Tuesday, March 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహక్కుల కోసం ఉప్పెనలా..

హక్కుల కోసం ఉప్పెనలా..

- Advertisement -

రంగారెడ్డి కలెక్టరేట్‌కు కదంతొక్కిన ఎర్రదండు
ఇబ్రహీంపట్నం నుంచి 15 కిలోమీటర్ల పాదయాత్ర
ప్రారంభించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
సాగు భూములన్నింటికీ పట్టాలివ్వాలి
గూడులేని నిరుపేదలందరికీ ఇండ్లు, ఇండ్ల జాగాలివ్వాలి
ఈ పాదయాత్ర ఆరంభం మాత్రమేనని హెచ్చరిక
సాగులో ఉన్న రైతులకు పట్టాలిప్పిస్తామని కలెక్టర్‌ హామీ

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘సాగులో ఉన్న రైతుల భూములన్నింటికీ ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి. పేదలే కదా అని, వారి భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదు. బడా పెట్టుబడిదారుల పనులు చకచక జరిగిపోతున్నాయి. పేదల సమస్యలపై జాప్యమెందుకు..? గూడులేని నిరుపేదలందరికీ ఇండ్లు, ఇండ్ల జాగాలు ఇవ్వాల్సిందే..’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజక వర్గాల పరిధిలో నెలకొన్న భూ సమస్యలు, ఇండ్లు, ఇండ్ల జాగాలు, గ్రామీణ ఉపాధి హామీ చట్టం పెండింగ్‌ బిల్లులు, తదితర ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నిర్వహించిన చలో కలెక్టరేట్‌ పాదయాత్ర దండు ఉప్పెనలా సాగింది. ఇబ్రహీంపట్నం నుంచి కొంగర్‌కలాన్‌లోని కలెక్టరేట్‌ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర సీపీఐ(ఎం) పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్రను ఇబ్రహీంపట్నంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ జెండా ఊపి ప్రారంభించారు.

మార్గమధ్యలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. ఆరు మండలాల నుంచి వేలాదిగా పాల్గొన్న ప్రజానీకంతో జాన్‌వెస్లీ సైతం నడించారు. ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారికి అండగా ఉంటామని భరోసానిస్తూ.. పాదయాత్రను ముందుకు నడిపించారు. 15 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ.. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ.. ప్రజలు తమ గళాన్ని వినిపించారు. అనంతరం సీపీఐ(ఎం) బృందం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో దాదాపు గంట పాటు చర్చలు జరిపింది. 12 ఆంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తూ.. ఆయన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చి, సంబంధిత అధికారులతో ఫొన్‌లో మాట్లాడారు. సాగులో ఉన్న రైతులకు తప్పకుండా పట్టాలిప్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

అంతకుముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ఈ పాదయాత్ర ప్రారంభం మాత్రమేనని, ప్రభుత్వాల వైఖరి మారకుంటే.. భవిష్యత్‌లో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. రామోజీ ఫిల్మిం సిటీలో పేదలకు ఇచ్చిన ఇండ్ల జాగాలను వారికే అప్పగించడానికి ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పదేండ్లు తీసుకుంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నర ఏండ్లు గడిచినా పరిష్కారం చూపడం లేదని అన్నారు. నాటి ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లంటూ పదేండ్లు కాలయాపన చేసిందని, నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ప్రజలకు న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2004లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్యాబ్‌సిటీ, ఓఆర్‌ఆర్‌ కోసం రావిర్యాల, జన్నాయిగూడ రైతుల నుంచి తీసుకున్న భూములకు నేటికీ పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ఇటీవల వారికి ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేస్తామని హామీ ఇచ్చి, మధ్యలోనే నిలిపివేయడం వెనుక ఎవరి కుట్ర ఉందో చెప్పాలన్నారు. తరతరాలు సాగులో ఉన్న నందివనపర్తి, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల రక్షిత కౌలు రైతులకు పట్టాలివ్వాలన్నారు. జిల్లాలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే ఆ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోడ సామేల్‌, దుబ్బాక రాంచందర్‌, డి.జగదీశ్‌, ఏర్పుల నర్సింహ, కందుకూరి జగన్‌, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు, ఆరు మండలాల నుంచి వేలాది మంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -