Friday, November 21, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిగ్రంథాలయాలు-మనోవికాస కేంద్రాలు

గ్రంథాలయాలు-మనోవికాస కేంద్రాలు

- Advertisement -

ఒక పుస్తకం మంచి మిత్రుడితో సమానమని నానుడి. మానవుడు సృష్టించిన అద్భుతాల్లో అగ్రగణ్యమైనది ఏదైనా ఉందంటే అది పుస్తకం. ఆది మానవ దశ నుంచి ఆధునిక నాగరికత వరకూ మనిషి చేసిన ప్రతి ఆవిష్కరణ, ప్రతి సంస్కృతి వికాసం, ప్రతి జ్ఞాన సంపత్తి పుస్తక రూపంలో నిలిచిపోయింది. ఆలోచనలు మసక బారినా, ఆలోచనల యుద్ధంలో పుస్తకాలే నిజమైన ఆయుధాలు. చదవడం తెలిసినవాడు ఆధునిక టెక్నాలజీ భ్రమలో పఠనాన్ని వదిలేస్తే, ఆ చదువుకు సార్ధకత ఎక్కడుంటుంది? కాలం మారుతుంది, మానవ సంబంధాలు మారుతున్నాయి. నేటి మిత్రులు రేపటి శత్రువులు కావొచ్చు! తన సొంత పిల్లలు తనను కాదనవచ్చు! నమ్మినవారు మోసం చేయవచ్చు! కానీ ఈ లౌకికసమాజంలో నిజమైన, నమ్మదగిన, శాశ్వతమైన మిత్రులు పుస్తకాలే.

గతంలో ప్రతి విద్యావంతుడి ఇంట్లో పుస్తకాల గది ఉండేది. ఇప్పుడు ఆ పుస్తకాభిరుచి రోజురోజుకూ తగ్గుతున్నది. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ఈ-పుస్తకాలు, ఆడియో పుస్తకాలు ఇవన్నీ పఠనాన్ని సులభతరం చేశాయి. అవన్నీ పుస్తకాన్ని మరుగున పడవేయలేవు. మానసిక ఏకాగ్రతను పెంచడానికి, విమర్శనాత్మకమైన ఆలోచనలను ప్రేరేపించడానికి ప్రత్యామ్నాయం కావు. ఇదే విషయానికి అంతర్జాతీయ పరిశోధనల్లో బలమైన ఆధారాలు ఉన్నాయి. అమెరికా, స్వీడన్‌ వంటి అధిక టెక్నాలజీ వినియోగ దేశాల్లో చిన్నారుల మేధోపరిమళం, ఏకాగ్రత, చదువు అలవాట్లలో బలహీనత పెరుగుతున్నట్లు అధ్యయనాలు చూపాయి. అదే సమయంలో ఇటలీ, హంగేరీ వంటి పుస్తక పఠనాన్ని ప్రధానంగా పరిగణించే దేశాల విద్యార్థులు ప్రజ్ఞాపరంగా ముందంజలో ఉన్నారు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, మన మెదడు లోతుగా నేర్చుకునే శక్తి కాగితం మీద చదివినప్పుడే అత్యధికంగా పనిచేస్తుంది. అక్షరాల స్పర్శ, పేజీ మలుపు, దర్శనం-ఇవి మనసులో జ్ఞానాన్ని చెక్కుతాయి. ఈ-పుస్తకాలు వేగాన్ని ఇస్తాయి, కానీ లోతుల్లోకి వెళ్లాలంటే పుస్తకాలు తప్పనిసరి చదవాల్సిందే.

నేడు సమాజంలో గ్రంథాలయాల ప్రాధాన్యం మరింత పెరిగింది. గ్రంథాలయం అనేది కేవలం పుస్తకాల సమాహారం కాదు, అది ఆలోచనల సముద్రం.సాహిత్యం, విజ్ఞానం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, నైతిక భావజాలం-ప్రతి రంగాన్ని మన కండ్ల ముందుకు తెచ్చే వేదిక. ఒక మంచి గ్రంథాలయం సమాజంలోని ప్రతి వర్గానికి సమానంగా చేరువై, విద్య లోపాలను తొలగించి, జ్ఞాన సామాజికతను పెంచు తుంది. గ్రంథాలయం మనిషిని స్వయం విద్యార్థిని చేస్తుంది. క్లాసులు, గురువులు లేకున్నా, ఒక పుస్తకం మనకు మార్గదర్శి అవుతుంది. గ్రంథాలయాల్లో గడిపిన గంటలు, జీవితాన్ని మార్చే శక్తి కలిగినవి. ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్తలు, రచయితలు, తత్త్వవేత్తలుందరి వెనక ఒక గ్రంథాలయ కథ తప్పనిసరిగా ఉంటుంది. డిజిటల్‌ పుస్తకాల వినియోగం పెరగడం మంచి సంకేతమే. కానీ డిజిటల్‌ పుస్తకాలతో పోలిస్తే ప్రత్యక్ష పుస్తకాల పఠనం ఇచ్చే ఆలోచనా శక్తి, ఏకాగ్రత, స్పష్టత ఈ పుస్తకాల్లో దొరకదు. ఈ-పుస్తకాలు ప్రయాణంలో సౌకర్యం కలిగించవచ్చు కానీ పుస్తకపు పుటల్లో దాగిన ఆత్మీయత మాత్రం భర్తీ కాదు.

ఈ రోజుల్లో విద్యార్థులు, యువత టెక్నాలజీ ఆకర్షణలో పుస్తక పఠనాన్ని వదిలేస్తున్నారు. ఎన్నికలు, ఉద్యోగాలు, సోషల్‌ మీడియా లాంటి వాటిలో విలవిలలాడుతున్న ఈ సందర్భంలో గ్రంథాలయాల వారోత్సవాలు పుస్తకాల పట్ల మళ్లీ ఆరాధనను తిరిగి పుస్తకు పాఠకులకు తోడ్పడుతున్నది. అయితే ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. గ్రామ, పట్టణ, నగర స్థాయిల్లో గ్రంథాలయాలను ఆధునీకరించాలి. తాజా పుస్తకాల కొనుగోలు కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి. పిల్లలు-యువత కోసం పఠన కార్యక్రమాలు, పుస్తక ఉత్సవాలు నిర్వహించాలి. డిజిటల్‌ గ్రంథాలయాల్ని ఏర్పాటు చేసి, పుస్తకాలను అందరికీ చేరువ చేయాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్ననాటి నుంచే పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. కుటుంబాల్లో ‘పుస్తక మూల’ ఏర్పాటు చేయాలి. చదువుతున్న పిల్లలను ప్రశంసించాలి. టెక్నాలజీ ఎంత ముందుకు దూసుకెళ్లినా, పుస్తకపు పుటలు తెరవకుండా నిజమైన జ్ఞానం సంపాదించలేం. అందుకే గ్రంథాలయం మన జ్ఞాన సంస్కృతికి ప్రాణం. పుస్తక పఠనం మన వ్యక్తిత్వ వికాసానికి మూలాధారం. అందుకే పుస్తకాన్ని పక్కన పెట్టకండి, చేతిలోకి తీసుకోండి. గ్రంథాలయాన్ని మరచిపోవద్దు, అక్కడికి వెళ్లి జ్ఞానాన్ని సేకరించండి.

మేకిరి దామోదర్‌
9573666650

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -