నివాళి
మిత్రుడు సహచరుడు తంగిరాల చక్రవర్తి ఆగస్టు 16న ఉదయం గుండెపోటుతో హఠాత్మరణం చెందడం మమ్ముల దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికీ ఆ వార్తను కానీ, వారు లేనితనాన్ని గానీ నిజమని నమ్మలేకపోతున్నాం. మూడు దశబ్దాలకు పైగా పరిచయం, స్నేహం, సాహిత్య ప్రయాణంలో కలిసి పనిచేసినవాళ్లం. ఉమ్మడి రాష్ట్రంలోనే ఏర్పడిన సాహితీ స్రవంతిలో నేనూ తంగిరాల వున్నాం. ఆ తర్వాత తెలంగాణ సాహితి ఏర్పడ్డాక, రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా తంగిరాల కొనసాగుతున్నారు. అంతకుముందు వారమే రాష్ట్రంలో సాహిత్య కారక్రమాల గురించి కమిటీ సమావేశంలో చర్చించాం. సాహిత్య కారక్రమమాలలో కార్యకర్తగా, నిర్వాహకుడుగా మా అందరికీ అండగా వున్నారు. హైద్రాబాద్ నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలోని సాహితీకారులతో విస్తృత సంబంధాలున్న వారాయన. నిరాడంబరుడు, స్నేహశీలి. సహృదయత అతని ఆభరణాలు. అభ్యుదయ సాహితీ వారసత్వాన్ని కొనసాగించిన ఆశయ బద్ధుడు. వామపక్ష భావాలకు నిబద్ధుడు.
పుట్టి పెరిగింది కృష్ణాజిల్లా కపిలేశ్వరపురంలో అయినా గత మూడున్నర దశాబ్దాలుగా హైదరాబాద్‌లోనే వృత్తిని, ప్రవృత్తిని కొనసాగించారు. వివిధ ప్రక్రియల్లో యాభై పుస్తకాలకు పైగా రాశారు. దాదాపు అన్ని ప్రక్రియలలో రచనలు చేశారు. ఆంధ్ర యూనివర్శిటీలో ఎం.ఏ తెలుగు సాహిత్యంలో చేశారు. మొదట ప్రజాశక్తి పత్రికలో లేఖలు రాయడంతో మొదలైన వారి పత్రికా రచన, ఆ తర్వాత చాలాకాలం ప్రజాశక్తి దినపత్రికలో చేరి పనిచేశారు. ఆ తర్వాత నవతెలంగాణ పత్రికలో ఫ్రూఫ్‌రీడర్‌గా, సబ్‌ఎడిటర్‌గా, పబ్లిషింగ్ హౌస్‌లో పనిచేస్తూనే పదవీ విరమణ పొందారు. తంగిరాల గారు పుస్తక పరిచయాలకు పెట్టింది పేరు. నవతెలంగాణ ‘సోపతి’కి, వార్త, ఆంధ్రజ్యోతి, ప్రభ, భూమి, ప్రజాశక్తి ‘స్నేహ’, సాహిత్య ప్రస్థానం, సాహితీకిరణం మొదలైన అనేక పత్రికలకు ఎంతోమంది కవులను, రచయితలను పరిచయం చేశారు. దాశరథి రంగాచార్య, సి.నారాయణరెడ్డి గార్లు మరణించినప్పుడు ‘నవతెలంగాణ’ పబ్లిషింగ్ హౌస్ తరపున వెంటనే వారిపై సంస్మరణ సంచికలను వారి ఆధ్వర్యంలోనే తీసుకురావడం జరిగింది. చాలా వేగంగా పుస్తకాలను చదివి సమీక్షలు రాసేవారు.
