Tuesday, October 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ

ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ

- Advertisement -

2,601 దుకాణాల కేటాయింపు
వివిధ కారణాలతో 19 షాపుల డ్రా నిలిపివేత
డిసెంబర్‌ 1నుంచి కొత్త దుకాణాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిం ది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు వచ్చిన 95,137 దరఖాస్తులను 34 కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి 2,601 షాపులను కేటాయించారు. వివిధ కారణాలతో 19 దుకాణాల లాటరీ నిలిపివేశారు. మండలం, జిల్లా, మున్సిపాల్టీ, కార్పొరేషన్‌ పరిధిలో షాపులు దక్కించుకున్న వారు రెండ్రోజుల్లో నిర్దేశిత లైసెన్స్‌ ఫీజులో మొదటి విడుత చెల్లించి కన్ఫర్మేషన్‌ లెటర్‌ పొందాలని అధికారులు పేర్కొన్నారు. కొత్త షాపులు డిసెంబర్‌ ఒకటి నుంచి అందుబాటులోకి రానున్నాయని, 2027 నవంబర్‌ 30 వరకు రెండేండ్లు వీటి కాలపరిమితి ఉంటుందని తెలిపారు. 2023లో 1.32 లక్షల దరఖాస్తులు రాగా ఈసారీ 37 వేలకుపైగా తగ్గాయి. దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు పెంచడంతో పాటు పలు చోట్ల వ్యాపారులు సిండికేట్‌ కావడంతో తక్కువ అప్లికేషన్లు వచ్చినట్టు భావిస్తున్నారు. దరఖాస్తులు తగ్గినా ఫీజు పెంపుతో గతం కంటే రూ.200 కోట్ల వరకు అధికంగా ఆదాయం వచ్చింది. దరఖాస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే మూడొంతులకు పైగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి దాని చుట్టు పక్కల ప్రాంతాల నుంచే రావడం గమనార్హం.

నిలిచి పోయిన షాపులకు నవంబర్‌ 3న డ్రా
వివిధ కారణాలతో నిలిచిపోయిన 19 మద్యం దుకాణాలకు డ్రా ను నవంబర్‌ 3న నిర్వహించనున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్‌ శాఖ ఈనెల 28న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. నవంబర్‌ ఒకటి వరకు ఐదు రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. నిలిచిపోయిన వాటిలో ఆసిఫాబాద్‌ జిల్లాలో 7, ఆదిలాబాద్‌ జిల్లాలో 6, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2, శంషాబాద్‌ ఎక్సైజ్‌ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలో ఒక షాపు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -