Monday, February 16, 2026
E-PAPER
Homeదర్వాజబతుకు దివిటీలు

బతుకు దివిటీలు

- Advertisement -

అమ్మలను మించిన
అమ్మలు కదా వాళ్ళు
పొత్తిళ్ళలోని పసిబిడ్డల్లా
రోగుల్ని కాపాడే తల్లులు కదా వాళ్ళు
బతుకు గాయాల్ని పంటి బిగువున అదిమి పెట్టి
నవ్వులు పూసే పువ్వులు కదా వాళ్ళు
మనిషిని మానవత్వంతో చూడడమే తప్ప
కులాన్నో మతాన్నో వెదికి
ద్వేషం చిమ్మని సిసలు మనుషులు కదా వాళ్ళు
పొద్దున్నే మల మూత్రాలు సహా దేహాన్ని శుభ్రపరచి
మల్లెపువ్వు లాంటి పడక మీద చేర్చే
ఆత్మ బంధువులు కదా వాళ్ళు
రసి కారే పుండ్లైనా, రక్తమోడే గాయాలైనా, ఆపరేషన్‌ కుట్లైనా
చీదరించక మలాము పూసే మహిమాన్వితులు కదా వాళ్ళు
నిదురన్నది మరచి ఎంత రాత్రైనా
కనిపెట్టుకు కాసే కాపలాదార్లు కదా వాళ్ళు
గంట గంటకు రీడింగులు రాసి, టైముకి మందులిచ్చి
బతుకు ఆశను వొంపే ఆశాదీప్తులు కదా వాళ్ళు
ఊరు, ప్రాంతం, రాష్ట్రం దాటి
బతుకు గంజి కోసం తమ ప్రాణాల్ని ఫణం పెట్టే
జీవ ప్రదాతలు కదా వాళ్ళు
పొందే జీతం చిగురంతైనా చింతను మరచి
కళకళ లాడే పచ్చని చెట్లు కదా వాళ్ళు
వాళ్ళు పేరుకు నర్సులు, సిస్టర్స్‌ కావొచ్చు
కానీ మానవ జాతి చరిత్రలో
నిజమైన బతుకు దివిటీలు కదా వాళ్ళు
– వి. ఆర్‌. తూములూరి, 9705207945

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -