ్యం’ అంటే కేవలం అక్షరాలు, పదాలు, వాక్యాల సముదాయం మాత్రమే కాదు. అది ముద్రణ రూపంలో ఉన్న ఒక జీవి. కొన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటుంది. మాట్లాడుతుంది. కథ చెబుతుంది. కొన్నిసార్లు మనల్ని కాదనలేని విధంగా తాకుతుంది. మరికొన్నిసార్లు మన గుండెల్లో చిన్న గాయం చేసి వదిలేస్తుంది. ఆ జీవికి ప్రాణం పోసింది రచయిత. అయితే ఆ ఉనికి సంపూర్ణం కావడానికి మరికొందరు అవసరం. ఆ బతుకును చూసేవారు, ఆలోచించేవారు, బోధించేవారు, లోతుల్లోకి దిగేవారు… ఇలా ఈ ఐదుగురూ కలిసి ఒక పాఠ్యాన్ని నిలబెడతారు.
పాఠకుడు వచ్చాకే పాఠ్యం నిజంగా ఊపిరి పోసుకుంటుంది. అల్మారాలో ఉన్నంతసేపు పుస్తకం నిద్రపోతున్నట్లే. దాన్ని చేతిలోకి తీసుకుని తెరిచినప్పుడే దానికి మెలకువ వస్తుంది. అందుకే, ఒకే పుస్తకాన్ని ఇద్దరు చదివినా వారి అనుభవాలు ఎప్పుడూ ఒకటిగా ఉండవు. ఒకరికి కన్నీళ్లు తెప్పించే సన్నివేశం, మరొకరికి సాదాసీదాగా అనిపించవచ్చు. ఎందుకంటే, పాఠకుడికి పాఠ్యంతో ఉండేది మానసిక అనుబంధమే తప్ప, మెదడుతో చేసే తర్కబద్ధమైన ఆలోచన కాదు. అతనికి సాక్ష్యాలు, ఆధారాలతో పనిలేదు. ఆ అక్షరాలు తన గుండెను తాకాయా లేదా? తన అంతరంగాన్ని కదిలించాయా లేదా? అన్నదే ముఖ్యం. పాఠకుడు తన జీవితాన్ని, జ్ఞాపకాల్ని, గాయాల్ని ఆ పాఠ్యంతో కలిపి చదువుకుంటాడు.
ఇక్కడ విమర్శకుడు రంగంలోకి అడుగుపెడతాడు. ఇతడు పాఠకుడే కానీ సాధారణ పాఠకుడు కాదు. ఇతడి చదవడం లోతైనది. విమర్శకుడు రచనను తర్కబద్ధంగా విశ్లేషిస్తాడు. పాఠ్యంలోని పొరల్ని ఒక్కొక్కటిగా తెరుస్తాడు. రచయిత ఏమనుకున్నాడు? ఆ భాష ఎందుకు ఆ రూపంలో వచ్చింది? సమాజం ఆ రచనను ఎలా ప్రభావితం చేసింది? అని ప్రశ్నిస్తాడు. విమర్శకుడు పాఠ్యానికి ఒక దర్పణం లాంటివాడు. ఆ దర్పణంలో పాఠ్యం తనను తాను చూసుకుంటుంది. కొన్నిసార్లు అందంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు లోపాలు బయటపడతాయి. ఈ విమర్శ ద్వారానే పాఠ్యం మరింత స్పష్టంగా, బలంగా నిలుస్తుంది.
అధ్యాపకుడు ఈ వలయాన్ని విస్తరింపజేసేవాడు. తరగతి గదిలో పాఠ్యాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ గదిలో ఉన్నవారందరూ ఒకే పాఠ్యాన్ని చదువుతారు. కానీ వారి అనుభవాలు వేరు. అధ్యాపకుడు ఆ వైవిధ్యాన్ని గౌరవిస్తూ చర్చను నడిపిస్తాడు. రచయిత ఉద్దేశాన్ని, విమర్శకుల అభిప్రాయాల్ని పరిచయం చేస్తూనే, విద్యార్థుల్ని తమ అభిప్రాయాలు చెప్పమని ప్రోత్సహిస్తాడు. ఇక్కడ పాఠ్యం ఒక సంభాషణలోకి వస్తుంది. అధ్యాపకుడు ఒక సమన్వయకర్త. ఒక వైపు రచయిత, విమర్శకుడు ఉంటే, మరో వైపు యువ పాఠకులు ఉంటారు. పరిశోధకుడు మాత్రం పాఠ్యం లోతుల్లోకి చూసేవాడు. ఇతడు పాఠ్యాన్ని ఒక్కసారి చదివి ఆగడు. అది ఎలా రాశారు? ఎందుకు రాశారు? దాని మూలాలు ఏమిటి? ఆ కాలపు సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు దాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అని వెతుకుతాడు. గ్రంథాలను, ఆధారాలను తవ్వి తీస్తాడు. రచయిత జీవితాన్ని పరిశీలిస్తాడు. ఈ పరిశోధన ద్వారా పాఠ్యం మరింత బలపడుతుంది. దాని చుట్టూ ఉన్న వాతావరణం స్పష్టమవుతుంది.
ఈ ఐదుగురూ ఒకరికొకరు అంటిపెట్టుకుని ఉంటారు. రచయిత లేకుండా పాఠ్యం పుట్టదు. పాఠకుడు లేకుండా అది బతకదు. విమర్శకుడు లేకుండా అది తన లోపాల్ని, గొప్పతనాన్ని తెలుసుకోలేదు. అధ్యాపకుడు లేకుండా ఆ గొప్పతనం తరతరాలకు చేరదు. పరిశోధకుడు లేకుండా ఆ పాఠ్యం లోతులు అర్థం కావు. ఈ సమిష్టి కషి వల్లనే ఒక చిన్న కథ, ఒక చిన్న కవిత శతాబ్దాల తర్వాత కూడా మనతో మాట్లాడుతుంది. ఈ ఐదుగురూ ఒక పాఠ్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారో పరిశీలించడానికి ఒక ఉదాహరణను తీసుకుందాం. మనం ఒక పాత కాలపు కోటను చూసినప్పుడు దాని నిర్మాణ నైపుణ్యానికి మురిసిపోతాం. కానీ, ఆధునిక సౌకర్యాలకు అలవాటు పడిన మనం ఆ కోటలో ఇప్పుడు కాపురం చేయలేం. సరిగ్గా సాహిత్యం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రాచీన కావ్య సౌందర్యాన్ని ఆస్వాదించాలి తప్ప, అందులోని పాత విలువలనే ఇప్పుడూ పాటించాల్సిన పనిలేదు.
సౌందర్యానికి, సామాజిక విలువలకు మధ్య ఉన్న ఈ వైరుధ్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, మహాకవి కాళిదాసు రాసిన ‘మాళవికాగ్నిమిత్రము’ నాటకాన్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఆనాటి నాటకాన్ని నేటి ప్రజాస్వామ్య విలువలతో తూకం వేసినప్పుడు రచయిత, పాఠకుడు, విమర్శకుడు, అధ్యాపకుడు, పరిశోధకుడు దాన్ని ఎలా దర్శిస్తారు? అనేది ఆసక్తికరమైన అంశం. ముందుగా ‘కవి’ (కాళిదాసు) స్థానాన్ని చూద్దాం. కాళిదాసు నాటి కాలానికి అద్దం. ఆనాడు ‘రాజుగారు’ అంటే ‘దైవం’తో సమానం కదా! రాజుకి ఎంతమంది భార్యలున్నా అది తప్పు కాదు, వైభవం. అగ్నిమిత్రుడికి ధారిణి, ఇరావతి అనే భార్యలున్నా, మాళవికను ప్రేమిస్తాడు. ఆనాటి కవిగా కాళిదాసు దృష్టిలో అది ‘శృంగార రసం’. ఆనాటి విలువల ప్రకారం ఈ నాటకం ఉత్తమమైనది. కానీ నేటి సమాజం దీన్ని ఎలా చూస్తుంది? ఒకవేళ ఈనాటి రచయిత ఇదే కథను రాస్తే, మన రాజ్యాంగం ప్రకారం ‘బహుభార్యత్వం’ చెల్లదు. కాబట్టి, ‘కవి’ని మనం గౌరవించాల్సింది అతని ‘కవితా శక్తి’కే తప్ప, అతను ప్రతిపాదించిన సామాజిక విలువలకు కాదు. కవి ఆనాటి ధర్మానికి కట్టుబడి రాశాడు. కానీ కాలక్రమంలో ఆ ధర్మమే నేడు ‘అధర్మం’గానో, ‘చట్టవిరుద్ధం’గానో మారి ఉండవచ్చు.
ఇక ‘పాఠకుడు’. ఇక్కడే అసలైన ఘర్షణ మొదలవుతుంది. నాటకం చదువుతున్నప్పుడు కాళిదాసు కవితా శక్తి చాలా గొప్పదనిపిస్తుంది. నాటకంలోని శృంగార వర్ణనలకు, మాళవిక నృత్య విన్యాసాలకు పాఠకుడు పరవశించిపోతాడు. నాయకుడిని ‘గొప్ప ప్రేమికుడి’గానూ ఆరాధించవచ్చు. కానీ, పుస్తకం మూసేశాక, ఒక బాధ్యత గల పౌరుడిగా ఆలోచిస్తే, ‘ఇదేంటి, ఇంట్లో భార్యలుండగా, ఆశ్రయం కోసం వచ్చిన ఒక అమ్మాయిని (మాళవికను) రాజు ప్రేమించడం నైతికంగా సరైనదేనా?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. నాటి పాఠకుడు రాజుని ‘నాయకుడి’గా చూస్తే, నేటి పాఠకుడు అతన్ని ఒక ‘అధికార దుర్వినియోగం చేస్తున్న వ్యక్తి’గా చూసే అవకాశం ఉంది. మూడవ వ్యక్తి ‘విమర్శకుడు’. ఇతని బాధ్యత చాలా బరువుతో కూడుకున్నది. కేవలం కాళిదాసు కవితా శక్తిని మెచ్చుకుంటే సరిపోదు. నేటి విమర్శకుడు ఆ పాఠ్యాన్ని లోతుగా విడమరచి చూడాలి. ఉదాహరణకు, నాటకంలో స్త్రీల పాత్రలు, రాణులైన ధారిణి, ఇరావతిల నిస్సహాయతను, పురుషాధిక్య సమాజంలో వారి అణచివేతను విమర్శకుడు ఎత్తి చూపాలి. ‘ఆనాడు అది సహజం కదా’ అని సరిపెట్టుకోవచ్చు.
కానీ ‘రాచరిక వ్యవస్థలో స్త్రీకి, సామాన్యుడికి స్వేచ్ఛ ఎంత తక్కువగా ఉండేదో’ చెప్పగలగాలి. మాళవిక చాలా అందమైన యువతి కాబట్టి రాజు ఆమెతో ప్రేమలో పడ్డాడు. అదే ఆమె అంద విహీనమైతే, రాజు ఆమె కోసం అన్ని రకాల పాట్లు పడేవాడా? మాళవిక రాకుమార్తె అని తెలిశాకే రాజుతో ఆమె వివాహం జరుగుతుంది. అంటే, అగ్నిమిత్రుడి ప్రేమలోనూ ‘అంతస్తు’ అనే లెక్క ఉందన్నమాట! ఈ కోణాన్ని విమర్శకుడు వెలికితీయాలి. నాల్గవది, అత్యంత కీలకమైన ‘అధ్యాపకుడు’. తరగతి గదిలో ఈ పాఠాన్ని విద్యార్థులకు ఎలా చెప్పాలి? అధ్యాపకుడు రచన, కవి, సమాజం అన్నింటినీ సమానంగా చూడాలి. కాళిదాసు కవిత్వ ఔన్నత్యాన్ని తెలపాలి. దానితో పాటు అధ్యాపకుడు ఒక సామాజిక పర్యవేక్షకుడిలా మారాలి. ‘చూడండి, కాళిదాసు గొప్ప కవి. అతని భాషా సౌందర్యాన్ని ఆస్వాదించండి.
కానీ, ఆనాటి సామాజిక పరిస్థితులు వేరు. మన భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే. రాజుకైనా, బంటుకైనా ఒకే న్యాయం. కాబట్టి ఈ కథను ఆనాటి చరిత్రగా మాత్రమే చూడండి, ఆచరణీయమైన నీతిగా కాదు’ అని బోధించాలి. ‘పిల్లలూ, అగ్నిమిత్ర రాజుగారు గొప్ప ప్రేమికుడు’ అని చెబితే, అది ప్రస్తుత కాలంలో భారత చట్టాలకు విరుద్ధం. లేకపోతే విద్యార్థి తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. చివరగా ‘పరిశోధకుడు’. ఇతని పని ఆకర్షణీయమైన ఉపరితలాన్ని దాటి, అంతర్లీనంగా ఉన్న సామాజిక, రాజకీయ మూలాలను వెతకడం. సాహిత్య సౌందర్యం వెనుక దాగి ఉన్న ‘రాజకీయాలను’ ఇతను విశ్లేషించాలి. మాళవికాగ్నిమిత్రము కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, అది ఆనాటి ‘రాజ్య విస్తరణ’, ‘రాజకీయ పొత్తుల’ సాక్ష్యపత్రం అని పరిశోధకుడు గుర్తించాలి.
ఆనాడు వ్యక్తి స్వేచ్ఛ అనేది ప్రభువు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేది. అంతఃపురంలో రాణి మాళవికను బంధించడం నాడు ‘రాజాజ్ఞ’ కావచ్చు, కానీ పరిశోధకుడు దాన్ని నేటి ‘మానవ హక్కుల’ గీటురాయిపై పెట్టి చూడాలి. అప్పటి ‘ధర్మశాస్త్రం’ వ్యక్తిని వర్గం, జెండర్ ఆధారంగా ఎలా నియంత్రించిందో, నేటి ‘ప్రజాస్వామ్యం’ వ్యక్తికి ఎలా స్వేచ్ఛను ప్రసాదించిందో తులనాత్మక అధ్యయనం చేయాలి. మాళవికాగ్నిమిత్రము ఒక గొప్ప కళాఖండం, అదే సమయంలో గడిచిపోయిన ఒక ఫ్యూడల్ వ్యవస్థకు సాక్ష్యం. కాళిదాసు రాసిన ‘పాఠ్యం’ మారలేదు. అందులోని అక్షరాలు అవే. కానీ దాన్ని చదివే కళ్లు మారాయి. ఆ కళ్లకు ఇప్పుడు ‘ప్రజాస్వామ్యం, హక్కులు’ అనే కొత్త అద్దాలు వచ్చాయి. ఈ ఐదుగురూ (రచయిత, పాఠకుడు, విమర్శకుడు, అధ్యాపకుడు, పరిశోధకుడు) ఆ పాత పాఠ్యాన్ని ఈ కొత్త వెలుగులో చూడగలగడమే నిజమైన సాహిత్య విశ్లేషణ.
ప్రొ|| గంపా వెంకటరామయ్య, 9958607789