తెలంగాణ సాహితీ కార్యక్రమాలు ఎక్కుడ జరిగినా వక్తగా వెళ్లి హాజరయ్యేవారు. ఉపన్యాసంలో అనేకానేక సాహితీకారుల, సాహిత్య విషయాల ఉటంకింపులు విని మేము ఆశ్చర్యపోయేవాళ్లం. మహాకవులతో, రచయితలతో సంబంధాలున్నవారు. సాహిత్య సంఘటనలు కూడా అనేకం చెప్పేవారు. ‘నా గుండె సవ్వడి, ఆకాంక్ష, విసురు (రెక్కలు), ప్రతీక్ష, స్వర్ణ భారతీ, హృదయేశ్వరి’ మొదలైన కవితా సంపుటులను వెలువరించారు. ‘హంపన్న’ నర్సింహారెడ్డి, బళ్లారి రాఘవ, ‘అంబేద్కర్’, ‘చిన్ని చిన్ని ఆశ’, బాలభారతం, చిక్‌బుక్ రైలు మొదలైన బాలసాహిత్యాన్ని సృజించారు. ‘కథామందారం’, ‘చక్రవర్తి కథలు’ అనే రెండు కథా సంకలనాలు తెచ్చారు. ‘స్నిగ్థహృదయం’, నటుడు నరసింహం, ఆకలి, రాబందులు, సృష్టి విజ్ఞానం’ అనే నవలలూ రాశారు. ఇక వితంతు పునర్వివాహంపై ‘విచ్ఛిత్తి’, అసంఘటిత కార్మికుల జీవనంపై ‘గాలి బతుకులు’, తీవ్రవాదంపై ‘పునరింకితం’ హోటల్ కార్మికుల స్థితిగతులపై ‘చీడపురుగులు’, కళాకారుల బలహీనతలపై ‘మేడిపళ్లు’, ప్రెస్ కార్మికులపై ‘ఉషోదయం’, వరకట్న సమస్యలపై ‘వరశుల్కం’, హాస్యరస ప్రధానంతో ‘అద్దెఇల్లు’ వంటి నాటికలు రాశారు. ఈ నాటికలు ప్రముఖుల దర్శకత్వంలో, ప్రజానాట్యమండలి ద్వారా ప్రదర్శింపపడ్డాయి. ఎందరో ప్రముఖ రచయితలు రాసిన నాటకాలు, తనికెళ్ల భరణి ‘గోగ్రహణం’, హరనాథరావు రచించిన ‘నైవేధ్యం’, దివాకర బాబు రచించిన ‘కుందేటి కొమ్ము’, బలిజేపల్లి రచించిన ‘హరిశ్చంద్ర’, జంధ్యాల రచించిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’, ఆకెళ్ల ‘పెద్ద బాలశిక్ష’ మొదలైన నాటికలకు దర్శకత్వం వహించి ప్రదర్శింపజేశారు.
వీరి నాన్నగారు తంగిరాల శివరామకృష్ణ ప్రసాద్ నాటక రంగ ప్రముఖులు. అక్కినేని నాగేశ్వరరావుతో నాటాకాలు వేయించారు. నాన్నగారి కళావారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడమే కాక, నాన్నగారి పేరు మీద నాటకరంగ ప్రముఖులకు ప్రతియేడూ అవార్డును అందజేశారు. అలవోకగా తెలుగు నాటకరంగ చరిత్రను చెప్పగల అధ్యయన శీలి. అంతేకాక, పోసాన శేషగిరిరావు సారధ్యంలో ‘రంగస్థలి’ పత్రికను ‘తెలుగు రంగస్థలి’ సావనీర్‌ను తీసుకువచ్చారు. 2009 నుండి2014 వరకు సాహితీ కిరణం మాసపత్రికలో ‘నాటకరంగ సింహావలోకనం’ పేర 1867 నుండి 1999 వరకు నాటక రంగ చరిత్రను పాఠకులకు పరిచయం చేశారు. చివరిసారి పోతుకూచి సాంబశివరావు స్మారక సంచిక 2025కు సంపాదకత్వం వహించారు.
వైద్యశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను, విద్యావిషయక పుస్తకాలనూ వ్యాకరణ గ్రంథాన్ని, నింఘటువునురాశారు. అనేక వ్యాస సంకలనాలను, అద్దేపల్లి సాహిత్య సమీక్షాదర్శిని, తెలంగాణ దర్శిని మొదలైన రచనలను వెలువరించారు. అఖిల భారత భాషాసాహిత్య సమ్మేళన్ (భోపాల్) జీవత సభ్యుడిగా కొనసాగారు. అనేక సాహిత్య పురస్కారాలూ పొందారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగినా, వామపక్ష భావాలకు ఆకర్షితుడై జీవితాంతం అంకితభావంతో నిబద్ధుడిగా వుండడం గొప్ప విషయం. ఆనాడు ‘ప్రజాశక్తి’ పత్రికలో వున్న మోటూరు హనుమంతరావు, బొమ్మారెడ్డి, తెలకపల్లి రవి గారల పరిచయాలతో ఎదిగినవాడు తంగిరాల. పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తూనే నిరంతర అధ్యయనం, రచనలు చేసిన చురుకైన సాహితీవేత్త తంగిరాల. పదిహేనేండ్ల క్రితమే గుండెకు చికిత్స చేసుకున్నా, ఏమాత్రం అలుపు లేకుండా సాహిత్య రంగంలో నిత్య చలనశీలుడుగా వున్నారు. ఇంత త్వరగా మన నుండి దూరమవుతారని ఊహించలేదు. వారి స్మృతి మనకెప్పుడూ ప్రేరణనిస్తూనే వుంటుంది. సాహిత్యంలో తంగిరాల చిరంజీవిగానే వుంటారు.
– కె.ఆనందాచారి
99487 87660
సాహితీ చక్రవర్తి తంగిరాల
- Advertisement -
- Advertisement -