Friday, February 6, 2026
E-PAPER
Homeబీజినెస్ఎల్‌ఐసీ ఫలితాలు ఆకర్షణీయం

ఎల్‌ఐసీ ఫలితాలు ఆకర్షణీయం

- Advertisement -

క్యూ3 లాభాల్లో 17 శాతం వృద్ధి

ముంబయి : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.12,930 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.11,008 కోట్ల లాభాలతో పోల్చితే 17 శాతం వృద్ధిని సాధించింది. క్రితం క్యూ3లో ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం నికర ప్రీమియం ఆదాయం 17 శాతం పెరిగి రూ.1.26 లక్షల కోట్లకు చేరింది. 2024-25 ఇదే క్యూ3లో రూ.1.07 లక్షల కోట్ల ప్రీమియంను నమోదు చేసింది.

1.16 కోట్ల పాలసీల విక్రయం..
ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో ఎల్‌ఐసీ మొత్తంగా 1,16,63,856 పాలసీలను విక్రయించగా.. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో 1,17,10,505 పాలసీల అమ్మకాలను నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.3,40,563 కోట్లుగా ఉన్న మొత్తం ప్రీమియం ఆదాయం.. 2025 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల్లో 9.02 శాతం పెరిగి రూ.3,71,293 కోట్లుగా చోటు చేసుకుంది.

రూ.59.16 లక్షల కోట్లకు చేరిన ఆస్తులు
2025 డిసెంబర్‌ ముగింపు నాటికి ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) 8.01 శాతం పెరిగి రూ.59,16,680 కోట్లకు చేరింది. 2024 ఇదే సమయం నాటికి రూ.54,77,651 కోట్లుగా ఎయుఎం ఉంది. జీవిత బీమా మార్కెట్‌లో రెండు డజన్ల పైగా కంపెనీలున్నప్పటికీ బీమా వ్యాపారంలో ఎల్‌ఐసీ ఇప్పటికీ 57.07 శాతం వాటాతో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది. 2024 డిసెంబర్‌ నాటి 57.42 శాతం వాటాతో పోల్చితే స్వల్పంగా తగ్గింది.

గురువారం బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేర్‌ 0.65 శాతం పెరిగి రూ.840.45 వద్ద ముగిసింది. ” ఎల్‌ఐసీలో ఉత్పత్తులు, ఛానెల్‌ వైవిధ్యంతో పాటు వృద్ధి సాధించాము. వ్యక్తిగత వ్యాపారంలో నాన్‌ పార్‌ వాటా భారీగా పెరిగింది. డిజిటల్‌ ప్రాజెక్టులతో పాటు గ్రామీణ ప్రాంతంలో మహిళ ఏజెంట్లను పెంచేందుకు బీమా సఖి యోజనను ముందుకు తీసుకెళ్తున్నాము. 2025 డిసెంబర్‌ ముగింపు నాటికి ఎల్‌ఐసీలో 2.97 లక్షల మంది బీమా సఖిలుగా నియమించబడ్డారు.” అని ఎల్‌ఐసీ సీఈఓ అండ్‌ ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -