Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి

చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి

- Advertisement -

అందరికీ వర్తింపజేయాలి : సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలనీ, దాన్ని అందరికీ వర్తింపజేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. వారి ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి జాన్‌వెస్లీ లేఖ రాశారు. లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని 2024 సెప్టెంబర్‌ తొమ్మిదో తేదీన ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత బడ్జెట్‌ నుంచి రు.33 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అయితే, లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తామనీ, లక్షకుపైగా రుణమున్న వారు ఆపై మొత్తాన్ని జులైలోగా చెల్లిస్తేనే వారికి రుణమాఫీ అవుతుందని అధికారులు చెప్పడంతో చాలామంది అప్పు తెచ్చి రుణం చెల్లించారని గుర్తుచేశారు. కానీ, నేటికీ రుణమాఫీ జరగలేదని ప్రస్తావించారు. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరగడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

2017 ఏప్రిల్‌ ఒకటో తేదీ కంటే ముందు, 2024 మార్చి 31 తర్వాత తీసుకున్న రుణానికి మాఫీ వర్తించకపోవడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోతు న్నారని పేర్కొన్నారు. బ్యాంకు రుణమే తప్ప, ఇతర కో-ఆపరేటీవ్‌ రుణాలకు ఇది వర్తించడంలేదని తెలిపారు. డాక్యుమెంట్లు, తదితర షరతులతో గతంలో ప్రకటించిన ఆర్హుల జాబితాను కుదించారనీ, వేలాది దరఖాస్తులు తిరస్కరించా రని పేర్కొన్నారు. రుణ గ్రహీతల సంఖ్య 32,476 ఉండగా ప్రభుత్వం రుణమాఫీ కోసం కేవలం రూ.33కోట్లు కేటాయించిందనీ, ఒక్కో లబ్దిదారులకు సగటున కేవలం రూ.10,200మాత్రమే రుణమాఫీ అవుతుందని తెలిపారు. ఈ నిబంధనలను ఎత్తేయాలని కోరారు. రుణమాఫీ కోసం రు.48 కోట్లు వెంటనే విడుదల చేయాలనీ, సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. పెట్టుబడి సాయం కింద రాయితీతో జీరో వడ్డీతో రూ.5 లక్షల కొత్తరుణం ఇవ్వాలనీ, చేనేత భరోసా పథకంలో జియోటాగ్‌ ఉన్న చేనేత కార్మికుడికి నెలకు రు.2వేలు, అనుబంధ కార్మికులకు ఇద్దరికి కలిపి రు.1000లు అమలు చేయాలని విన్నవించారు. జియోట్యా గింగ్‌ను నిరంతరంగా కొనసాగించాలని కోరారు.

సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. త్రిఫ్ట్‌ పథకం ద్వారా మరణించిన నేతన్నలకు బీమా అమలు చేయాలనీ, రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. నేతన్నలకు ఇంటి స్థలంతో పాటు, హౌస్‌కం వర్క్‌షెడ్‌లను ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మించాలనీ, పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వారి ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ రంగ సంస్థలకు ఏకరూప దుస్తులను అందించాలనీ, గతంలో రేషన్‌ షాపుల ద్వారా జనతా వస్త్రాలు అందించినట్టుగా చేనేత చీర, ధోవతి, లుంగీ అందించాలని కోరారు. ఊట నీరు వచ్చిన ప్రాంతాల్లో స్టాండ్‌ మగ్గాలతో పాటు హౌస్‌ కం వర్క్‌ షెడ్‌లను నిర్మించి క్లస్టర్లు ఏర్పాటు చేయాలనీ, నూలు, రంగులు, రసాయనాలపైనా, చేనేత చీరలపైనా జీరో జీఎస్‌టీ చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -