జీవితం

జీవితంఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం. ఒక్కొక్కరు ఒక్కో దిక్కు పరుగులు పెట్టాల్సిందే. ఇలా జీవితాల్లో హడావుడి ఎక్కువై ఆనందం తగ్గిపోతోంది. ఏ రాత్రికో నలుగురూ ఇంటికి చేరినా ఓ గంట కూర్చుని కబుర్లు చెప్పుకుంటే మనసులోని బాధంతా ఎగిరిపోతుంది.
కొందరికి జీవితం అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. మరికొందరికి ఏదో పుట్టాము, బతికాము, చచ్చిపోయాము అన్నట్టు ఉంటది. ఈ రెండూ కాకుండా జీవితం ఉన్నదే ఆనందించడానికి అనేవారూ ఉన్నారు. ప్రతి మనసూ భిన్నంగా ఆలోచిస్తుంది. ఇది సహజం. ఇక విద్యార్థులకు చదువుల టెన్షన్‌… పెద్దలకు ఉద్యోగాలు, వ్యాపారాల్లో టెన్షన్‌. ఒంటరిగా ఉంటే బోర్‌ కొడుతుంది. ఒత్తిడి, డిప్రెషన్‌… ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా వీటిల్లో ఏదో ఒక మాట చెప్పకుండా ఉండరు. ఏదో తెలియని వెలితి, భవిష్యత్తు పట్ల అనిశ్చితి ఈతరాన్ని నిత్యం వెంటాడుతుంటాయి.
ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. మన కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉండేది. అందరూ ఒకే దగ్గర నివసించే వారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, అనురాగాలు, అప్యాయతలు గొప్పగా ఉండేవి. ఎలాంటి సమస్య వచ్చినా అండగా మన వాళ్లు ఉన్నారు అనే భరోసా ఉండేది. అయితే కాలంతో పాటు అన్నీ మారిపోయాయి. చదువులూ, ఉద్యోగాల కోసం సొంతూరికి దూరంగా ఉండాల్సి వస్తోంది. మూడు నాలుగు తరాలు కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాలు పోయి ఒకరూ ఇద్దరు పిల్లలతో జీవించే చిన్న చిన్న కుటుంబాలు మిగిలిపోయాయి. ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం. ఒక్కొక్కరు ఒక్కో దిక్కు పరుగులు పెట్టాల్సిందే. ఇలా జీవితాల్లో హడావుడి ఎక్కువై ఆనందం తగ్గిపోతోంది. ఏ రాత్రికో నలుగురూ ఇంటికి చేరినా ఓ గంట కూర్చుని కబుర్లు చెప్పుకుంటే మనసులోని బాధంతా ఎగిరిపోతుంది. కనీసం అది కూడా లేదు. టీవీలు చూస్తూ కూర్చోవడం లేదా ఫోన్లలో తల దూర్చడం. ఉన్న ఆ నలుగురు కూడా ఎవరికి వారు యమునా తీరుగా ఉన్న ఆ కాసేపు గడిపేస్తున్నారు.
మన జీవితాలు ఇలా ఉంటే ఒత్తిడి, ఒంటరితనం మనల్ని వదిలి ఎలా వెళ్లిపోతాయి. లోలోపలే పేరుకుపోయి భౌతిక, మానసిక ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తాయి. జీవితాన్ని జీవించకుండా భారంగా మోయాల్సి వస్తుంది. ఇలా దైనందిక జీవితంలో నిరాశానిస్పృహలు, గందరగోళ పరిస్థితుల ఫలితంగా ఏర్పడే కోపం, చిరాకు, ద్వేషం ఎక్కువవుతున్నాయి. జీవితంలో సమతుల్యత దెబ్బతింటోంది. మనశ్శాంతి కరువవుతోంది. ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడేందుకు సంతృప్తిని కలిగించే మార్గాలకోసం, సమాధానాల కోసం వెతుక్కుంటున్నారు అనేక మంది.
అయితే ఈ సమస్యకు కారణం అందరికీ తెలుసు. ప్రయత్నిస్తే పరిష్కారమూ తెలుస్తుంది. జీవితం అంటే చాలా మందికి అసంతృప్తి, నెరవేరని కలలు, హడావుడి… ఇలా జాబితా అంతులేనిది. కొద్ది మంది అసలు విలువను గ్రహించినవారు మాత్రమే ప్రతి చిన్నదాంట్లో ఆనందాన్ని వెదుక్కుంటారు. జీవితం అనేది సహజమైన, ఆకస్మిక మార్పుల పరంపర. వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి. సహజంగా ముందుకు సాగిపోవాలి. కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, సవాళ్లు, పరీక్షా సమయాలు ఇవన్నీ కచ్చితంగా ఉంటాయి. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనప్పుడు మాత్రమే మనిషి మనిషిగా ఎదుగుతాడు. ఇలా ఎదగాలంటే నిత్యం పనిలో నిమగమై ఉండటమే పరిష్కారం. నచ్చిన పనుల్లో మనల్ని మనం బిజీగా ఉండాలి. ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనం చేసే పనిలో ఆనందాన్ని వెదుక్కోండి. ముఖ్యంగా జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరుచుకుంటే అసలు సమస్యలనేవే ఉండవు కదా!

Spread the love