Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంకెనడాలో లిబరల్‌ పార్టీ విజయం

కెనడాలో లిబరల్‌ పార్టీ విజయం

– ఓటమిని అంగీకరించిన కన్జర్వేటివ్‌ నేత
– ఓడిన జగ్మీత్‌ సింగ్‌
– ప్రధాని మార్క్‌ కార్నీకి ప్రధాని మోడీ అభినందనలు

ఒట్టావా : కెనడా ఫెడరల్‌ ఎన్నికల్లో ప్రధాని మార్క్‌ కార్నీకి చెందిన లిబరల్‌ పార్టీ విజయం సాధించింది. 343 సీట్లు గల హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మెజారిటీ మార్క్‌ 172 సీట్లు సాధించడంలో విఫలమై నప్పటికీ ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం, లిబరల్‌ పార్టీ 145 స్థానాల్లో విజయం సాధించి, మరో 23 స్థానాల్లో ఆధిక్యతలో వుండి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా కన్జర్వేటివ్‌ పార్టీ 134 స్థానాలకే పరిమితమైంది. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఈ పరిస్థితుల్లో కన్జర్వేటివ్‌ నేత పియరీ పొయిలివర్‌ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఫ్రాంకోయిస్‌ బ్లాంకెట్‌ నేతృత్వంలోని బ్లాక్‌ క్యూబికాయిస్‌ పార్టీ 22 సీట్లలో గెలుపొందింది. ఖలిస్తానీ అనుకూల జగ్మీత్‌ సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్‌ పార్టీ నాలుగు సీట్లలోనే గెలుపొందింది. బుర్నాబై సెంట్రల్‌ సీటు నుండి పొటీ చేసిన జగ్మీత్‌ సింగ్‌ ఓడిపోవడంతో ఎన్‌డిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్‌ చేపట్టిన టారిఫ్‌ల యుద్ధం, కెనడాను తమ దేశంలో చేర్చుకుంటామని, 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో కెనడాలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో జస్టిన్‌ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దాంతో లిబరల్‌ పార్టీ సభ్యులు ప్రధానిగా మార్క్‌ కార్నీని ఎన్నుకున్నారు. అనంతరం కార్నీ ముందస్తు ఎన్నికలను ప్రకటించడంతో సోమవారం (28న) ఎన్నికలు జరిగాయి.
విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్‌ ప్రస్తావన
ట్రంప్‌ మెజారిటీ సీట్లు సాధించకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించిన లిబరల్‌ పార్టీ నేత మార్క్‌ కార్నీ ఒట్టావాలో విజయోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ బెదిరింపులను ప్రస్తావిస్తూ, ”అమెరికా నేత మనల్ని సొంతం చేసుకోవడానికి మనల్ని చీలుస్తామని బెదిరిస్తున్నారు. కానీ అదెన్నటికీ జరగదు” అని కార్నీ స్పష్టం చేశారు. అమెరికా బెదిరింపుల నేపథ్యంలో కెనడా ప్రజలందరూ సమైక్యంగా వుండాల్సిన ప్రాముఖ్యతను గుర్తించాలని కోరారు. అమెరికా జరిపిన ద్రోహం నుండి మనం బయటపడ్డాం. కానీ మనం ఈ గుణపాఠాలను ఎన్నడూ మర్చిపోరాదన్నారు. అయితే రెండు సార్వభౌమాధికార, స్వతంత్ర దేశాలుగా తాను, ట్రంప్‌ భవిష్యత్తుపై చర్చలు జరుపుతామని అన్నారు.
ప్రధాని మోడీ అభినందనలు
కెనడా ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మార్క్‌ కార్నీకి ప్రధాని మోడీ అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు మోడీ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img