Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమెడికల్‌ కోర్సులో స్థానికత తప్పనిసరి

మెడికల్‌ కోర్సులో స్థానికత తప్పనిసరి

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ జీవో 33ని సమర్థించిన సుప్రీంకోర్టు
9,10,11, 12 తరగతులు తెలంగాణలో
చదవాల్సిందేనని తీర్పు
గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన
తీర్పును రద్దు చేసిన సీజేఐ ధర్మాసనం
సివిల్‌ సర్వీస్‌, పారామిలటరీ, డిప్యూటేషన్‌పై వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు మాత్రం మినహాయింపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణలో మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, డెంటల్‌ కోర్సులలో ప్రవేశాలకు నాలుగేండ్లు స్థానికత తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తెలంగాణలో మెడికల్‌ సీట్లు పొందాలంటే… 9, 10, 11, 12 తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందే అని తేల్చి చెప్పింది. ఈ నాలుగేండ్లు తెలంగాణలో చదివిన వాళ్లే మెడికల్‌ కోర్సు ప్రవేశాలకు స్థానికులుగా అర్హులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అందులో భాగంగా స్థానికత అంశంపై గతేడాది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 33ని సమర్థించింది. అలాగే తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి, డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నట్టు స్పష్టం చేసింది. మెడికల్‌ కోర్సు అడ్మిషన్లకు స్థానికతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 33పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయంలు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై గత నెల 5న జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని జస్టిస్‌ కె వినోద్‌ చంద్రన్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు సుమారు రెండు గంటల సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. సోమవారం ఈ పిటిషన్లపై 32 పేజీలతో కూడిన తీర్పును సీజేఐ ధర్మాసనం వెలువరించింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, 2017లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్‌ నిబంధనలను, అలాగే 2024లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే గతేడాది స్థానికత అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి సీట్లు పొందిన విద్యార్థులకు ఈ తీర్పు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనం ముందు ఉన్న అన్ని పిటిషన్లను డిస్మిస్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ రూల్స్‌…
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371డీ ప్రకారం జారీ చేయబడిన 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 33 నిబంధనలున్నాయని కోర్టు పేర్కొన్నది. అలాగే ఆలిండియా కోటాలో 15 శాతం సీట్లు కేటాయించడాన్ని కూడా స్వాగతించింది. అలాగే ప్రభుత్వం రూల్‌ 3 కింద చేసిన సవరణలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. తద్వారా ఈ కింద సందర్భాల్లో నిబంధనల్లో ప్రత్యేక సడలింపులు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే మెడికల్‌ కోర్సుల్లో స్థానిక అభ్యర్థి క్యాటగిరీ కోటాలో సీటు పొందాలంటే… ఈ మినహాయింపులకు సంబంధించి అధికారులు ధవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

నిబంధనల్లో ప్రత్యేక సడలింపులు…
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. నాలుగేండ్లు తెలంగాణ వెలుపల చదివినా వైద్య కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు కొన్ని ప్రత్యేక కేటగిరీలకు మినహాయింపులు లభిస్తాయి.
1) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు- తమ పిల్లలు చదివిన కాలానికి సరిపడా ఉద్యోగ కారణంగా రాష్ట్రం వెలుపల పనిచేసి ఉంటే.
2) ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌ వంటి ఆలిండియా సర్వీసెస్‌లో తెలంగాణ క్యాడర్‌కి చెందిన అధికారులు-తెలంగాణ వెలుపల విధులు నిర్వర్తించిన కాలానికి తగ్గట్టుగా మినహాయింపు.
3) రక్షణ దళాలు, సెంట్రల్‌ ఆర్ముడ్‌ పోలీస్‌ ఫోర్స్‌లో పనిచేసే తెలంగాణా సిబ్బంది- స్వస్థలంగా తెలంగాణను డిక్లేర్‌ చేసి ఉంటే, ఆ కాలానికి తగ్గట్టుగా మినహాయింపు.
4) తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని కార్పొరేషన్లు/ఏజెన్సీల్లో పనిచేసే వారు-ఉద్యోగ బదిలీల కారణంగా వెలుపల విధులు నిర్వర్తించిన కాలానికి అనుగుణంగా మినహాయింపు.

ఇదీ నేపథ్యం
మెడికల్‌ కోర్సు అడ్మిషన్లలో స్థానికతకు సంబంధించి నీట్‌కు ముందు నాలుగేండ్లు స్థానికంగా చదవాలని నిబంధనలను చేర్చుతూ… తెలంగాణ ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. జీవో 33లోని నిబంధన 3 (ఏ)లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి అభిరామ్‌తో పాటు మరో 160 మంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం… ”ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ లేవు. మొదట గైడ్‌లైన్స్‌, రూల్స్‌ రూపొందించాలి” అని ప్రభుత్వానికి సూచిస్తు విద్యార్థులకు ఫేవర్‌ గా గతేడాది సెప్టెంబర్‌ 5న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సెప్టెంబర్‌ 11న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad