ఇక నిర్వహణ ప్రభుత్వానిదే.. కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి ఝలక్
రెండో దశపై కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో ప్రత్యేక చొరవ
మెట్రో రెండో దశ విస్తరణకు అడ్డంకులు తొలగినట్టే
ఎల్ అండ్‌టీ ప్రతినిధులతో సీఎం ప్రత్యేక భేటీ
రూ.13వేల కోట్ల అప్పును స్వీకరించేందుకు అంగీకారం
రూ.2,100 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ ఇచ్చేస్తామన్న ఎల్ అండ్ టీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ కంపెనీ తప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అంగీకారం తెలిపింది. దీనితో ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎంఏయూడీ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్యరాజ్ పాల్గొన్నారు. ఎల్‌అండ్‌టీ గ్రూప్ సీఎండీ ఎస్‌ఎన్.సుబ్రహ్మణ్యన్, సీఎండీ సలహాదారు డికె.సేన్, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో మెట్రో రైలు ఫేజ్-1లో తమ మొత్తం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎల్‌అండ్‌టీ మెట్రోపై ప్రస్తుతమున్న దాదాపు రూ.13వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది.
దీంతోపాటు తమ కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ.2వేల కోట్లు వన్-టైమ్ చెల్లింపు అందించాలని ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతిపాదించింది. ఈ చెల్లింపు పూర్తి చేసిన వెంటనే మెట్రో మొదటి దశ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది.2014లో దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్, ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫేజ్-2ఏ, 2బీ విస్తరణలో భాగంగా 8 కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 163 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన మెట్రో విస్తరణ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రయివేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్-1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్-2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది. అందుకు వీలుగా ఒప్పందం(డెఫేనిటివ్ అగ్రిమెంట్) కావాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫేజ్ 2లో కూడా ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని సూచించింది.
కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మెట్రో ఫేజ్-2లోనూ ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యం పంచుకుంటే బాగుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగినంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఫేజ్-1, ఫేజ్-2 కారిడార్ల మధ్య సంయుక్త కార్యాచరణకు ఖచ్చితమైన ఒప్పందం అవసరమని సూచించారు. ఈ ఒప్పందం కుదిరితేనే విస్తరించే రైలు కార్యకలాపాలు సజావుగా సాగుతాయని, ఆదాయ వ్యయాల భాగస్వామ్యంలో స్పష్టత ఉంటుందని సీఎం అన్నారు. రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ తప్పుకున్నందు వల్ల కంపెనీ ఈక్విటీ భాగస్వామిగా ఉండలేదని ఎల్‌అండ్‌టీ సీఎండీ అన్నారు. 2002 జులై 22న కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వం అంగీకరించిన రూ.3వేల కోట్ల వడ్డీ లేని రుణంలో రూ.2100 కోట్లు బకాయి ఉందని గుర్తు చేశారు. చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-1 మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, ఆమోదం తొందరగా వచ్చే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు.